పాకిస్థాన్ పాత అలవాటుపై భారత్ కీలక వ్యాఖ్యలు!

అవును... పాకిస్థాన్ పై ఆఫ్గాన్ చేస్తున్న దాడులు భారత్ చేయిస్తున్నవే అంటూ ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు.;

Update: 2025-10-16 14:27 GMT

పాకిస్థాన్‌ - అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన దాడుల్లో అనేక మంది సైనికులతో పాటు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల పాటు కొనసాగేలా ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. ఈ క్రమంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ పై తప్పుడు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా... ఆఫ్గాన్ నిర్ణయాలు కాబూల్ లో కాకుండా న్యూఢిల్లీలో తీసుకుంటున్నారని.. ఆఫ్గన్ తాలిబన్లు న్యూఢిల్లీ తరపున పాకిస్థాన్ పై ప్రాక్సీ యుద్ధం చేస్తున్నారని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆరోపించారు. అఫ్గాన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తాఖీ భారత్‌ లో పర్యటించిన విషయంపైనా అక్కసు వెళ్లగక్కారు. ఈ సమయంలో భారత్ నుంచి పాక్ మంత్రికి కౌంటర్ పడిపోయింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ స్పందించింది.

అవును... పాకిస్థాన్ పై ఆఫ్గాన్ చేస్తున్న దాడులు భారత్ చేయిస్తున్నవే అంటూ ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. ఇందులో భాగంగా... తాము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని.. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు ఆతిథ్యం ఇస్తుందని.. ఉగ్రవాద కార్యకలాపాలను స్పాన్సర్ చేస్తుందని అన్నారు. ఇదే సమయంలో.. పొరుగువారిపై నిందలు వేయడం పాకిస్తాన్ పాత అలవాటు అని జైస్వాల్ స్పందించారు.

ఇదే సమయంలో... ఆఫ్గనిస్తాన్ తన సొంత భూభాగాలపై సార్వభౌమాధికారాన్ని వినియోగించుకోవడం పట్ల పాకిస్తాన్ కోపంగా ఉందని.. అయితే, ఆఫ్గనిస్తాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్ర్యానికి మాత్రం భారతదేశం పూర్తిగా కట్టుబడి ఉందని రణధీర్ జైస్వాల్ అన్నారు. అదేవిధగా.. కాబూల్‌ లోని భారతదేశ సాంకేతిక మిషన్ రాబోయే రోజుల్లో పూర్తి స్థాయి రాయబార కార్యాలయంగా మారుతుందని జైస్వాల్ తెలిపారు.

అంటే... న్యూఢిల్లీ ఇంకా తాలిబన్ పాలనను అధికారికంగా గుర్తించనప్పటికీ.. ఆఫ్గన్ తో సంబంధాలను పునరుద్ధరించుకున్న నేపథ్యంలో ఆ దేశానికి గట్టి మద్దతు ఇస్తోందన్నమాట!

మరోవైపు ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఉత్తర వజీరిస్తాన్, దక్షిణ వజీరిస్తాన్, బన్ను జిల్లాల్లో నిఘా ఆధారిత పలు కార్యకలాపాలలో నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) లేదా ఫిట్నా అల్-ఖవారీజ్‌ కు చెందిన 34 మంది ఉగ్రవాదులను తమ భద్రతా దళాలు హతమార్చాయని పాకిస్తాన్ సైన్యం గురువారం తెలిపింది.

Tags:    

Similar News