యాక్సిడెంట్.. యువతి మరణంపై మౌనం వీడిన లింగమనేని..
హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజూష్ వివరణ ఇచ్చారు.
హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజూష్ వివరణ ఇచ్చారు. ఈ ప్రమాదం తన నిర్లక్ష్యం వల్ల జరగలేదని.. ఇది పూర్తిగా దురదృష్టవశాత్తు జరిగిన ఘటన అని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత తాను అక్కడి నుంచి పారిపోలేదని.. బాధ్యతగల పౌరుడిగా వ్యవహరించానని స్పష్టం చేశారు.
వెంటనే ఆసుపత్రికి తరలింపు.. పోలీసులకు సమాచారం
ఆగస్టు 16న జరిగిన ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న భారతి (26) అనే యువతి తీవ్రంగా గాయపడింది. ఆమె ఇనార్బిట్ మాల్‌లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే తీవ్ర గాయాలపాలైన భారతిని కాపాడేందుకు తన సొంత వాహనంలోనే ఆసుపత్రికి తరలించినట్లు సంజూష్ తెలిపారు. సత్వర వైద్య సహాయం అందించేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నించినప్పటికీ.. చికిత్స పొందుతూ ఆమె మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం తాను నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని సంజూష్ చెప్పారు. ప్రమాద వివరాలను స్వచ్ఛందంగా అధికారులకు వెల్లడించి.. చట్టపరమైన ప్రక్రియకు మొదటి నుంచే పూర్తి సహకారం అందించానని తెలిపారు.
వైద్య పరీక్షలన్నీ నెగెటివ్
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నిర్వహించిన వైద్య పరీక్షల వివరాలను కూడా ఆయన వెల్లడించారు. ప్రమాద సమయంలో తన పరిస్థితిని నిర్ధారించేందుకు పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్షతో పాటు రక్తం, మూత్ర పరీక్షలు నిర్వహించారని తెలిపారు. ఈ మూడు వైద్య పరీక్షల్లోనూ ఫలితాలు 'నెగెటివ్'గా వచ్చాయని, తద్వారా తాను ఎలాంటి మద్యం లేదా ఇతర పదార్థాల ప్రభావంలో లేనట్లు స్పష్టమైందని చెప్పారు.
చట్టంపై పూర్తి విశ్వాసం
దేశ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని సంజూష్ పేర్కొన్నారు. ప్రమాదానికి ముందు... తర్వాత జరిగిన పరిణామాలన్నీ పారదర్శకమైన దర్యాప్తు ద్వారా వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా ఈ ప్రమాద ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంజూష్‌పై బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసినట్లు సమచారం. సీసీటీవీ విజువల్స్, ఆధారాలు, వైద్య నివేదికల ఆధారంగా పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.