అమెరికా : రేవంతుకు బ్రేకులు వేసింది ఎవరు ?
ఆయన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందని, ఈ మేరకు రాజకీయ కారణాలతో అనుమతులు ఇవ్వలేమని విదేశాంగ శాఖ వెల్లడించినట్లు చెబుతున్నారు.
పది రోజుల బ్రిటన్, అమెరికా పర్యటనకు బయలుదేరిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23న లండన్ నుండి తిరిగి భారత్ కు రానున్నారు. ఆయన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందని, ఈ మేరకు రాజకీయ కారణాలతో అనుమతులు ఇవ్వలేమని విదేశాంగ శాఖ వెల్లడించినట్లు చెబుతున్నారు.
అమెరికా పర్యటనలో బోస్టన్, న్యూయార్క్ తదితర ప్రాంతాల్లో పర్యటించి హార్వర్డ్, ఎంఐటీ, నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని, రేవంత్ రెడ్డికి అనుమతి నిరాకరించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అమెరికా పర్యటన రద్దయినట్లు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్పందిస్తూ, “ఈ పర్యటన ఉద్దేశం ఒక్కటే. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రపంచంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలను భారత్‌కు, తెలంగాణకు, హైదరాబాద్‌కు తీసుకురావడం. అత్యుత్తమ ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలను, ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల నుంచి విద్య, నైపుణ్యాలు, శిక్షణ పొందాలన్న మన యువత ఆకాంక్షలకు ఇవి సమాధానంగా నిలిచేవని, దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయానికి వస్తే అందరూ రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాలని నేను ఎప్పుడూ విశ్వసిస్తానని” అని పేర్కొన్నారు.
మరోవైపు సీఎం పర్యటన రద్దువెనక వివిధ రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత వ్యాఖ్యల నేపథ్యంతో పాటు రాష్ట్రంలో శక్తి పథకం విషయంలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు తీవ్రతరం కావడం, మరోవైపు 22ఎ కింద నిషేధిత భూముల విషయంలో బాధితుల తీవ్ర ఆందోళనల నేపథ్యంలో పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లకుండా తిరిగి వచ్చి రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దాలని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతున్నది.
అదే సమయంలో రాష్ట్రంలో వేగంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో అమెరికా పర్యటన రద్దు చేసుకుని రాష్ట్రానికి రావాలని రేవంత్ రెడ్డి సన్నిహితులే సూచించిన నేపథ్యంలోనే అమెరికాకు అధికారులను పంపించి తాను తిరిగి వస్తున్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా వచ్చే నెల 10 వరకు బ్రిటన్, అమెరికాతో పాటు జర్మనీ, చైనాలను సందర్శించాల్సి ఉంది. కానీ అన్ని రోజుల పర్యటన మరీ సుధీర్ఘంగా అవుతుందని దానిని కుదించి కేవలం బ్రిటన్, అమెరికా పర్యటనలకు మాత్రమే పరిమితం అయ్యారు. తాజా పరిణామాలతో అమెరికా పర్యటన కూడా రద్దవడం గమనార్హం.