రోబో డాగ్ తో చిరుతలకు చెక్ పెట్టినట్లేనా ?!

అంతకు ముందు 2023 జూన్ నెలలో మూడేళ్ల బాలుడిని చిరుత ఈడ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా భక్తులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై అరవడంతో బాలుడు క్షేమంగా బయటపడ్డాడు.

Update: 2026-08-21 04:39 GMT

తిరుమల అలిపిరి, శ్రీవారి మెట్ల దారిలో గత కొన్నేళ్లుగా చిరుత పులుల సంచారం పెరిగిపోయింది. 2023 ఆగస్ట్ 11న తల్లిదండ్రులతో కలిసి కాలినడకన వెళ్తున్న ఆరేళ్ల బాలిక లక్షిత మీద చిరుతదాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. తిరుమల కాలినడకన ఇలా ఒకరు మరణించడం అదే తొలిసారి కావడం గమనార్హం.

అంతకు ముందు 2023 జూన్ నెలలో మూడేళ్ల బాలుడిని చిరుత ఈడ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా భక్తులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై అరవడంతో బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. టీటీడీ, అటవీ అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి అయిదుకు పైగా చిరుతలను బోన్లలో బందించి అటవీప్రాంతంలో విడిచిపెట్టారు.

అయినప్పటికీ చిరుతల బెడద తరచూ ఎదురవుతూనే ఉంది. దీంతో భద్రతాచర్యల్లో భాగంగా చిన్న పిల్లలతో వచ్చే భక్తులను మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకమార్గంలో అనుమతించడం లేదు. భక్తులను అలిపిరి మార్గంలో ఉదయం 5 నుండి రాత్రి 9.30, శ్రీవారి మెట్ల మార్గంలో ఉదయం 6 నుండి సాయంత్రం 5.30 ప్రాంతంలో గుంపులు గుంపులుగా భద్రతా సిబ్బందితో కలిసి పంపుతున్నారు.

అయితే భక్తులకు మరింత భద్రతను అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నడకమార్గంలో ఆధునిక సాంకేతికతతో కూడిన రోబోటిక్ డాగ్ ను ప్రారంభించింది. ఇది కాలినడక మార్గాల్లో చిరుతలతో పాటు ఇతర వణ్యప్రాణుల కదలికలను గుర్తించి ప్రమాదాలు జరగకుండా సహాయపడుతుందని భావిస్తున్నారు.

అధునాతన కెమెరాలు, సెన్సార్లు, అప్టికల్ కెమెరాలతో పాటు 360 డిగ్రీల లైడార్ కలిగిఉన్న ఈ రోబోటిక్ డాగ్ రాత్రి వేళల్లో మరియు దట్టమైన పొగమంచులోనూ వణ్యప్రాణుల సంచారాన్ని అలవోకగా గుర్తిస్తుందని, ఏఐ ద్వారా మనుషులు, వణ్యప్రాణులు, వాహనాలను వేర్వేరుగా గుర్తించి వర్గీకరిస్తుందని చెబుతున్నారు. జంతువులు భక్తుల వైపు వెళ్తున్నప్పుడు శబ్దం మరియు లైట్ల కాంతిని ఉపయోగించి వాటిని అటవీప్రాంతం వైపు మళ్లించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ ప్రయోగం ఎంత వరకు విజయవంతం అవుతుందో వేచిచూడాలి. అదే సమయంలో భక్తుల భద్రతకు టీటీడీ తీసుకుంటున్న చర్యలు అభినందనీయం.

Tags:    

Similar News