కాంగ్రెస్ జెండా కప్పుకొని.. జాతీయ జెండా అంటున్నారు: జంపింగులపై తీర్పు రిజర్వ్
తెలంగాణ రాజకీయాల్లో గత రెండు సంవత్సరాలుగా చర్చనీయాంశంగా మారిన జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారంపై హైకోర్టు విచారణను ముగించింది.
తెలంగాణ రాజకీయాల్లో గత రెండు సంవత్సరాలుగా చర్చనీయాంశంగా మారిన జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారంపై హైకోర్టు విచారణను ముగించింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును సెప్టెంబరు 19న వెలువరించనున్నట్టు తెలిపింది. అయితే.. విచారణ సందర్భంగా బీఆర్ ఎస్ తరఫు న్యాయవాది చేసిన వ్యాఖ్యలను కోర్టు సీరియస్‌గా తీసుకుంది. తమ పార్టీ తరఫున గెలిచి.. కాంగ్రెస్‌లో చేరిన వారు.. వితండ వాదం చేస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
దీంతో సదరు వాదనను, దీనికి సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలను కూడా పరిశీలిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. 2023 ఎన్నికల్లో బీఆర్ ఎస్ తరఫున విజయం దక్కించుకున్న వారిలో 10 మంది ఎమ్మెల్యేలు.. తర్వాత కాలంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలికారు. దీనిపై బీఆర్ఎస్ అప్పటి నుంచి న్యాయ పోరాటంతో పాటు అసెంబ్లీలోనూ నిలదీస్తోంది. సుప్రీంకోర్టు గడప కూడా తొక్కిన ఈ కేసులో స్పీకర్ సదరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు.
సుదీర్ఘకాలం పాటు సాగిన ఈ విచారణ అనేక మలుపులు తిరిగింది. `అభివృద్ధి` కోసమే తాము కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నామని.. బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని.. ఈ ఎమ్మెల్యేలు అనేక సందర్భాల్లో చెప్పారు. తాజాగా కోర్టుకు కూడా ఇదే విన్నవించారు. అయితే.. వీరు కాంగ్రెస్ జెండా కప్పుకోవడం, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. ఏకంగా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడం వంటివి వారిని ఇరికించేశాయి.
ఈ విషయాలనే బీఆర్ఎస్ తరఫు న్యాయవాది కోర్టులో వివరించారు. ''కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొని.. ఆ పార్టీలో చేరారు. అదేమని అడిగితే దానిని జాతీయ జెండాగా చెబుతున్నారు. కానీ, జాతీయ జెండాలో అశోక చక్రం ఉంటుంది. కాంగ్రెస్ జెండాలో అది ఉండదు. ఇక, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం.. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేశారు. పార్టీ సభ్యత్వం లేకుండా ఎంపీటికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి.. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలి'' అని కోర్టును అభ్యర్థించారు. కాగా.. దీనిపై తీర్పును సెప్టెంబరు 19కి వాయిదా వేసింది.