రేవంత్ టూర్.. ముందుకా ? వెనక్కా ?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 19 నుండి 30వ తేదీ వరకు యూకే, అమెరికా పర్యటనలకు బయలుదేరి వెళ్లారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 19 నుండి 30వ తేదీ వరకు యూకే, అమెరికా పర్యటనలకు బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం లండన్ లో ఉన్న ఆయన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూతురి వివాహానికి హాజరు కావడంతో పాటు, నేడు ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీని సందర్శించిన అనంతరం బ్లావట్నిక్ స్కూల్ ఆప్ గవర్నెన్స్ ను సందర్శిస్తారు. దీంతో పాటు కేంబ్రిడ్జ్, లండన్ వర్శిటీలు సందర్శించి ప్రతినిధులతో సమావేశం కావడంతో పాటు ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్ బాల్ ప్రజెంటేషన్ కు హాజరవుతారు.
దేశంలోని ఏ ముఖ్యమంత్రి అయినా విదేశీ పర్యటనకు వెళితే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి యూకే పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో బ్రిటన్ వెళ్లిపోయారు. కానీ ఆయన అమెరికా పర్యటనకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్రం నుండి ఎలాంటి అనుమతి రాలేదని సమాచారం.
అమెరికా పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి ఈ నెల 24న హార్వర్డ్ యూనివర్శిటీ, మసాచుసెట్స్ ఎంఐటీ క్యాంపస్, ఆగస్ట్ 25న బోస్టన్ లోని నార్త్ ఈస్టర్న్ క్యాంపస్ మరియు వర్జీనియా టెక్ యూనివర్శిటీ అధికారులతో భేటీ కానున్నారు. ఆగస్ట్ 26న న్యూయార్క్ లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరై ఆగస్ట్ 29న బయలుదేరి 30న భారత్ కు చేరుకోవాల్సి ఉంది.
అయితే షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న అమెరికాలోని బోస్టన్ కు రేవంత్ రెడ్డి బయలుదేరాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కేంద్రం అమెరికా పర్యటనకు అనుమతులు ఇవ్వలేదు. సాధారణంగా ప్రత్యేక పరిస్థితులు ఉంటే మినహా అనుమతులు వెంటనే ఇస్తారు. కానీ అమెరికా పర్యటనకు అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం ఒక్కటే పనిదినం మిగిలి ఉన్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ కేంద్రం నుండి అనుమతులు రాకుంటే రేవంత్ రెడ్డి యూకే నుండే భారత్ కు వెనుదిరగాల్సి ఉంటుంది.