ఆపరేషన్ సిందూర్ వేళ భారత్‌ పై పాక్ అనుకూల గ్రూపుల భారీ సైబర్ దాడులు!

భారత్ తన 'ఆపరేషన్ సిందూర్' మిషన్ లో కీలక దశలో నిమగ్నమై ఉన్న సమయంలోనే, పాకిస్థాన్ , దానితో అనుబంధం కలిగిన ముస్లిం దేశాల నుంచి భారత్‌పై భారీ ఎత్తున సైబర్ దాడులు జరిగినట్లు భారత దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.;

Update: 2025-05-15 07:08 GMT

భారత్ తన 'ఆపరేషన్ సిందూర్' మిషన్ లో కీలక దశలో నిమగ్నమై ఉన్న సమయంలోనే, పాకిస్థాన్ , దానితో అనుబంధం కలిగిన ముస్లిం దేశాల నుంచి భారత్‌పై భారీ ఎత్తున సైబర్ దాడులు జరిగినట్లు భారత దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ దాడుల్లో ప్రభుత్వ మద్దతు ఉన్న, అలాగే ప్రభుత్వేతర హ్యాకింగ్ గ్రూపులు పాలుపంచుకున్నాయని విశ్లేషణలో వెల్లడైంది. పాకిస్థాన్, తుర్కియే, బంగ్లాదేశ్, మలేషియా, ఇండోనేషియా, ఇరాక్, చైనాకు సంబంధించిన గ్రూపులు ఈ సైబర్ దాడులకు పాల్పడినట్లు నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, ఎంఎస్ఎంఈలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పవర్‌గ్రిడ్‌లు, రవాణా సేవలు వంటి కీలక మౌలిక సదుపాయాలను ఇవి లక్ష్యంగా చేసుకున్నాయి. బీఎస్ఎన్ఎల్, యూపీఐ, డిజిటల్ వాలెట్లు, స్టాక్ ఎక్స్‌ఛేంజీలు, పెద్ద కంపెనీలు కూడా ఈ దాడుల జాబితాలో ఉన్నాయి. రక్షణ రంగ సంస్థల నుంచి కూడా కీలక డేటాను దొంగిలించే ప్రయత్నాలు జరిగాయి. భారత డిజిటల్ ఆస్తులపై పాకిస్థాన్ జరిపిన సైబర్ యుద్ధంగా దీనిని ఇంటర్పోల్ ట్రైనర్ పెండ్యాల కృష్ణశాస్త్రి అభివర్ణించారు.

ఇటీవల ది సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ సైబర్ దాడికి గురైనప్పుడు, దాని సిస్టమ్‌లో 'మిస్టర్ హబిబ్404' పేరుతో "సురక్షితమే అని మీరు అనుకుంటున్నారా... మేము ఇక్కడే ఉన్నాం" అనే సందేశం కనిపించింది. ఆ తర్వాత వారి వెబ్‌సైట్‌ను పునరుద్ధరించారు.

ఈ దాడులకు పాల్పడినట్లు గుర్తించిన కొన్ని ప్రముఖ హ్యాకింగ్ గ్రూపులు ఇవీ..

ఇస్లామిక్ హ్యాకర్స్ ఆర్మీ (ఇరాక్)

టీమ్ అజ్రాయిల్-ఏంజెల్ ఆఫ్ డెత్ (పాలస్తీనా)

సైల్హెట్ గ్యాంగ్ ఎస్జీ (బంగ్లాదేశ్)

డైనెట్ (బంగ్లాదేశ్)

ఏపీటీ 36 (పాకిస్థాన్)

పాకిస్థాన్ సైబర్ ఫోర్స్

టీమ్ ఇన్సేన్ పాక్

మిస్టీరియస్ బంగ్లాదేశ్

ఇండో హ్యాక్ సెక్

సైబర్ గ్రూప్ హోక్స్

నేషనల్ సైబర్ క్రూ (పాకిస్థాన్)

ఈ గ్రూపులు గత వారం నుంచి తరచుగా దాడులు చేసి, భారత్ నుంచి డేటా చౌర్యం చేసినట్లు వందకు పైగా క్లెయిమ్స్ చేసుకున్నాయి. అయితే, వీటిలో ఎంతవరకు నిజం ఉందనేది భారత వర్గాలు అధికారికంగా ధృవీకరించలేదు. బంగ్లాదేశ్‌కు చెందిన సైల్హెట్ గ్యాంగ్ ఎస్జీ, డైనెట్‌లు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి 247 జీబీ డేటాను తస్కరించినట్లు పేర్కొన్నాయి. అయితే, క్లౌడ్ ఎస్ఈకే సంస్థ విశ్లేషణలో ఆ డేటా ఇప్పటికే బహిరంగంగా అందుబాటులో ఉన్నదేనని తేలింది. అజ్రాయిల్-ఏంజెల్ ఆఫ్ డెత్ గ్రూప్, ఎలక్షన్ కమిషన్ నుంచి పది లక్షల మంది డేటాను అపహరించినట్లు చెప్పగా, అది 2023లో రీసైకిల్ చేసిన పాత డేటాగా గుర్తించారు.

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో, పాకిస్థాన్ మద్దతుతో నడిచే హ్యాకింగ్ సంస్థలు భారత పవర్‌గ్రిడ్‌లో 70 శాతం కూలిపోయిందని ప్రకటించుకున్నాయి. అయితే, ఇది పూర్తిగా అవాస్తవమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. అలాగే, పాక్ యుద్ధంలో పైచేయి సాధించిందనే ప్రచారం కోసం శాటిలైట్‌ను జామ్ చేశామని, నార్తర్న్ కమాండ్‌తో సంబంధాలు తెంపేశామని, బ్రహ్మోస్ స్టోరేజీ డిపోను పేల్చామని కూడా ఈ ముఠాలు సోషల్ మీడియాలో ప్రచారం చేశాయి. ఇవన్నీ నిరాధారమైనవని తేలింది.

అయితే, కొన్ని హ్యాకింగ్ గ్రూపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్‌కు చెందిన ఏపీటీ 36 గ్రూపు (ట్రాన్సపరెంట్ ట్రైబ్ అని కూడా అంటారు) తీవ్రమైన ముప్పుగా పరిగణిస్తున్నారు. ఈ గ్రూపు మాల్వేర్ పేలోడ్స్ ద్వారా దాడులు చేస్తుంది. ఇది ఉపయోగించే 'అల్లాకొరె', 'క్రిమిసన్ రాట్' వంటి మాల్వేర్లు కంప్యూటర్లలోకి ప్రవేశిస్తే, దాడి చేసిన గ్రూప్‌కు వాటిపై పూర్తి నియంత్రణ లభిస్తుంది.

మొత్తంమీద, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున సైబర్ దాడుల ప్రయత్నాలు జరిగినప్పటికీ, వాటిలో చాలా వరకు ప్రచార ఆర్భాటమేనని, అయితే కొన్ని హ్యాకింగ్ గ్రూపుల నుంచి వాస్తవమైన ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కీలక రంగాల్లో సైబర్ భద్రతా చర్యలను మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News