మూడో వంతు త్యాగాలేనా ?... కూటమిలోని కొత్త నిష్పత్తి ?
అయితే ఈ ఫార్ములా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నా సాధ్యమయ్యే పనేనా అన్నది కూడా చర్చగా ఉంది. ఎందుకంటే తమ్ముళ్ళు ఏకంగా తమకు దక్కే సీట్లలో 35 శాతాన్ని కోల్పోవాల్సి ఉంటుంది.
స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. దాంతో తమకు పదవులు దక్కుతాయి అని కార్యకర్తలు నాయకులు గ్రౌండ్ లెవెల్ లో సంబర పడుతున్నారు. అదే సమయంలో ఎక్కడ ఎవరికి సీట్లు వస్తాయో అన్న బెంగ కూడా కూటమి పార్టీ కార్యకర్తలలో ఉంది. తాము ముందుగా ప్రచారం చేసుకున్నా చివరి నిముషంలో తప్పుకోవాల్సి వస్తుందేమో అన్న భయాలు కూడా ఉన్నాయి అంటున్నారు. దానికి కారణం పొత్తులు కొలిక్కి రావాల్సి ఉండడమే. ఎవరికి ఎక్కడ ఏ మోతాదుతో ఏ నిష్పత్తిలో సీట్లు ఇస్తారో తేలిపోతే మొదటి విజయం సాధించినట్లే అన్నది కూటమిలోని మూడు పార్టీల కార్యకర్తల మాట.
జనసేన ఒత్తిడితో :
ఇక జనసేన అయితే తగ్గేది లేదు అని అంటోంది. ఈసారి లెక్క వేరు అని కూడా బిగ్ సౌండ్ చేస్తోంది. 2024 ఫార్ములాని మరచి పోవాల్సిందే అని కూడా అంటోంది. 2026 లో స్థానిక పోరులో లెక్కలు మారిపోతాయని కూడా బల్ల గుద్దుతోంది. దాంతోనే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారో అన్నది మాత్రం తేలడం లేదు, నిజానికి సీట్ల సర్దుబాటు గురించి ప్రాధమికంగా సమావేశం కూడా కూటమి పార్టీల అధినేతల మధ్య జరగలేదు. కానీ ఈ మధ్యన ఒక నిష్పత్తి అయితే బయటకు వచ్చింది టీడీపీకి 80 శాతం జనసేనకు 15 శాతం బీజేపీకి అయిదు శాతం సీట్ల నిష్పత్తిలో పంపకాలు ఉంటాయన్నదే ఆ సారాంశం. దాంతో జనసేన తీవ్రంగా విభేదించింది. ఇక బీజేపీ శిబిరంలో కూడా ఎక్కువ సీట్లు కోరాలని డిమాండ్ ఉందని అంటున్నారు.
ఈ ఫార్ములా నిజమేనా :
ఈ క్రమంలో తాజాగా ఒక కొత్త ఫార్ములా తెర మీదకు వచ్చింది. అయితే ఇది సోషల్ మీడియాలో ప్రచారంగానే ఉంది. అధికారికంగా మాత్రం కాదు. కేవలం ఊహాగానాలుగనే ఈ ఫార్ములాను తెర మీదకు తెచ్చారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఈ ఫార్ములా ప్రకారం చూస్తే టీడీపీ మొత్తం సీట్లలో 65 శాతం తీసుకుంటుందని అంటున్నారు. అలాగే జనసేన కోరినట్లుగా 30 శాతం సీట్లను ఆ పార్టీకి కేటాయిస్తుంది అని అంటున్నారు. ఇక బీజేపీకి అయిదు శాతం ఇస్తారని అంటున్నారు. ఆ విధంగా చూస్తే సీట్ల సర్దుబాటులో కొత్త ఫార్ములా పొత్తులలో జనసేన ఘన విజయం సాధించినట్లే అని అంటున్నారు. బీజేపీ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు అని అంటున్నారు.
తమ్ముళ్ళు తగ్గాల్సిందేనా :
అయితే ఈ ఫార్ములా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నా సాధ్యమయ్యే పనేనా అన్నది కూడా చర్చగా ఉంది. ఎందుకంటే తమ్ముళ్ళు ఏకంగా తమకు దక్కే సీట్లలో 35 శాతాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అంటే మూడవ వంతు అన్న మాట. ప్రతీ మూడు సీట్లలో ఒకటి టీడీపీకి దక్కదు అంటే అతి పెద్ద పార్టీ బూత్ లెవెల్ దాకా విస్తరించి ఉన్న పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్న టీడీపీలో తమ్ముళ్ళు ఊరుకుంటారా అన్నదే ప్రశ్నగా ఉండబోతోంది. అంతే కాదు వారు త్యాగానికి సిద్ధపడతారా అన్నది కూడా కీలకమైన ప్రశ్న. టీడీపీకి అందరి కంటే బలమైన నేతలు ఉన్నారు. ఆ పార్టీకి అన్ని సామాజిక వర్గాలలో పట్టున్న నేతలు ఉన్నారు. 34 శాతం బీసీలకు రిజర్వేషన్లు అంటే టీడీపీకి ఎక్కువ మంది అభ్యర్థులు కూడా ఈజీగా దొరుకుతారు అని అంటున్నారు. గడచిన రెండేళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల మీద కోటి ఆశలు పెట్టుకున్న టీడీపీ తమ్ముళ్ళు మూడవ వంతు సీట్ల కోతకు అంగీకరిస్తారా అన్నదే చూడాలి. ఏది ఏమైనా సీట్ల సర్దుబాటు అన్నది పీటముడిగా కూటమికి పడబోతోంది అని అంటున్నారు.