'బిచ్చగాళ్లు'... పాకిస్థానీయులపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!
ఇదే సమయంలో.. ఐఎంఎఫ్ పాకిస్థాన్ కు బిలియన్ డాలర్ల అప్పు ఇవ్వడంపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.;
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంద్ని.. భారత్ ను మతప్రాతిపదికన విభజించాలని ప్రయత్నిస్తోందని.. ఈ సందర్భంగా పాక్ దుశ్చర్యలను ప్రతి భారతీయుడు తిప్పికొట్టాలని మజ్లిస్ నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఇదే సమయంలో.. ఐఎంఎఫ్ పాకిస్థాన్ కు బిలియన్ డాలర్ల అప్పు ఇవ్వడంపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... మతం పేరుతో పాకిస్థాన్ మారణహోమం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని.. భారత్ నుంచి విడిపోయిన తర్వాత కూడా మతవిద్వేషాలు రెచ్చగొట్టి, ఘర్షణలు సృష్టించాలని చూస్తోందని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ద్విజాతి సిద్ధాంతంపై ఏర్పడిన పాక్.. అటు ఆఫ్ఘాన్ పై ఎందుకు దాడి చేస్తోందని.. ఇరాన్ సరిహద్దుల్లో ఎందుకు బాంబులు వేస్తోదని ప్రశ్నించారు.
ఇదే సమయంలో.. ఆఫ్ఘన్లు, ఇరానియన్లు ముస్లింలు కాదా? అని నిలదీశారు. భారత్ లో 23 కోట్ల మందికిపైగా ముస్లింలు ఉన్నారని.. దేశంలో ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని అన్నారు. మరోవైపు.. పాక్ పదే పదే అణ్వాయుధ దాడి చేస్తామని బెదిరిస్తోందని.. అసలు ఆ దేశం అణ్వాయుధాలు కలిగి ఉండటానికి సరిపోతుందా అని ప్రపంచం అడగాలని అన్నారు.
ఈ సందర్భంగా ఐఎంఎఫ్ నిధులపైనా ఒవైసీ ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా... ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్థాన్ సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పాకిస్థాన్ కు ఒక బిలియన్ డాలర్ రుణాన్ని ఆమోదించడం ఏమిటని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఈ నేపథ్యంలోనే ఐఎంఎఫ్ సాయాన్ని "ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్"గా అభివర్ణించారు. ఈ సందర్భంగా.. పాకిస్థానీయులు అధికారిక బిచ్చగాళ్లని, ఐఎంఎఫ్ పాకిస్థాన్ కు అంతర్జాతీయ మిలిటెంట్ ఫండ్ ఇస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ సాయాన్ని అమెరికా, జర్మనీ, జపాన్ దేశాలు ఎలా అంగీకరించాయని ఒవైసీ ప్రశ్నించారు.