ఏసీబీ దాడుల్లో ఏకంగా రూ.100 కోట్ల ఆస్తులు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న దేశాని శ్రీనివాస్ రెడ్డి నివాసాల మీద అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు.
హైదరాబాద్ లో ఏసీబీ జరిపిన దాడుల్లో మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. ఏకకాలంలో 15 చోట్ల నిర్వహించిన దాడులలో ఏకంగా వంద కోట్ల విలువైన ఆస్తులు బహిర్గతం అయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న దేశాని శ్రీనివాస్ రెడ్డి నివాసాల మీద అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు.
అధికారిక రికార్డుల ప్రకారం ఈ దాడుల్లో పట్టుబడిన ఆస్తుల విలువ రూ.6.87 కోట్లుగా కనిపిస్తున్నా బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్ల పైన ఉంటుందని చెబుతున్నారు. కర్మన్ ఘాట్ లో 2.63 కోట్ల విలువైన రెండు రెసిడెన్షియల్ ప్లాట్లు, రూ.1.61 కోట్ల విలువైన జీ ప్లస్ 3 పెంట్ హౌస్ ఉన్నట్లు గుర్తించారు.
దాంతో పాటు యాచారం మండలం నల్లవెల్లి గ్రామంలో రూ.25.25 లక్షల విలువ చేసే పది ఎకరాల వ్యవసాయ భూమి, నగర శివార్లలో 63.84 లక్షల విలువ చేసే ఎనిమిది ఖాళీ స్థలాలు, బాలాపూర్ లోని నరేంద్ర బార్ అండ్ రెస్టారెంట్ లో రూ.86 లక్షల పెట్టుబడులు, రూ.4 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.8.60 లక్షలు, 680 గ్రాముల బంగారం, రూ.59 లక్షల విలువైన మూడు కార్లు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు.
శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం, బాలాపూర్, శంషాబాద్ తదితర ప్రాంతాలలో తహసీల్దార్ గా పనిచేశారని, మహేశ్వరం మండలంలో పనిచేస్తున్న సమయంలో 2009లో అవినీతి నిరోధక చట్టం కింద ఒక కేసు నమోదయిందని సమాచారం. తాజా దాడుల అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండ్ తరలించారు.