సైన్యమే శత్రువైతే.. అదే పాకిస్థాన్.. దేశాధినేతలనే ఉరితీస్తుంది
ఓవైపు భారత్ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుని ముందుకు దూసుకుపోతుండగా.. మరోవైపు పాకిస్థాన్ ప్రభుత్వాలు సైన్యం చెప్పుచేతల్లో నడుస్తూ దేశాన్ని కుంగదీశాయి.;
’’ప్రతి దేశానికి సైన్యం ఉంటుంది.. కానీ, సైన్యానికే దేశం ఉంది.. దాని పేరు పాకిస్థాన్’’.. వినడానికి అతిశయోక్తిగా ఉన్నా.. ఇది నిజం. భారత్ కంటే పట్టుబట్టి ఒక్క రోజు ముందు స్వాతంత్ర్యం పొందిన పాకిస్థాన్ ఇప్పటివరకు 77 ఏళ్లలో దశాబ్దాల పాటు సైనిక పాలనలో మగ్గింది. 1958 నుంచి 2008 వరకు మూడుసార్లు సైనిక తిరుగుబాటు జరగడం గమనార్హం. అందుకనే పాక్ ను ఫెయిల్యూర్ కంట్రీ అని అంటారు.
అంతెందుకు? ప్రస్తుత ప్రధాని షాబాజ్ షరీఫ్ అన్న నవాజ్ షరీఫ్ కూడా సైన్యం బాధితుడే.
ఓవైపు భారత్ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుని ముందుకు దూసుకుపోతుండగా.. మరోవైపు పాకిస్థాన్ ప్రభుత్వాలు సైన్యం చెప్పుచేతల్లో నడుస్తూ దేశాన్ని కుంగదీశాయి. అక్కడ సైన్యం చెప్పిందే వేదం.. లేదంటే ప్రధానమంత్రి అయినా ఖతం. వారి మాటను ధిక్కరిస్తే ప్రభుత్వాలనే పడగొట్టేస్తుంది. 1999లో కార్గిల్ యుద్ధంలో ఓడిపోవడంతో నవాజ్ షరీఫ్ ను ఉన్నపళంగా పీకిపారేసి.. జనరల్ పర్వేజ్ ముషారఫ్ అధికారం చేపట్టాడు. 2008 వరకు అతడే సర్వం అన్నట్లు ఏలాడు.
1958లో తొలిసారి పాకిస్థాన్ లో ప్రభుత్వాన్ని సైన్యం కూల్చేసింది. 13 ఏళ్ల పాటు జనరల్ మొహమ్మద్ ఆయూబ్ ఖాన్ పాలన సాగించాడు. 1977లో మళ్లీ తిరుగుబాటు జరిగింది.. ఈసారి జనరల్ జియా ఉల్ హక్ చేతుల్లోకి వెళ్లింది పాకిస్థాన్. 1988 వరకు అతడే పాక్ ను ఏలాడు. మరో 11 ఏళ్లు గడిచాయో లేదో.. 1999లో ముషారఫ్ చేతబట్టాడు. దాదాపు 20 ఏళ్లు పాకిస్థాన్ సైన్యం చేతుల్లోనే ఉంది. దీన్నిబట్టే ఆ దేశంలో సైన్యం ఎంత శక్తిమంతం అయినదో చెప్పొచ్చు.
ఎన్నుకున్న ప్రభుత్వం అయితే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానులు ఉంటారు. కానీ, సైన్యంలో ఎక్కడికక్కడ స్థానిక అధికారులదే పెత్తనం అవుతుంది. వీరంతా పాకిస్థాన్ ను కుదేలు చేశారు. అవినీతితో దేశాన్ని లూటీ చేశారు.
ఎక్కడైనా శత్రువుగా భావించే దేశాలతో సైన్యం యుద్ధం చేస్తుంది. కానీ, పాక్ సైన్యం ఆ బాధ్యతను ఉగ్రవాదులకు అప్పగించి దేశాన్ని దోచుకోవడంపై పడింది. తమ శరీరంలో భాగమైన ఆయుధాలను పక్కన పారేసి.. భూ ఆక్రమణలకు దిగి వ్యాపార సామ్రాజ్యాలనే నెలకొల్పారు పాక్ సైనిక పాలకులు. ఇందులో ప్రధానంగా బాగుపడింది సైనిక జనరల్స్ అని చెప్పాలి.
రెండేళ్ల కిందట పాకిస్థాన్ లో గోధుమ పిండికీ యుద్ధాలు జరిగాయి. అంత పేదరికం ఉంది అక్కడ. కానీ, పాకిస్థాన్ సైనిక అధికారులు మాత్రం కోట్లకు పడగలెత్తారు. పెద్దపెద్ద భవనాల్లో ఉంటూ విలాసాల్లో మునిగితేలడమే వీరి పని.
ఒకవేళ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నా.. సైన్యందే పెత్తనం. 40 శాతం జనాభా దారిద్ర్యంలో ఉన్న పాకిస్థాన్ లో ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తం. ఇక అధిక ధరలు, ఆర్థిక సంక్షోభం గురించి చెప్పేదేముంది? ఇప్పటికే అప్పు 126 బిలియన్ డాలర్లు దాటింది. ఇవి తీర్చడానికే బడ్జెట్ లో 40 శాతం సొమ్ము పోతోంది. ఆకలి సూచీలో అట్టడుగున ఉంది. ఆర్థిక వృద్ధి రేటు 2.4 శాతమే. ఇక తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదంఉన్న బలూచిస్థాన్ లో 70 శాతం మంది పేదరికంలో ఉన్నారు. విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇచ్చే ఉద్దీపన ప్యాకేజీలు, కొన్ని దేశాల రుణాలతో పాక్ నెట్టుకొస్తోంది.
దేశంలో దరిద్రం ఇలా ఉంటే.. సైన్యం మాత్రం సంపదతో తులతూగుతోంది. చెప్పాలంటే.. రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, అగ్రి బిజినెస్, తయారీ, మీడియా, సరకుల రవాణాతో ఇదొక కార్పొరేట్ సంస్థలా మారి దండిగా సంపద పోగేసుకుంటోంది.
సైన్యంలోని కార్పొరేట్ సామ్రాజ్యం ఫౌండేషన్లు ఏర్పాటు చేసి పాక్షిక ప్రభుత్వ వ్యవస్థలా నడిపిస్తోంది. ప్రస్తుత, మాజీ సైనిక ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థలు చారిటీ ముసుగులో వ్యాపార దందా సాగిస్తున్నాయి. సంపద మాత్రం సైనిక ఉన్నతాధికారుల జేబుల్లోకి పోతుంది. మళ్లీ ఈ డబ్బునే తమకు కావాల్సిన రాజకీయ పార్టీలకు ఇస్తుంది. కింద స్థాయి సైనికులకు అందేది కూడా నామమాత్రమే.
ఇటీవల విరమణ చేసిన సైన్యాధిపతి జనరల్ కామర్ జావెద్ బజ్వా, అధికార ప్రతినిధి ఆసిమ్ సలీమ్ బజ్వా, ఆయన సోదరుడు నాలుగు దేశాల్లో 133 రెస్టారెంట్లు పెట్టారంటేనే అర్థం చేసుకోవచ్చు.
ఇక పాక్ భూభాగంలో 12 శాతం సైన్యం చేతిలో ఉందని చెబుతారు. ఇందులో మూడింట రెండొంతులు సీనియర్ సైనికాధికారుల కబ్జాలో ఉందట. రిటైర్ అయ్యేటప్పటికి వీరికి ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టడం సంప్రదాయంగా మారిందట.
సైన్యం మాట విననందుకే పాక్ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వాన్ని కూలదోశారు. 1979లో ఆయనను ఉరి తీశారు. ఈయన కుమార్తెనే మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో. ఈమె కుమారుడే ప్రస్తుతం పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో. ఇతడు 28 ఏళ్లకే 2022లో విదేశాంగ మంత్రి అయ్యాడు. బేనజీర్ భర్తనే ఆసిఫ్ జర్దారీ. గతంలో పాకిస్థాన్ అధ్యక్షుడిగా పనిచేశాడు.