కొణతాల సైలెంట్... వైసీపీ వైలెంట్.. !
ఆది నుంచి సౌమ్యుడిగా పేరున్న కొణాతాల రామకృష్ణ గత ఎన్నికల్లో జనసేన తరఫున విజయం సాధించారు. ఇప్పుడు కూడా ఆయన సైలెంట్‌గానే ఉంటున్నారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి రాజకీయాలు సైలెంట్ అయ్యాయి. రాజకీయాలంటే ప్రత్యర్థులపై విమర్శలు చేసుకోవడం.. ఎప్పుడూ హాట్ టాపిక్‌గా వ్యవహరించడం కాకపోయినా.. కనీసం నియోజక వర్గంలో దూకుడు అయినా కనిపించాలి. అయితే.. అనకాపల్లిలో ఈ తరహా పరిస్థితి కనిపించడం లేదన్నది వాస్తవం. ఆది నుంచి సౌమ్యుడిగా పేరున్న కొణాతాల రామకృష్ణ గత ఎన్నికల్లో జనసేన తరఫున విజయం సాధించారు. ఇప్పుడు కూడా ఆయన సైలెంట్‌గానే ఉంటున్నారు.
అయితే.. రాజకీయ విమర్శలు లేకపోయినా.. ప్రత్యర్తులపై విరుచుకుపడకపోయినా.. నియోజకవర్గంపై పట్టు సాధించడంలో కొణతాలకు తిరుగులేదు. గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం రామకృష్ణకు కలిసి వస్తోంది. దీంతో అభివృద్ధి విషయంలో కొంత మేరకు ముందుకు సాగుతున్నారు. దీంతో వైసీపీకి పరోక్షంగానే ఆయన చెక్ పెడుతున్నారు. పైకి ఎలాంటి అరుపులు, కేకలు, హెచ్చరికలు ఉండవు. కానీ.. క్షేత్రస్థాయిలో ప్రచారం మాత్రం భిన్నంగా ఉంటోంది.
వైసీపీకి అవకాశం ఇవ్వని రీతిలో కొణతాల వ్యవహరిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండడంలోనూ ఆయన భిన్నమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. నేరుగా తానే ఎక్కడ సమస్య ఉంటే అక్కడకు వెల్తున్నారు. సుదీర్ఘకాలంగా ఇక్కడి బెల్లం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించారు. మద్దతు ధరలు వచ్చేలా చూస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్‌ను విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదేసమయంంలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారిని ఎంపిక చేశారు.
సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు.. వీరికి పింఛన్లు మంజూరు కానున్నాయి. ఇక, పార్టీ పరంగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో పట్టుకోసం ప్రయత్నం చేస్తున్న కొణతాల తన వర్గాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటున్నారు. ఈ పరిణామాలు.. వైసీపీని డిఫెన్స్‌లో పడేశాయి. ఇక, ఇక్కడ వైసీపీలో టికెట్ పోరు కూడా ఎక్కువగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని మాజీ మంత్రి అమర్నాథ్ ప్రకటించుకున్నారు. దీనిని సొంత పార్టీ నాయకులు విభేదిస్తున్నారు. సో.. మొత్తంగా కొణతాల సైలెంట్ పాలిటిక్స్ వైసీపీలో పెరుగుతున్న విభేదాలు.. వంటివి అనకాపల్లిలో ఆసక్తిగా మారాయి.