లోకేష్ కి ఇష్టుడుగా విష్ణు...బంధం గట్టిదే మరి !

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో లోకేష్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మంత్రి అచ్చెన్నాయుడు ముగ్గురూ కలిసి నడుస్తూ మాట్లాడుకుంటూ ఉన్న ఫోటోలు అందరికీ ఆకట్టుకున్నాయి.

Update: 2026-08-22 04:37 GMT

కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. జనసేన ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా టీడీపీ మంత్రి నారా లోకేష్ తో సన్నిహితంగా ఉంటారు. అసెంబ్లీ జరిగిందంటే లాబీలలో సొంత పార్టీ ఎమ్మెల్యేల కంటే వారిదే హడావుడి ఉంటుంది. లోకేష్ సైతం అందరితో కలిసిపోతూ ముచ్చటిస్తూ కనిపిస్తారు. ఆయన అందరి వాడుగా ఉంటారు. ఎక్కడా భేషజాలు చూపించని లోకేష్ నైజం అలాగే పెద్దలకు గౌరవం ఇచ్చే మనస్తత్వం కలుపుగోలు తనం అన్నీ కూడా చాలా మంది ఎమ్మెల్యేలకు బాగా నచ్చుతున్నాయి. దాంతో లోకేష్ తో మాటా మంతీని అంతా వీలు కుదిరినప్పుడల్లా జరుపుతూంటారు.

వైరల్ అయిన ఫోటోలు :

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో లోకేష్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మంత్రి అచ్చెన్నాయుడు ముగ్గురూ కలిసి నడుస్తూ మాట్లాడుకుంటూ ఉన్న ఫోటోలు అందరికీ ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇవి కనిపించి మురిపించాయి. బీజేపీ రాజు గారితో సరదాగా లోకేష్ మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఫోటోలు అలాగే అచ్చెన్న కూడా వీరితో కలిసి ఆహ్లాదంగా లోకేష్ చేసే వ్యాఖ్యలను వింటున్నవి ఈ ఫోటోలలో కనిపించాయి. ఇక రాజు గారు అయితే అటు లోకేష్ ఇటు అచ్చెన్నల మధ్యలో నిలిచి నవ్వులు చిందించారు.

ఠంచనుగా హాజరు :

ఇక విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున ఉన్న విష్ణు కుమార్ రాజు ఎక్కువగా టీడీపీ మంత్రులతో ఎమ్మెల్యేలతో కనిపిస్తారు అని అంటారు. కూటమి ప్రభుత్వం కాబట్టి అంతా ఒక్కటిగా ఉంటున్నారు కాబట్టి కనిపించినా తప్పు ఏముంది అని కూడా అంటారు. అంతే కాదు ఆయా మంత్రి నారా లోకేష్ ఎపుడు విశాఖ వచ్చినా కూడా ఆయనకు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలుకుతారు. నిజానికి విశాఖ నిండా టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఉన్నారు. కీలక నేతలు అంతా ఉన్నారు. అయినా సరే లోకేష్ కి వారితో పాటుగా వారికంటే ముందుగా కూడా బీజేపీ రాజు గారు స్వాగతం పలుకుతారు అన్న పేరు తెచ్చుకున్నారు. లోకేష్ నగరంలో ఏ సమావేశంలో పాల్గొన్నా కూడా ఆయన కూడా అనుసరిస్తారు అని కూడా అంటారు.

అక్కడికి సైతం అలా :

అయితే విశాఖలో ఉంది కాబట్టి ఎయిర్ పోర్టుకు ఎక్కువగా రాజు వచ్చేందుకు వీలు కుదురుతుంది. సులువుగా ఉంటుంది అనుకోవచ్చు, కానీ ఇపుడు భోగాపురం విమానాశ్రయం నుంచి మాత్రమే మంత్రులు అంతా రావాల్సి ఉంది. అక్కడకు పార్టీ నేతలు అయితే పని గట్టుకుని వెళ్తారు, తమ నాయకుడు కాబట్టి కానీ భోగాపురం ఎయిర్ పోర్టు వద్దకు కూడా బీజేపీ రాజు రావడం విశేషం అని అంటున్నారు. ఆయన లోకేష్ కి తాజాగా స్వాగతం పలికి ఆయనతో కలిసి ముచ్చటించారు. లోకేష్ సైతం మిత్ర పక్షాల ఎమ్మెల్యేలకు ఎంతో గౌరవం ఇస్తూంటారు. దాంతో ఆయనకు బాగా సన్నిహితం అవుతున్నారు అని అంటున్నారు. మొత్తానికి లోకేష్ ని మా విష్ణు ఇష్టుడు అని సొంత పార్టీ వారు మిత్ర పార్టీ వారు కూడా అనుకుంటున్నారుట.

Tags:    

Similar News