విజయ్ వెనక్కి తగ్గాల్సిందేనా.. దళపతిని ఇరకాటంలో నెట్టేసిన డీఎంకే
తమిళనాడు రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించిన ఫ్రీ కార్లను తాము తిరస్కరిస్తున్నట్లు ప్రతిపక్షం డీఎంకే స్పష్టం చేసింది.
తమిళనాడు రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించిన ఫ్రీ కార్లను తాము తిరస్కరిస్తున్నట్లు ప్రతిపక్షం డీఎంకే స్పష్టం చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాహన సౌకర్యం లేక తాము నియోజకవర్గాల్లో తిరగలేకపోతున్నట్లు టీవీకే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన అసెంబ్లీలో అందరికీ కొత్త కార్లు కొనిస్తామని ప్రకటన చేశారు. అయితే ప్రభుత్వం అప్పుల్లో ఉందని చెబుతూ ఇలాంటి దుబారా ఖర్చులు చేయడం ఎంతవరకు కరెక్టు అంటూ ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. దీనిపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. ఇక రాష్ట్రంలో 234 మంది ఎమ్మెల్యేలకు కార్లు కొనిస్తామని ప్రభుత్వం ప్రకటించగా, ఇందులో 59 మంది డీఎంకే ఎమ్మెల్యేలు తిరస్కరణతో రాజకీయం వేడిక్కిందని అంటున్నారు. ఇక మరో విపక్షం అన్నాడీఎంకే నిర్ణయం కూడా ఉత్కంఠ రేపుతోంది.
ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో శాసనసభకు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు. వీరంతా అధికార టీవీకే ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. రెండేళ్ల క్రితం ఏర్పడిన టీవీకే పార్టీలో దాదాపు 90 శాతం మంది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారే ఉన్నారు. అంతేకాకుండా అత్యంత సామాన్యులే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఎదో ఒక రకంగా ప్రజల్లోకి వెళ్లిన వీరంతా, గెలిచిన తర్వాత నియోజకవర్గంలో పర్యటనకు ప్రయాస పడుతున్నట్లు చెబుతున్నారు. ఇది గమనించిన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి ప్రభుత్వమే వాహనాలు సమకూర్చితే బాగుంటుందని సూచనలు చేశారు.
అప్పటివరకు ఈ సమస్యపై ముఖ్యమంత్రి విజయ్ తర్జనభర్జన పడుతుండగా, ఎంపీ జ్యోతిమణి సూచనతో కొత్త కార్లు కొనివ్వాలని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. అయితే తన పార్టీ వారికే కార్లు సమకూర్చితే విమర్శలు వస్తాయనే ఆలోచనతో రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యేకు కారు కొనిస్తామని, నిర్వహణ కోసం రూ.75 వేలు అందజేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం టీవీకేతోపాటు కమ్యూనిస్టులు, వీసీకే పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు సంతోషం కలిగించిందని అంటున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మాత్రం సీఎం విజయ్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే చర్చనీయాంశం అవుతోంది.
ఎమ్మెల్యేలకు కార్లు కొనివ్వాలనే సీఎం ప్రతిపాదనను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రకటించడం హాట్ టాపిక్ అవుతోంది. తాము ఈ నిర్ణయం తీసుకోడానికి కారణాలు కూడా ఆయన వివరించారు. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రకటించారని, ఇప్పుడు వాహనాల కొనుగోలు చేయడం అంటే ప్రభుత్వంపై మరింత భారం మోపడమే అవుతోందని చెబుతున్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు వాహనాలు ఎందుకంటూ డీఎంకే ప్రశ్నించడం కూడా ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు. ఇదే దారిలో మరో ప్రతిపక్షం అన్నాడీఎంకే కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ముఖ్యమంత్రి విజయ్ వెనక్కి తగ్గాల్సివస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.