హెచ్-1బీ నిరుద్యోగ సైన్యానికి శుభవార్త: ట్రంప్ తాత 'ఫీజు'ల పండగ మొదలైంది..
మన ట్రంప్ తాత అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విదేశీ ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టించే కొత్త ఫీజుల వడ్డన లేకుండా అసలు రోజే గడవదు.
అమెరికా కలలు కనే అభాగ్య భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు.. "వచ్చామా.. కోడింగ్ చేసుకున్నామా.. డాలర్లు సంపాదించామా" అని ప్రశాంతంగా బతికేద్దామనుకునే హెచ్-1బీ వీసా జీవులకు ఒక అదిరిపోయే 'సర్ప్రైజ్' రెడీ అవుతోంది. మన ట్రంప్ తాత అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విదేశీ ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టించే కొత్త ఫీజుల వడ్డన లేకుండా అసలు రోజే గడవదు. ఇప్పుడు అదే సిరీస్‌లో మరో సరికొత్త ఫీజుల ప్లాన్‌కు వైట్‌హౌస్ పచ్చజెండా ఊపేసింది. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) రూపొందించిన ఆర్ఐఎన్ 1615-ఏడీ20 అనే సీక్రెట్ కోడ్ నేమ్ ప్రతిపాదనకు ఓఐఆర్ఏ క్లియరెన్స్ ఇచ్చేసింది. అంటే అర్థం ఏంటో తెలుసా.. మన ఐటీ కంపెనీల జేబులకు చిల్లులు పొడిచేందుకు తుది పేపర్‌వర్క్ పూర్తయిపోయిందని..
అయితే ఎంత బాదుతారో ప్రస్తుతానికి దేవుడికే తెలియాలి. అధికారికంగా వివరాలు బయటకు చెప్పలేదు కానీ.. షాక్ ఇవ్వడంలో ట్రంప్ మార్క్ మాత్రం గ్యారెంటీగా ఉంటుంది. విదేశాల నుంచి నేరుగా ఉద్యోగులను తెచ్చుకుంటే లక్ష డాలర్లు కట్టాలనే వినూత్న రూల్‌ను ఇప్పటికే తెచ్చిన మహానుభావులు.. ఇప్పుడు ఇంటర్నల్‌గా ఉండే వీసాల ఫీజులను కూడా ఆకాశానికి ఎత్తేసే ప్లాన్‌లో ఉన్నారు. లోకల్ అమెరికన్లకు ఉద్యోగాలు కాపాడటానికి హెచ్-1బీ 'దుర్వినియోగాన్ని' అరికట్టడానికే ఈ పవిత్ర కార్యం చేపడుతున్నామని అమెరికా ప్రభుత్వం చాలా అమాయకంగా చెబుతోంది. కానీ అసలు కథ ఏంటంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి బడా ఐటీ దిగ్గజాలు ఎంత ఫీజు పెంచినా "మా దగ్గర బోలెడు డాలర్లు ఉన్నాయిలే" అని కట్టేస్తాయి. కానీ చిన్న, మధ్యస్థాయి కన్సల్టింగ్ కంపెనీలు మాత్రం "అయ్యో దేవుడా" అని తలలు పట్టుకోవాల్సిందే. ఒక విదేశీ ఉద్యోగికి వీసా స్పాన్సర్ చేసే బదులు ఆ డబ్బులతో నలుగురు లోకల్ కుర్రాళ్లను పెట్టుకోవచ్చు అని అమెరికన్ యజమానులు ఆలోచించడం మొదలుపెడితే మన దేశీ బ్రెయిన్లకు అక్కడ గిరాకీ తగ్గే ప్రమాదం ఉందన్నమాట.
ప్రస్తుతానికి ఇదంతా 'ప్రతిపాదన' దశలోనే ఉంది కాబట్టి మనోళ్లు వెంటనే బ్యాగులు సర్దుకోవాల్సిన అవసరం లేదు. డీహెచ్ఎస్ ఈ నిబంధనలను ప్రచురించాలి.. పబ్లిక్ నుంచి కామెంట్లు, శాపనార్థాలు స్వీకరించాలి.. ఆ తర్వాతే తుది నిర్ణయం వస్తుంది. ఏది ఏమైనా "అమెరికా పోవాలి... గ్రీన్ కార్డ్ కొట్టాలి" అనుకునే భారతీయ టెక్కిలకు రాబోయే రోజుల్లో హెచ్-1బి వీసా దక్కడం అంటే 'సాహసమే అని చెప్పాలి'. వైట్‌హౌస్ సమీక్షను దాటడం ద్వారా ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వ్యవస్థను మరింత కఠినంగా మార్చే దిశగా ముందుకు సాగుతున్న సంకేతాలు స్పష్టమయ్యాయి.
చూడాలి మరి ఈ కొత్త ఫీజుల బాదుడు ఐటీ కంపెనీల లాభాలను, భారతీయ ఉద్యోగుల అమెరికా కలలను ఎంతవరకు కరిగిస్తుందో..