రక్షణ కవచం తొలగించారు...స్టీల్ ప్లాంట్ ప్రైవేటు ?

స్టీల్ ప్లాంట్ నే కాదు ఏ పబ్లిక్ అండర్ టేకింగ్ సంస్థకు అయినా సీఐఎస్ఎఫ్ అన్నది కీలక పాత్ర పోషిస్తుంది.

Update: 2026-08-22 04:30 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సంచలన నిర్ణయం ఒకటి కేంద్రం తీసుకుంది. ప్లాంట్ కి రక్షణ కవచంగా ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ఒక్కసారిగా ఉప సంహరించుకుంది. ఇక వారి సేవలు వద్దు అని చెన్నైలో ఉన్న సీఐఎస్ఎఫ్ సౌత్ సెక్టార్ హెడ్ క్వార్టర్స్ లోని ఇన్స్పెక్టర్ జనరల్ కి కేంద్ర హోం శాఖ శుక్రవారం వర్తమానం పంపించింది అని అంటున్నారు. సీఐఎస్ఎఫ్ సేవలను స్టీల్ ప్లాంట్ కి ఈ ఏడాది నవంబర్ 17 నుంచి పూర్తిగా రద్దు చేస్తున్నట్లుగా ఈ వర్తమానం సారాంశం అని అంటున్నారు. ఇది ఒక విధంగా స్టీల్ ప్లాంట్ మనుగడ మీద పిడుగు లాంటి వార్త అని అంటున్నారు.

ప్లాంట్ దారి ఏమిటి :

స్టీల్ ప్లాంట్ నే కాదు ఏ పబ్లిక్ అండర్ టేకింగ్ సంస్థకు అయినా సీఐఎస్ఎఫ్ అన్నది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థ అని చెప్పడానికి అచ్చమైన ఉదాహరణ సీఐఎస్ఎఫ్ అని అంటున్నారు. ఎక్కడైనా సీఐఎస్ఎఫ్ లేకుండా ప్రభుత్వ రంగ సంస్థ నిర్వహణ ఉండదు. అలాంటి కీలకమైన విభాగాన్ని తొలగించడం అంటే స్టీల్ ప్లాంట్ దారి ఎటూ ఏమిటీ అన్న చర్చ అయితే వస్తోంది. ఇక సీఐఎస్ఎఫ్ సిబ్బందికి రావాల్సిన మొత్తాన్ని వారికి చెల్లించాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లించి వారి నుంచి నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సూచించినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే 2024 వరకూ స్టీల్ ప్లాంట్ లో మొతం 1500 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహించేవారు. వారిని దశల వారీగా ఉప సంహరించుకుంటూ వస్తున్నారు.

ఆనాడే బీజం :

ఇప్పటికి సరిగ్గా అయిదున్నరేళ్ళ క్రితం అంటే 2021 జనవరి 27న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోని వంద శాతం ప్రభుత్వ వాటాను వ్యూహాత్మక విక్రయం ద్వారా ప్రైవేటీకరించడానికి ఆమోదం తెలిపింది. అలా 2021 జనవరి 27న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రైవేటీకరణకు కేంద్రం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ నిర్ణయం వెలువడిన వెంటనే కార్మిక సంఘాలు, ఉద్యోగులు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిరాహార దీక్షలు ప్రారంభించారు. సొంత ఇనుప ఖనిజ గనులను కేటాయించాలని అప్పులను ఈక్విటీగా మార్చాలని కార్మికులు డిమాండ్ చేస్తూ వచ్చారు. దాంతో కొంత తగ్గినట్లు అనిపించినా ఆ దిశగా చర్యలు సాగుతూనే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

సగానికి సగం బక్కచిక్కి :

ఇప్పటికే స్టీల్ ప్లాంట్ గత అయిదున్నరేళ్ళుగా సగానికి సగం బక్క చిక్కింది అని గుర్తు చేస్తున్నారు. దశల వారీగా స్టీల్ ప్లాంట్ లో ఆరు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తప్పించారు. అలాగే మరో రెండు వేల మంది పర్మనెంట్ కార్మికులను వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించారు. కీలక విభాగాలకు సరైన నైపుణ్యం కలిగిన సిబ్బంది లేరు అని అంటున్నారు. మరో వైపు పనిచేస్తున్న కార్మికులకు సగం జీతాలు మాత్రమే చెల్లిస్తున్నారు అని అంటున్నారు. ఇక స్టీల్ ప్లాంట్ నష్టాల ఊబిలో ఉందని కూడా ప్రచారం ఉంది. దానికి అవసరమైన సమస్యలు అన్నీ స్టీల్ ప్లాంట్ లో ఉన్నాయి. మొత్తం మీద అన్నీ కలసి అదే దిశగా నడిపిస్తున్నాయి.

Tags:    

Similar News