టీడీపీ సీటు మీదనే జనసేన కర్చీఫ్ ?
జనసేనకు గాజువాక మీద మక్కువ ఉన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేశారు.
ఏపీలో రాజకీయ వేడి చూస్తే ఎక్కడా తగ్గడం లేదు. ఎన్నికలు అయి రెండేళ్ళకు పై దాటింది. మరో మూడేళ్ళ దాకా సార్వత్రిక ఎన్నికలు ఉండవు. అయినా ఏపీలో ప్రతీ రోజూ రాజకీయ సవాళ్ళూ ప్రతి సవాళ్ళూ నడుస్తూనే ఉంటాయి. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నది అలా సాగుతూనే ఉంటుంది. ఇక కూటమిలోని పార్టీలు కూడా రాజకీయంగా యాక్టివ్ గా ఉండడం మరో విశేషం. టీడీపీతో కలసి పొత్తులో ఉంటూ జనసేన తన భవిష్యత్తు ఆలోచనలను రూపొందించుకుంటోందా అన్న చర్చ సాగుతోంది. జనసేనకు 21 సీట్లు ఉన్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ సీట్ల సంఖ్యను బాగా పెంచుకోవాలని ఒక ప్రతిపాదన ఉంది. అదే సమయంలో జనసేన ద్వారా ప్రస్తుతం ఎమ్మెల్యేలు అయిన వారు వచ్చే ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాలు చూసుకుంటున్నారు అన్న వార్తలు కూడా రాజకీయంగా రక్తిని కట్టిస్తున్నాయి.
ఉమ్మడి విశాఖ జిల్లాలో :
ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 సీట్లు ఉంటే ఏజెన్సీలో రెండు సీట్లను వైసీపీ గెలుచుకుంది. మిగిలిన 13లో జనసేన నాలుగు గెలుచుకుంటే టీడీపీ తొమ్మిదింటిని గెలుచుకుంది. ఇక అప్పట్లో రాజకీయ బదిలీలు పెద్ద ఎత్తున సాగాయి. సర్దుబాటులో టీడీపీ సీనియర్లను వేరే చోటకు మార్చారు. అలా వెళ్ళిన వారు తిరిగి సొంత గూటికి చేరుకోవడానికి చూస్తున్నారు. ఆ ప్రయత్నాలు అలా ఉండగానే జనసేనలో ఫైర్ బ్రాండ్ గా పేరు గడించిన ఒక ఎమ్మెల్యే మరో నియోజకవర్గం మీద కన్ను వేస్తున్నారా అన్న చర్చ ఇపుడు సాగుతోంది. ఆ ఎమ్మెల్యేవే ఎలమంచిలి నుంచి 2024 ఎన్నికల్లో గెలిచిన సుందరపు విజయ కుమార్. ఆయన అక్కడ నుంచి రెండు సార్లు జనసేన తరఫున పోటీ చేస్తే 2024లో పొత్తులో గెలిచారు. ఎలమంచిలిలో ఆయనకు మంచి పట్టు కూడా ఉంది. అయితే సుందరపు పుట్టిన రోజు వేడుకలు తాజాగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు గాజువాకలోనూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టి మరీ జనసేన క్యాడర్ ఆయన అభిమానులు హడావుడి చేశారు. విశాఖ జిల్లా రాజకీయాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.
గాజువాక మీద ఫోకస్ :
జనసేనకు గాజువాక మీద మక్కువ ఉన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేశారు. ఓటమి పాలు అయినా భారీగానే ఓట్లు లభించాయి. దాంతో 2024 ఎన్నికల్లో కూడా ఆ సీటు కోసం జనసేన నేతలు ప్రయత్నం చేశారు. అయితే ఆ సీటు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సొంత సీటు. ఆయన వరసగా మూడు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు గెలిచిన సీటు అది. మరి అలాంటి సీట్లో సుందరపు విజయ్ కుమార్ జన్మ దిన వేడుకల పేరుతో అభిమానులు హడావుడి చేయడం రాజకీయంగానూ డిస్కషన్ గా ఉంది.
బలమైన సామాజిక వర్గం :
జనసేనకు అక్కడ బలమైన సామాజిక వర్గం అండదండలు ఉన్నాయి. సుందరపు విజయ కుమార్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయన పట్ల అభిమానంతో ఇలా చేశారా లేక నిజంగానే ఆయనకు షిఫ్ట్ అయ్యే ఆలోచన ఉందా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. పైగా ఫ్లెక్సీలలో ఎక్కడ చూసినా సుందరపు ఫోటోలు తప్పించి మిగిలిన నేతలవి లేకపోవడం కూడా చర్చకు తావిస్తోంది అని అంటున్నారు. దీంతో దీని భావమేమి విజయ కుమారా అని అంతా సందేహిస్తున్న పరిస్థితి ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం ఈ ఫ్లెక్సీల వ్యవహారం ఏ విధమైన పరిణామాలకు దారి తీయబోతోందో.