కోట్ల త‌ర్వాత‌.. ఛాన్స్ కోసం శ‌బ‌రి ప్ర‌య‌త్నం..!

మంత్రివ‌ర్గంలో చోటు కోసం.. రెండు రూపాల్లో ఆమె ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ.. టీడీపీలోనూ చ‌ర్చ సాగుతోంది.

Update: 2026-08-23 09:30 GMT

కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేర్పుల‌కు పావులు క‌దుపుతున్న స‌మ‌యంలో అనూహ్యంగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శ‌బ‌రి త‌న రాజ‌కీయాల‌ను ముమ్మ‌రం చేశారు. మంత్రివ‌ర్గంలో చోటు కోసం.. రెండు రూపాల్లో ఆమె ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ.. టీడీపీలోనూ చ‌ర్చ సాగుతోంది. ఇవి వ‌ర్క‌వుట్ అయితే.. శ‌బ‌రి కేంద్ర మంత్రి లేదా స‌హాయ మంత్రి అయ్యే అవ‌కాశం పుష్క‌లంగా ఉంద‌ని చెబుతున్నారు. పార్టీ ప‌రంగా కూడా..ఇది క‌లిసి వ‌స్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

1) రెడ్డి కోటా: రెడ్డి కోటాలో .. దాదాపు 20 ఏళ్ల కిందట సీమ నుంచి ఒక‌రు కేంద్ర మంత్రి అయ్యారు. కోట్ల సూ ర్య‌ప్ర‌కాశ్‌ రెడ్డి కాంగ్రెస్ హ‌యాంలో మంత్రిగా చ‌క్రం తిప్పారు. ఆ త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌రకు సీమ‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు. ఇప్పుడు అదే రెడ్డి కోటాలో శ‌బ‌రి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది రాజ‌కీయంగా కూడా టీడీపీకి వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ కానుంది. రెడ్డి వ‌ర్గాన్ని వైసీపీకి దూరం చేసే క్ర‌మంలో శ‌బ‌రికి కేంద్ర మంత్రివ‌ర్గంలోపోస్టు ఇస్తే.. ఎలా ఉంటుంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

2) మ‌హిళా కోటా: ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు కేంద్రం కూడా ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. 2029 సార్వ‌త్రిక ఎన్నిక‌ల సమ‌రం నాటికి ఈ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌నుంది. 33 శాతం మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇచ్చే ఉద్దేశం త‌మ‌కు ఉంద‌ని ప్ర‌ధాని కూడా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ముందుగానే దీనిని చేసి చూపిస్తే.. త‌మ‌కు మ‌రిన్ని మంచి మార్కులు ప‌డ‌నున్నాయి. అయితే.. ఎక్క‌డినుంచైనా మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇవ్వొచ్చు. అది ఏపీ నుంచే ఎందుకు? అనే ప్ర‌శ్న వ‌స్తుంది.

ఏపీపై ఎక్కువ‌గా బీజేపీ ఆశ‌లు పెట్టుకున్న ద‌రిమిలా.. ఆ అవ‌కాశం ఏపీకే ద‌క్క‌నుంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే శ‌బ‌రి కూడా త‌న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. మ‌హిళా ఎంపీగా ఫైర్ బ్రాండ్ నాయ‌కురా లిగా హిందీ స‌హా ఇంగ్లీష్‌, తెలుగులోనూ ఆమెకు భాషాప్రావీణ్యం ఉన్న నేప‌థ్యంలో కేంద్రంలో మంత్రి పీటం కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అటు మోడీ ద‌గ్గ‌ర‌, ఇటు చంద్ర‌బాబు ద‌గ్గ‌ర కూడా ఆమెకు మంచి మార్కులే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఏ చిన్న అవ‌కాశం ఆమెకు ల‌భించినా.. మంత్రి అయిపోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఇదే జ‌రిగితే.. కోట్ల త‌ర్వాత శ‌బ‌రి ఈ అవ‌కాశం ద‌క్కించుకున్న‌ట్టు అవుతుంది.

Tags:    

Similar News