పాక్ గగనతలం అందుబాటులో లేకపోతే విమాన ఛార్జీలు ఎంత పెరుగుతాయో తెలుసా ?

పహల్గామ్ ఉగ్రదాడిలో మరోసారి పాకిస్తాన్ కుట్ర బయటపడింది. కానీ ఎప్పటిలాగే పాకిస్తాన్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది.;

Update: 2025-04-28 05:37 GMT

పహల్గామ్ ఉగ్రదాడిలో మరోసారి పాకిస్తాన్ కుట్ర బయటపడింది. కానీ ఎప్పటిలాగే పాకిస్తాన్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. అయితే, ఈసారి భారత ప్రభుత్వం మాత్రం ఎలాంటి రాజీకి వచ్చేలా కనిపించడం లేదు. భారత ప్రభుత్వం పాక్ మీద వీసాల రద్దు నుంచి సింధు జలాల ఒప్పందం నిలిపివేత వరకు ఐదు కీలక చర్యలను తీసుకున్నట్లు ప్రకటించింది. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా భారతీయ విమానయాన సంస్థల కోసం తన గగనతలాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించింది

అయితే, ఈ నిషేధం అంతర్జాతీయ విమానయాన సంస్థలకు వర్తించదు. అంటే అంతర్జాతీయ విమానయాన సంస్థలు పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించి భారతదేశంలో ల్యాండ్ కావచ్చు. కానీ, పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ విమానయాన సంస్థలకు మాత్రం కాస్త టెన్షన్ పెంచెంది.పాకిస్తాన్ విధించిన ఈ నిషేధం వల్ల న్యూఢిల్లీ విమానాశ్రయం నుండి బయలుదేరే విమానాలపై ఎక్కువ ప్రభావం పడింది. ఇక్కడి నుండి పశ్చిమ దేశాలు, మధ్యప్రాచ్యం, ఉత్తర అమెరికా వెళ్లే విమానాల టిక్కెట్లు పెరిగే అవకాశం ఉంది.

వాస్తవానికి, పాకిస్తాన్ గగనతలం మూసివేయడంతో ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలు దేరే విమానాలు ఇతర వైమానిక మార్గాలను ఉపయోగించాల్సి వస్తోంది. చాలా విమానాలు అరేబియా సముద్రం, ఇరాన్, అజర్‌బైజాన్ గగనతలాన్ని ఉపయోగిస్తున్నాయి. పాకిస్తాన్ గగనతలం మూసివేయడం వల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా, విమానయాన సంస్థల వ్యయం కూడా గణనీయంగా పెరిగింది. ఎందుకంటే, ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల విమానాల ఇంధన వినియోగం పెరుగుతుంది.

విమానయాన సంస్థ మెయింటెనెన్స్ వ్యయంలో దాదాపు 30 శాతం ఇంధనం కోసమే ఖర్చవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విమానయాన సంస్థల ఖర్చు పెరిగిపోయింది. అంతేకాకుండా, ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల పైలట్ల రోస్టర్‌పై కూడా ప్రభావం పడుతోంది. దీని ప్రభావం ప్రయాణికుల జేబు మీద పడే అవకాశం ఉంది.

Tags:    

Similar News