తమ్ముడు నేనున్నా..పాక్ కు చైనా అభయహస్తం

అయితే షావో షిరెన్ యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదని, రెండు దేశాలు శాంతియుతంగా ముందుకు సాగడానికి మార్గాలను అన్వేషించాలని నొక్కి చెప్పారు.;

Update: 2025-05-01 16:15 GMT

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 26న ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమాయక పర్యాటకు 28మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు ఈ దాడికి కుట్ర పన్నడానికి, శిక్షణ పొందడానికి పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించినట్లు తేలింది. తమ పొరుగు దేశానికి హాని కలిగించడానికి పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందనేది ప్రపంచం మొత్తం తెలిసిన సత్యం. దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచడంతో అది ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అంతేకాదు, పాకిస్తాన్ నాయకులు పదేపదే భారత్‌పై అణు దాడి చేస్తామని బెదిరిస్తున్నారు. యుద్ధానికి రెడీ అవుతున్నారు. వారికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోందనే విషయం ఇప్పుడు బహిర్గతమైంది.

భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు చైనా నేనున్నానంటూ అండగా నిలుస్తోంది. దీనికి సాక్ష్యంగా లాహోర్‌లోని చైనా కాన్సుల్ జనరల్ షావో షిరెన్ చేసిన వ్యాఖ్యలు నిలుస్తున్నాయి. పాకిస్తాన్, భారత్ మధ్య చర్చల విషయంలో ఆయన దౌత్యానికి మద్దతు తెలిపారు. అంతేకాకుండా, అన్ని పరిస్థితులలో పాకిస్తాన్‌కు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.

అయితే షావో షిరెన్ యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదని, రెండు దేశాలు శాంతియుతంగా ముందుకు సాగడానికి మార్గాలను అన్వేషించాలని నొక్కి చెప్పారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) సెంట్రల్ పంజాబ్ నాయకత్వంతో జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశం పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) సెంట్రల్ పంజాబ్ ఆర్థిక కార్యదర్శి అహ్మద్ జవాద్ రానా నివాసంలో జరిగింది.

చైనా-పాకిస్తాన్ ఆర్థికాభివృద్ధి, జాతీయ భద్రతా మౌలిక సదుపాయాలతో సహా కీలక రంగాలలో పాకిస్తాన్‌తో చైనా భాగస్వామ్యాన్ని షావో పునరుద్ఘాటించారు. తమ సహకారం, భద్రత, ఆర్థికాభివృద్ధి విషయాలలో చైనా పాకిస్తాన్‌తో ఉంది.. ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.

పాకిస్తాన్ ఎందుకు ఉక్కిరిబిక్కిరి అవుతోంది?

పాకిస్తాన్ చైనా అండతో భారత్‌ను నిరంతరం బెదిరిస్తోంది. అయితే దాని బెదిరింపులు భారత్‌పై ఎటువంటి ప్రభావం చూపడం లేదు. భారత్ నిరంతరం చర్యలు తీసుకుంటోంది. భారత్ పాకిస్తాన్‌కు చెందిన అన్ని రకాల వీసాలను రద్దు చేసింది. అక్కడి పౌరులను 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. దీంతో అట్టారీ సరిహద్దు నుంచి పాకిస్తానీలు తమ దేశానికి తిరిగి వెళ్తున్నారు. అయితే పాకిస్తాన్‌కు తిరిగి వెళ్తున్న ప్రజలు తమ బాధను వ్యక్తం చేస్తూ రెండు ప్రభుత్వాల మధ్య ఘర్షణల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదని అన్నారు. ఇది మాత్రమే కాదు, భారత్ సింధు జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది.

Tags:    

Similar News