అయ్యా భారత్.. ఈ ఇరాన్–అమెరికా యుద్ధాన్ని నువ్వే ఆపాలి

ప్రపంచంలో మిగిలిన దేశాలన్నీ శాంతి మంత్రాలు చదివి విసిగిపోయాక "అబ్బే మీరంతా వేస్ట్ ఆ ఇండియా గనుక కాస్త తలదూర్చితే మా పంచాయితీ తెగిపోతుంది" అని ఆయన అనడం చూస్తుంటే ముచ్చటేస్తోంది.

Update: 2026-08-21 08:25 GMT

పశ్చిమాసియా అనే రచ్చబండ మీద ఇరాన్, అమెరికాలు ఎప్పుడు పైపెచ్చు కొట్టుకుంటాయో తెలియక ప్రపంచమంతా బిక్కుబిక్కుమంటూ చూస్తుంటే ఉన్నట్టుండి అందరి చూపు మన భారత్ వైపు మళ్లింది. ఇన్నాళ్లూ చెరో వైపు నుంచి మిస్సైళ్లు, బెదిరింపుల మ్యాప్‌లు విసురుకున్న ఈ రెంటికి.. ముంబైలో ఉన్న ఇరాన్ కాన్సుల్ జనరల్ గారి వ్యాఖ్యలతో ఒక్కసారిగా 'అహింసా పరమో ధర్మః' గుర్తొచ్చినట్టుంది. ప్రపంచంలో మిగిలిన దేశాలన్నీ శాంతి మంత్రాలు చదివి విసిగిపోయాక "అబ్బే మీరంతా వేస్ట్ ఆ ఇండియా గనుక కాస్త తలదూర్చితే మా పంచాయితీ తెగిపోతుంది" అని ఆయన అనడం చూస్తుంటే ముచ్చటేస్తోంది.

అసలే ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హార్మూజ్ జలసంధి నాదంటే నాదని ఇరు దేశాల పెద్దలు తొడలు చరుచుకుంటున్నారు. ట్రంప్ గారు తనదైన శైలిలో మ్యాప్‌లు పట్టుకుని "ఇదంతా మాదే" అని సైన్యం కవాతు చేస్తుంటే "మా భూభాగంలో వేలు పెడితే చూస్తూ ఊరుకోం" అని ఇరాన్ ప్రతినభూనుతోంది. తీరా వ్యవహారం ముదిరి పాకాన పడేసరికి "భారత్ చాలా గొప్ప దేశం, శాంతిని ప్రేమిస్తుంది, మోదీ గారు కూడా దౌత్యమే ముద్దు అన్నారుగా" అంటూ మన మీద ప్రేమను కురిపించడం నిజంగానే దౌత్య ప్రపంచంలో ఒక మాస్టర్ స్ట్రోక్. తమ మధ్య రగులుతున్న మంటలను ఆర్పడానికి భారత్ అనే బలమైన అగ్నిమాపక యంత్రం కావాలని ఇరాన్ బలంగా కోరుకుంటోంది.

ఇందులో మన లాభం కూడా లేకపోలేదు లెండి. అక్కడ ఏ చిన్న బాంబు పేలినా ఇక్కడ మన చమురు ధ‌ర‌లు రాకెట్‌లా పైకి లేచిపోతాయి, పైగా గల్ఫ్‌లో ఉన్న మనోళ్ల భద్రత అగ్గిలో పడుతుంది. అందుకే రెండు వైపులా సీరియస్‌గా మొహాలు మాడ్చుకుని కూర్చున్న పెద్ద మనుషులను ఒకే బెంచ్ మీద కూర్చోబెట్టి లాలించే బాధ్యత భారత్ భుజాన పడేలా ఉంది.

శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న పాత సామెతను పక్కనపెట్టి శత్రువులకి మిత్రుడైన భారత్‌ మాత్రమే ఈ ముళ్ల కంచెను తొలగించగలదని ప్రపంచం భావించడం విశేషం. ఏదేమైనా ప్రపంచ పెద్దన్నల గొడవలు సర్దుమణిగించడానికి చివరకు మన దౌత్యమే దిక్కవడం మన స్వయంప్రతిపత్తికి ఒక విచిత్రమైన పరీక్షే.

Tags:    

Similar News