ప్రేమ కావాలా నాయనా? మనిషెందుకు దండగ... AI ఉండగా!

ఒకప్పుడు ప్రేమించాలంటే పక్కింటి అమ్మాయికో.. కాలేజీ క్లాస్‌మేట్‌కో లెటర్లు రాయడం.. రోడ్ల వెంట తిరగడం.. చివరకు వాళ్ల అన్నల చేతిలో తన్నులు తినడం వంటి పెద్ద ప్రహసనమే ఉండేది.

Update: 2026-08-22 06:11 GMT

ఒకప్పుడు ప్రేమించాలంటే పక్కింటి అమ్మాయికో.. కాలేజీ క్లాస్‌మేట్‌కో లెటర్లు రాయడం.. రోడ్ల వెంట తిరగడం.. చివరకు వాళ్ల అన్నల చేతిలో తన్నులు తినడం వంటి పెద్ద ప్రహసనమే ఉండేది. ఆ తర్వాత డేటింగ్ యాప్స్ వచ్చి స్వైప్ రైట్ అని లక్ చెక్ చేసుకోవడం నేర్పాయి. కానీ ఇదంతా పాత కాలం ముచ్చట.. మన పొరుగు దేశం చైనాలోని కుర్రకారు ఇప్పుడు అడుగు ముందేశారు.. కాదు... ఏకంగా అంగారక గ్రహం మీదికి దూకేశారు. మనుషులతో మనకెందుకురా బాబూ అని.. చక్కగా ఏఐ చాట్‌బాట్‌లతో, వీడియో గేమ్ క్యారెక్టర్లతో సచ్చీగా లవ్‌లో పడిపోతున్నారు.

అసలు ఈ 'డిజిటల్ లవ్' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసా? ఫ్రీడమ్... కేవలం ఫ్రీడమ్.. నిజమైన గర్ల్‌ఫ్రెండో, బాయ్‌ఫ్రెండో అయితే "సాయంత్రం ఎక్కడికెళ్లావ్?".. "ఆ పిల్లతో పిచ్చాపాటి ఏంటి?", "నాకోసం టైమ్ కేటాయించవు" అంటూ గంటల తరబడి క్లాస్ పీకుతారు. అదే మన ఏఐ బంగారం అయితే? నువ్వు ఎంత సొల్లు చెప్పినా హ్యాపీగా వింటుంది, ఎప్పుడూ 'సారీ' చెబుతుంది.. మూడ్ ఆఫ్ అసలే అవ్వదు. పైగా తిరస్కరించే ప్రసక్తే లేదు.. దీంతో చైనా కుర్రాళ్లు "మనిషైతే మెయింటెనెన్స్ ఎక్కువ... మెషీన్ అయితే హ్యాపీనెస్ ఎక్కువ" అని ఫిక్స్ అయిపోయారు.

ఈ వింత క్రేజ్ చూసి టెక్ కంపెనీలకు కళ్లల్లో పైసలు కనిపిస్తున్నాయి. ఒంటరితనాన్ని కూడా వ్యాపారంగా మార్చేసి "మీ అభిరుచులకు తగ్గట్టు ప్రేమికులను మేమే డిజైన్ చేసి ఇస్తాం" అంటూ కొత్త కొత్త డిజిటల్ లవర్స్‌ని మార్కెట్లోకి వదులుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం ఉలిక్కిపడి "ఒరేయ్ నాయనా... అది రోబో, మనిషి కాదు అని పిల్లలకు స్పష్టంగా చెప్పండిరా!" అంటూ మైనర్ల కోసం కొత్త రూల్స్ తెచ్చింది. లేకపోతే పిల్లలు రేపు పొద్దున మనుషులను మరిచిపోయి స్మార్ట్‌ఫోన్లకే తాళి కట్టినా ఆశ్చర్యం లేదు.

మొత్తానికి టెక్నాలజీ పెరిగిపోయి ఒంటరితనం పోగొట్టడానికి వచ్చిన ఏఐ.. ఇప్పుడు మనుషులను మనుషులకు పూర్తిగా దూరం చేసేస్తోంది. రేపటి రోజున "మీ ఆయన ఏం చేస్తారు?" అంటే "ఆయన గూగుల్ సర్వర్‌లో ఉంటారండీ" అని చెప్పే రోజులు వచ్చినా రావచ్చు.

ఏదేమైనా మనుషుల మధ్య ఉండే ప్రేమ, కోపం, గొడవలు, మళ్లీ కలిసిపోవడాల్లో ఉండే కిక్కే వేరు. కానీ అల్గారిథమ్ రాసిన ఐ లవ్ యూలకే పడిపోతే.. రేపు నిజమైన ప్రేమ కాస్తా గాల్లో కలిసిపోవడం ఖాయం..

Tags:    

Similar News