ముస్లింలకు ఒవైసీ కీలక విజ్ఞప్తి.. శుక్రవారం ఏమి చేయాలంటే..?

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారత్ తో పాటు ప్రపంచవాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.;

Update: 2025-04-24 16:44 GMT

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారత్ తో పాటు ప్రపంచవాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మరోపక్క దౌత్యపరంగా భారత్ – పాక్ మధ్య ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది. మరోపక్క ఉగ్రమూకలు హిందువులను ఏరి మరీ కాల్చారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ ముస్లింలకు కీలక విజ్ఞప్తి చేశారు.

అవును... ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) జాతీయ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ.. పహల్గాం ఉగ్రదాడిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతరం.. భారత్ లోని ముస్లిం సమాజానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శత్రువు ఉచ్చులో పడొద్దని భారతీయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నానంటూ... ఓ కీలక ప్రకటన చేశారు.

ఇందులో భాగంగా... శుక్రవారం ప్రార్థన సమయంలో (నమాజ్-ఎ-జుమ్మా) ముస్లింలందరూ తమ చేతులకు నల్లటి బ్యాండ్ ధరించి మసీదుకు వెళ్లాలని.. తద్వారా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యతా, శాంతి సందేశాన్ని అందించవచ్చని.. భారత్ లో తమ ఐక్యతను బలహీనపరచడానికి ప్రయత్నించే విదేశీ శక్తులను తాము అనుమతించబోమనే సందేశాన్ని పంపుదామని తన విజ్ఞప్తిలో పేర్కొన్నారు.

ఈ దాడి అనంతరం అశాంతిని వ్యాప్తి చేసే శక్తులు కాశ్మీరీ ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించవచ్చని.. అటువంటి పరిస్థితుల్లో మనమంతా ఐక్యంగా ఉండి, శత్రువుల ప్రణాళికలను భగ్నం చేయడం ముఖ్యం అని ఆయన హెచ్చరించారు. భారతీయులంతా మతపరంగా రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని ఒవైసీ విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News