మోడీ జెన్ జీ జపం పీక్స్ లోనే !
ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా తన కేబినెట్ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశం జెన్ జీ గురించి ప్రస్తావించారని అంటున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం మౌనంగా కనిపిస్తున్నారు. ఆయన ప్రకటనలు ప్రసంగాలు పర్యటనలు గడచిన కొద్ది రోజులుగా ఎక్కడా కనిపించడం లేదు. ఆయన సైలెంట్ వెనక వ్యూహాత్మకమైన ప్రణాళిక ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే మోడీ అపర చాణక్యుడు అని చెబుతారు. ఆయన రాజకీయ జీవితంలో ఓటమి లేదు. ఏదైనా చిన్న కుదుపు ఎక్కడైనా సంభవిస్తే మళ్ళీ సర్దుకుని జెట్ స్పీడ్ తో ముందుకు సాగిపోయే నైపుణ్యం నైజం మోడీ సొంతం. అందుకే ఇపుడు మోడీ ఆ దిశగానే ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు. జంతర్ మంతర్ వద్ద జెన్ జీ తరం అంతా నిరసనలు చేపట్టి కేంద్ర మంత్రి చేత ఓవర్ నైట్ రాజీనామా చేయించడం అన్నది అంత ఈజీగా మరచిపోయేది కాదు, పైగా దేశంలో ఇపుడు జెన్ జీ తరం అసహనం సణుగుడు గొణుగుడు బీజేపీ పెద్దలు పెద్ద చెవులు పెట్టుకుని రిక్కించి మరీ వింటున్నారు అని అంటున్నారు.
కేబినెట్ కార్యదర్శులకు కూడా :
ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా తన కేబినెట్ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశం జెన్ జీ గురించి ప్రస్తావించారని అంటున్నారు. యువతను ఆకట్టుకోవాలని వారితో మమేకం కావాలని మోడీ వారికి దిశా నిర్దేశం చేశారు అని అంటున్నారు. పాలనా విధానాలలో కొత్త ఆలోచనలను తెచ్చేందుకు యువత భాగస్వామ్యం ఎంతో కీలకమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారని తెలుస్తోంది. ప్రభుత్వ శాఖలు విశ్వవిద్యాలయాలు యువత మధ్య సత్సంబంధాలు పెరగాలని మోదీ కోరడం విశేషం. యువతతో విస్తృత చర్చల ద్వారా వినూత్నమైన ఆలోచనలు పుట్టుకొస్తాయని నరేంద్ర మోడీ అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు డిజిటల్ కంటెంట్ ద్వారా ఈనాటి యువత ఆలోచనలను అర్థం చేసుకొని వారితో కనెక్ట్ కావాలని కూడా మోడీ అత్యున్నత అధికారులకు సూచించారు.
మంత్రులకూ ఇదే మాట :
అంతకు ముందు మోడీ మంత్రి వర్గ సమావేశం నిర్వహించిన సందర్భంలో మంత్రులకు కూడా ఇఏ విషయం మీద హిత బోధ చేశారు. కేంద్ర మంత్రులతో నిర్వహించిన సమావేశాల్లో జెన్ జీ యువతతో మమేకం కావాలని విశ్వవిద్యాలయాలతో సంబంధాలను పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. అంతే కాదు సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించాలని ఇన్స్టా గ్రాం లో కూడా కనిపించాలని రీల్స్ వీడియో బైట్స్ వంటివి పోస్టులు చేయాలని కోరారు. ఒక విధంగా మోడీ తాజా పరిణామాల నుంచి ఎంతో నేర్చుకోవాలని ఆశిస్తున్నారు. తాను కూడా యువతతో నేరుగా కనెక్ట్ కావాలని అనుకుంటున్నారు. విశ్వ విద్యాలయాలతో అనుసంధానం అయినపుడు కొత్త తరం యువత మనో భావాలు ఏమిటి అన్నవి కచ్చితంగా తెలుస్తాయని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.
మౌనం వెనక వ్యూహం :
మోడీ ఇటీవల మౌనంగా ఉంటున్నారు. ఎక్కువగా మాట్లాడడం లేదు అంటే ఆ మౌనం వెనక వ్యూహాలు ఉన్నాయనే అంటున్నారు. పూర్తిగా యువతరంతో బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని నింపిన మోడీ మంత్రి వర్గంలోనూ కొత్త ముఖాలకు చాన్స్ ఇస్తారని అంటున్నారు. అలాగే యువతకు ప్రాధాన్యత దక్కుతుందని కూడా అంటున్నారు. రానున్న కాలంలో బీజేపీ యువ సమ్మేళనాలూ విశ్వ విద్యాలయాల సందర్శనలు యూత్ తో చిట్ చాట్ బాతాఖానీ వంటి వినూత్య కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని అంటున్నారు. మొత్తం మీద జెన్ జీ పోరాటలు నిరసనలు ట్రెడిషనల్ పార్టీలలో మౌలికమైన మార్పులకు కారణం అవుతున్నాయి. మరి రానున్న కాలంలో రాజకీయాల్లో యువత పాత్ర వారి గొంతుక పెద్దదిగా కనిపిస్తుందా వినిపిస్తుందా అంటే వేచి చూడాల్సిందే మరి.