ఆపరేషన్ సిందూర్ వేళ పాక్ యుద్ధ నౌకల పలాయనం ఇదే!
అవును... ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్థాన్ ను భారత సైన్యం అల్లల్లాడించిన సంగతి తెలిసిందే.;
పహల్గాం దాడికి ప్రతీకారం ఉగ్రవాదులపై మొదలుపెట్టిన ఆపరేషన్ సిందూర్.. అనంతరం పాక్ - భారత్ మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత సైన్యం.. పాక్ ను గజగజ లాడించేసిందనే విషయం ఇప్పటికే పలు సందర్భాల్లో తేటతెల్లమైంది. ఈ సమయంలో.. ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్థాన్ కు 1971 యుద్ధం గుర్తొచినట్లుందనే విషయం తెరపైకి వచ్చింది.
అవును... ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్థాన్ ను భారత సైన్యం అల్లల్లాడించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పలు ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో పాక్ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా... వారి నేవీకి చెందిన యుద్ధ నౌకలు, భారత్ క్షిపణుల దాడికి బలవ్వకుండా సుదూర ప్రాంతాలకు తరలించేసింది, మరికొన్నింటిని ఇరాన్ సరిహద్దులకు పంపేసింది!
తాజాగా ఓ జాతీయ దిన పత్రిక సంపాదించిన ఉపగ్రహ చిత్రాల్లో ఈ విషయం వెల్లడైంది. ఇందులో భాగంగా ఆపరేషన్ సిందూర్ వేళ భారత దూకుడు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు.. పాకిస్తాన్ నేవీ తన యుద్ధనౌకలను కరాచీలోని వారి నావల్ డాక్ యార్డ్ నుండి తరలించి, వాణిజ్య టెర్మినల్స్ లో ఉంచింది. ఇతర యుద్ధనౌకలు ఇరాన్ సరిహద్దు నుండి 100 కి.మీ దూరంలో నిలిపింది.
వాస్తవానికి మే 6 - 7 తేదీల మధ్య నాటి ఉపగ్రహ చిత్రాల్లో కరాచీ నౌకా స్థావరంలో కనిపించిన ఈ యుద్ధ నౌకలు.. మే 8వ తేదీ నాటి చిత్రాల్లో కనిపించలేదు. అదేనెల 10వ తేదీన 7 వార్ షిప్ లు 100 కిలోమీటర్ల దూరంలోని గ్వదార్ పోర్టులో దర్శనమిచ్చాయి. వీటిల్లో చైనాలో తయారైన జుల్ఫికర్ శ్రేణి ఫ్రిగెట్లు ఉన్నాయి.
ఆపరేషన్ సిందూర్ కు కేవలం ఆరు నెలల ముందు చైనా నుంచి పాక్ కు నాలుగు జుల్ఫికర్ శ్రేణి నౌకలు వచ్చాయి. వీటి ప్రారంభోత్సవ సమయంలో యాంటీషిప్ మిసైల్స్ ను ప్రయోగించిన వీడియోను పాక్ విడుదల చేసింది. అయితే... ఆపరేషన్ సిందూర్ ప్రారంభంకాగానే ఇవి నిర్ణీత నౌకాశ్రయాన్ని వదిలి వెళ్లిపోవడం గమనార్హం.
కాగా... 1971 పాకిస్థాన్ తో యుద్ధం వేళ భారత్ దళాలు 'ఆపరేషన్ పైథాన్' పేరిట కరాచీ రేవును లక్ష్యంగా చేసుకొని విధ్వంసం సృష్టించాయి. ఆ సమయంలో ఒక ఫ్లీట్ ట్యాంకర్ తోపాటు చమురు డిపోలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొన్ని వాణిజ్య నౌకలు కూడా మునిగిపోయాయి. ఆ రోజు రాత్రి పాక్ లో భారత సైన్యం దీపావళి చేసుకుంది.
ఈ విషయాన్ని ఏమాత్రం మరిచిపోలేని పాకిస్థాన్.. మే నెలలో భారత్ ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టిన మరుసటి రోజు తన యుద్ధ నౌకలను వాణిజ్య టెర్మినల్స్ కు, ఇరాన్ సరిహద్దులకు తరలించి జాగ్రత్తపడింది.