సినిమా చూపిస్తామంటున్న వైసీపీ ఎమ్మెల్యే...మ్యాటరేంటో !
కూటమి నేతలు చేస్తున్న ఆరోపణల మీద విమర్శల మీద వైసీపీ నుంచి ఘాటుగానే కౌంటర్ వచ్చింది.
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. అది స్థానికల ఎన్నికల వేడి కాదు, ఏకంగా సార్వత్రిక ఎన్నికల వేడిగానే ఉంది. నిజానికి ఈ వేడి ఎపుడు చల్లారింది అన్నది కూడా పెద్ద ప్రశ్న. ఎవరూ తగ్గకుండా ఢీ అంటీ ఢీ కొడుతూ ఏపీలో అటూ ఇటూ మోహరించిన సన్నివేశం అలా నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. తేడా ఏమిటి అంటే టీడీపీ వైసీపీ రెండూ ఒక వేదిక మీద కనిపించకపోవడం. నిజానికి అధికార ప్రతిపక్ష సభ్యులు కనిపించే వేదిక చట్ట సభలు మాత్రమే. అసెంబ్లీకి వైసీపీ వెళ్ళడం మానుకుంది. దాంతో ఎదురు బొదురు నిలిచి రాజకీయం చేసే పరిస్థితి లేకుండా పోయింది.
పారిపోతున్నారు అంటూ :
ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. దాంతో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఆ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు అంతా ఇదే అంశం మీద వైసీపీని గట్టిగా విమర్శిస్తున్నారు. తన మొత్తం రాజకీయ జీవితంలో వైసీపీ లాంటి పక్షాన్ని చూడలేదని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీకి పూర్తిగా డుమ్మా కొట్టడమేంటి అని ఆయన మండిపడ్డారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అయితే సభకు రాని వారికి జనాలు ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. అసలు వైసీపీకి ఓటు అడిగే హక్కు లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అయితే వైసీపీ సభకు రాకుండా పారిపోతోంది అని హాట్ కామెంట్స్ చేశారు. తాము లేవనెత్తిన అంశాలకు సభలో జవాబు చెప్పలేకనే వైసీపీ ఎమ్మెల్యేలు ఈ విధంగా చేస్తున్నారూని ఆయన అన్నారు.
అసలు సినిమా అంటూ :
కూటమి నేతలు చేస్తున్న ఆరోపణల మీద విమర్శల మీద వైసీపీ నుంచి ఘాటుగానే కౌంటర్ వచ్చింది. అయితే ఈ కౌంటర్ రెగ్యులర్ గా కూటమిని విమర్శించే నేతల నుంచి కాదు పాడేరు ఎమ్మెల్యే నుంచి వచ్చింది. ఆయన అయితే ఏకంగా కూటమి నేతలకు సవాల్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి అపుడు అసలు సినిమా ఏమిటో మీకు చూపిస్తాం అని ఆయన కీలక వ్యాఖ్యలే చేశారు. శాసన మండలిలో ప్రజాసమస్యలపై చర్చించేందుకు కూటమికి ధైర్యం లేదని కూడా పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు విమర్శించారు. అసెంబ్లీకి మేము రావాలని కోరుతున్నారు ముందు మండలిలో మా వారికి జవాబు చెప్పండి అని కూడా అన్నారు.
అసెంబ్లీకి రావాలని :
ఇదిలా ఉంటే పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తొలిసారి అసెంబ్లీకి నెగ్గారు. ఆయన మాదిరిగానే వైసీపీ నుంచి గెలిచిన 11 మందిలో అర డజను మంది దాకా ఉన్నారు. వీరంతా అసెంబ్లీలో చర్చలలో పాల్గొనలేదు, అధ్యక్షా అని అనలేదు, ఆ ముచ్చట ఏదీ తీరలేదు, ఇంతలోనే సగం పాలనకు దగ్గర పడుతోంది. మరి ఈ విధంగానే ఉంటే పుణ్య కాలం కూడా గడచిపోతుంది అన్న భయాందోళనలు కూడా కొత్త ఎమ్మెల్యేలలో ఉన్నాయి. అయినా సరే పార్టీ నిర్ణయం మేరకు వారంతా అసెంబ్లీకి దూరంగా ఉండిపోతున్నారు. ఇపుడు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు అయితే అసెంబ్లీకి వస్తామనే అంటున్నారు. అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సవాల్ చేశారు. మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా ఇది మనసులో ఉన్న మాటే అని అంటున్నారు. ఇంతకీ కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇస్తుందా అంటే జవాబు అందరికీ తెలిసిందే మరి.