25 నిమిషాల్లో పూర్తి... మెరుపుదాడిని వివరించిన మహిళా అధికారులు!
పహల్గాంలోని పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ ఊహించనిస్థాయిలో అన్నట్లుగా ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.;
పహల్గాంలోని పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ ఊహించనిస్థాయిలో అన్నట్లుగా ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. ఈ సందర్భంగా ఈ ఆపరేషన్ పై కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ కీలక విషయాలు వెల్లడించింది.
అవును... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ని చేపట్టింది. ఈ సమయంలో ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ, కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరించారు. ఈ సందర్భంగా ఈ దాడి 25 నిమిషాల్లో పూర్తైనట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా స్పందించిన కల్నల్ సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్... నిఘా వర్గాల నుంచి వచ్చిన అత్యంత ఖచ్చితమైన సమాచారంతోనే ఈ దాడులు జరిపినట్లు తెలిపారు. ఇదే సమయంలో... ఉగ్రవాదులు కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను ధ్వంసం చేసినట్లు చెప్పారు. సామాన్య పౌరులకు ఎలాంటి హానీ కలగకుండా ఈ దాడులు చేసినట్లు వెల్లడించారు.
ఇదే సమయంలో... ఆపరేషన్ సిందూర్ అర్ధరాత్రి 1:05కి ప్రారంభమై.. 1:30 కల్లా ముగిసిందని సోఫియా ఖురేషీ తెలిపారు. ఆ 25 నిమిషాల వ్యవధిలొనే తొమ్మిది ఉగ్రవాద శిభిరాలను ధ్వంసం చేయడం జరిగిందని చెప్పారు. ఈ ఆపరేషన్ లో పాకిస్థాన్ లోని టెర్రర్ ఇండక్షన్ లతో పాటు ట్రైనింగ్ సెంటర్లను ధ్వంసం చేశామని వెల్లడించారు.
అదేవిధంగా.. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం చేయడానికి భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూరు ప్రారంభించాయని.. ఈ దాడుల్లో పౌర, మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం జరగకుండా, సైనిక స్థావారాలకు, పౌరుల ప్రాణాలకు ఇబ్బంది కలగకుండా ఉండటానికే ఈ ప్రదేశాలను ఎంపిక చేసుకున్నామని వ్యోమికా సింగ్ వెల్లడించారు.
ఈ సందర్భంగా పాకిస్థాన్ లోపల 12 - 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియాల్ కోట్ లోని మొహమూన్ జోయా శిబిరంతో సహా ధ్వంసమైన పలు ఉగ్రవాద శిబిరాలను కల్నల్ సోఫియా ఖురేషీ చూపించేలా వీడియోలు ప్రదర్శించారు. కాగా... ఓ పెద్ద సైనిక ఆపరేషన్ ను దేశ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు వివరించడం గమనార్హం.
ఇదే సమయంలో పహల్గాం ఘటనలో 26 మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారని.. జమ్మూకశ్మీర్ లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్న వేళ దాన్ని అడ్డుకోవాలనే లక్ష్యంతో ఆ దాడికి పాల్పడ్డారని.. మత ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా మారణహోమానికి పాల్పడ్డారని.. ఆ ఉగ్రమూకలకు పాకిస్థాన్ అండగా నిలుస్తోందని విక్రం మిస్రీ అన్నారు.
ఈ నేపథ్యంలో పహల్గాం దాడి అనంతరం ఉగ్రవాదుల కార్యకలాపాలని నిఘా సంస్థలు ట్రాక్ చేశాయని.. భారత్ పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాయని తెలిపారు. వాటిని అడ్డుకోవడం అత్యవసరమని భావించి.. ఖచ్చితమైన నిఘా సమాచారంతో ఉగ్ర స్థావరాలను గుర్తించి ధ్వంసం చేశామని వెల్లడించారు.