రేవంత్ అమెరికా పర్యటన ఎందుకు ఆగిపోయింది? కేంద్రం చెప్పిన కారణమేంటి?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటనలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

Update: 2026-08-21 13:04 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటనలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రానికి భారీగా విదేశీ పెట్టుబడులు తీసుకురావడం.. అంతర్జాతీయ సంస్థలు, విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు పెంచుకోవడమే లక్ష్యంగా లండన్, అమెరికా పర్యటనలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అయితే లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్ర విదేశాంగ శాఖ.. అమెరికా పర్యటనకు మాత్రం పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో అమెరికా షెడ్యూల్‌ను రేవంత్ రెడ్డి రద్దు చేసుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కావాల్సి వచ్చింది.

ఈ వ్యవహారంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రులే కాకుండా ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలను కూడా విదేశాంగ శాఖ సమీక్షిస్తుందని తెలిపారు. ప్రతిపాదిత పర్యటన కార్యక్రమాలు సదరు వ్యక్తి పదవికి, పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా ఉండాల్సి ఉంటుందని.. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విషయంలో ఆ ప్రమాణాలకు అనుగుణంగా షెడ్యూల్ లేదని చెప్పారు. అందుకే అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదని.. అయితే బ్రిటన్ పర్యటనకు అనుమతి ఇచ్చామని స్పష్టం చేశారు.

అమెరికా షెడ్యూల్‌లో రాజకీయ కార్యక్రమం

రేవంత్ రెడ్డి అమెరికాలో హార్వర్డ్, ఎంఐటీ, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించాల్సి ఉంది. పెట్టుబడులు, విద్యా రంగంలో భాగస్వామ్యాలు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చలు జరపాలని ప్రభుత్వం భావించింది. అయితే న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించనున్న మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం కూడా ఆయన షెడ్యూల్‌లో ఉంది.

ఇదే అంశం రాజకీయంగా కీలకంగా మారినట్లు చర్చ జరుగుతోంది. అధికారిక పెట్టుబడుల పర్యటనతో పాటు రాజకీయ స్వభావం ఉన్న కార్యక్రమం ఉండటంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం రేవంత్ పర్యటనను రాజకీయ కారణాలతో అడ్డుకున్నామని స్పష్టంగా చెప్పలేదు. ప్రతిపాదిత కార్యక్రమం ఆయన పదవికి, పర్యటన ఉద్దేశానికి తగినట్లుగా లేదన్నదే విదేశాంగ శాఖ అధికారిక వివరణ ఇచ్చింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీర్ జైస్వాల్ ప్రకటన చేశారు..

సీఎంల విదేశీ పర్యటనలకు కేంద్ర అనుమతి ఎందుకు?

భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం విదేశీ వ్యవహారాలు కేంద్ర జాబితాలో ఉన్నాయి. విదేశీ ప్రభుత్వాలతో సంబంధాలు, దౌత్య వ్యవహారాలు, అంతర్జాతీయ ఒప్పందాలు వంటి అంశాలు కేంద్ర పరిధిలో ఉంటాయి. అందువల్ల ముఖ్యమంత్రులు, మంత్రులు అధికారిక హోదాలో విదేశాలకు వెళ్లేటప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్దేశించిన విధానాల ప్రకారం ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా విదేశాంగ శాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ కీలకం. పర్యటనలో పాల్గొనే సంస్థలు, సమావేశాలు, ఆహ్వానించిన వ్యక్తులు, కార్యక్రమాల స్వభావం తదితర అంశాలను కేంద్రం పరిశీలిస్తుంది. అవసరాన్ని బట్టి ఇతర కేంద్ర శాఖల నుంచి కూడా అనుమతులు, సమాచారం లేదా క్లియరెన్స్ అవసరం కావచ్చు.

కేంద్రం ఎప్పుడు అనుమతి నిరాకరిస్తుంది?

విదేశీ పర్యటన వల్ల దేశ విదేశాంగ విధానానికి విరుద్ధమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని కేంద్రం భావించినప్పుడు అనుమతి నిరాకరించవచ్చు. విదేశీ సంస్థల నేపథ్యం, కార్యక్రమాల స్వభావం, భద్రతాపరమైన అంశాలు, అంతర్జాతీయ పరిస్థితులు, పర్యటన ఉద్దేశం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

అదేవిధంగా అధికారిక పర్యటన పేరుతో విదేశాల్లో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం లేదా కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానానికి భిన్నమైన సందేశం వెళ్లే అవకాశం ఉందని భావించినా అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు.

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విషయంలోనూ న్యూయార్క్‌లోని రాజకీయ కార్యక్రమం కారణంగానే కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కేంద్రం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన రాజకీయ కారణం వెల్లడికాలేదు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు

విదేశీ పర్యటనలకు కేంద్రం అనుమతి నిరాకరించిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కొన్ని అంతర్జాతీయ సదస్సులకు వెళ్లేందుకు అనుమతి విషయంలో వివాదాలు తలెత్తాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విదేశీ పర్యటనలకు సంబంధించిన కొన్ని సందర్భాల్లోనూ కేంద్రం నుంచి క్లియరెన్స్ లభించలేదు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటనల విషయంలోనూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

అందువల్ల రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ పూర్తిగా కొత్త పరిణామం కాదు. అయితే ఒకవైపు బ్రిటన్ పర్యటనకు అనుమతి ఇచ్చి.. మరోవైపు అమెరికా పర్యటనను తిరస్కరించడం మాత్రం ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసింది.

కేంద్ర అనుమతి లేకుండా వెళ్తే?

కేంద్రం నుంచి అధికారిక క్లియరెన్స్ లేని పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించడం, విదేశీ ప్రభుత్వాలతో అధికారిక చర్చలు జరపడం వంటి అంశాలు సమస్యాత్మకంగా మారవచ్చు. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు సాధారణంగా అధికారిక పర్యటనలకు అవసరమైన ప్రోటోకాల్, సమన్వయం, భద్రతా ఏర్పాట్లను కేంద్ర అనుమతుల ఆధారంగానే నిర్వహిస్తాయి.

అందుకే అధికారిక పర్యటనకు కేంద్ర అనుమతి లేకపోతే షెడ్యూల్‌ను రద్దు చేయడం లేదా మార్చుకోవడం సాధారణంగా జరుగుతుంది. వ్యక్తిగత హోదాలో విదేశాలకు వెళ్లడం వేరు.. ముఖ్యమంత్రిగా అధికారిక పర్యటన చేయడం వేరు.

మొత్తానికి రేవంత్ రెడ్డి అమెరికా టూర్ రద్దు వెనుక అసలు కారణం ఏమిటన్నదానిపై రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజకీయ కక్షతోనే కేంద్రం అనుమతి నిరాకరించిందని ఆరోపిస్తుండగా.. కేంద్ర విదేశాంగ శాఖ మాత్రం పర్యటన షెడ్యూల్, దాని ఉద్దేశం, కార్యక్రమాల స్వభావం తమ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతోనే క్లియరెన్స్ ఇవ్వలేదని చెబుతోంది. దీంతో రేవంత్ అమెరికా పర్యటన రద్దు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరో వివాదానికి కేంద్రబిందువుగా మారింది.




Tags:    

Similar News