అహో ఒహో ట్రంప్.. పొగడ్తల్లో ఒలింపిక్స్.. షాబాజ్ కు గోల్డ్ మెడల్!
అహో ట్రంప్.. ఆయన అడ్డుకట్ట వేయబట్టి సరిపోయింది కానీ.. కాంబోడియా-థాయ్ లాండ్ దేశాలు కొట్టుకు చచ్చేవి.;
అబ్బో ట్రంప్.. ఆయన అంత గట్టిగా ప్రయత్నం చేయకుంటే రెండేళ్ల పాటు సాగిన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఆగేది కాదు..
అహో ట్రంప్.. ఆయన అడ్డుకట్ట వేయబట్టి సరిపోయింది కానీ.. కాంబోడియా-థాయ్ లాండ్ దేశాలు కొట్టుకు చచ్చేవి. ..ఈ మాటలన్నది ఎవరో అమెరికాకు చెందిన విశ్లేషకుడు కాదు.. డొనాల్డ్ ట్రంప్ పార్టీకి చెందిన నాయకుడూ కాదు.. ఈ పొగడ్తలన్ఈన పాకిస్థాన్ కు ప్రధానిగా ఉన్న షాబాజ్ షరీఫ్ నోటినుంచి వెలువడిన ఆణిముత్యాలు. అటు ట్రంప్ పాలనలో అమెరికాలో అశాంతి చెలగుతున్నా.. ఇటు షాబాజ్ ప్రభుత్వాన్ని అఫ్ఘానిస్థాన్ తాలిబన్ సర్కారు సవాల్ చేస్తున్నా... ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీ మోత అన్నట్లుగా ఉంది వ్యవహారం. దీంతో షాబాజ్ ను పాకిస్థాన్ కు చెందిన రాజకీయ విశ్లేషకులు ఓ ఆట ఆడుకుంటున్నారు.
ఒలింపిక్ మెడల్ మావోడికే..
హుస్సేనీ హక్కానీ పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త. తన అంతర్జాతీయ అనుభవం నేపథ్యంలో ఆయన స్పందిస్తూ ట్రంప్ ను పొగడడంలో ఒలింపిక్స్ పెడితే అందులో తమ ప్రధాని షాబాజ్ కే గోల్డ్ మెడల్ వస్తుందని వెటకారం ఆడారు. పదేపదే ట్రంప్ ను ఆకాశానికి ఎత్తుతున్న వైనాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం ముగింపునకు ఈజిప్ట్ లోని షర్మ్-ఎల్-షేక్ లో శాంతి ఒప్పందం జరగ్గా అందులో షాబాజ్ పాల్గొని ట్రంప్ ను గొప్పగా కీర్తించారు. ఈ ఒప్పందం ట్రంప్ గొప్పదనం అంటే సరిపోయేది.. కానీ, అంతకుమించి పొగిడారు.
భారత్-పాక్ ఘర్షణను ఆపారంట..
ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకుని భారత్-పాకిస్థాన్ ఘర్షణను ఆపేశారంటూ షాబాజ్ చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఈ ఘర్షణలో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. కానీ, ట్రంప్ ప్రమేయం ఉందని షాబాజ్ అంటున్నారు. భారత్ మాత్రం ట్రంప్ జోక్యమే లేదని గట్టిగా ఖండిస్తోంది. థాయ్ లాండ్-కాంబోడియా కాల్పుల విరమణనూ ట్రంప్ ఘనతగా షాబాజ్ చెబుతుండడంతో పాక్ కు చెందినవారే హవ్వా ఇదేం చోద్యం అని అంటున్నారు.
కీలుబొమ్మలా ఎందుకీ పొగడ్తలు..
ట్రంప్ పై షాబాజ్ అంతగా ప్రశంసలు కురిపిస్తుండడంపై పాక్ లోనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ చేతిలో కీలుబొమ్మలా మారారని, దేశాన్ని అమ్మేశారని మండిపడుతున్నారు. ట్రంప్ ను ఇంతగా పొగిడే వ్యవహారం అంతా తమకు ఇబ్బందిగా మారిందని పాక్ చరిత్రకారుడు అమర్ అలీ జాన్ తప్పుబట్టారు.