ట్రంప్ మధ్యవర్తిత్వం.. ఏం జరిగి ఉంటుంది?
ఇది మంచి పరిణామమే కావొచ్చు. ఎందుకంటే భారత్ సహజ సిద్ధంగానే యుద్ధానికి వ్యతిరేకం.;
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య మూడు రోజులుగా జరుగుతున్న తీవ్ర ఉద్రిక్తతలు.. పరస్సర దాడులు సైనిక చర్యగా.. యుద్ధంగా రూపు దాల్చుతున్న కీలక సమయంలో అగ్రరాజ్యం అమెరికా జోక్యం చేసుకుని.. ఇరు దేశాలకు శాంతింప చేసింది. ఇది మంచి పరిణామమే కావొచ్చు. ఎందుకంటే భారత్ సహజ సిద్ధంగానే యుద్ధానికి వ్యతిరేకం. తనకు అన్యాయం జరిగింది కాబట్టి.. తనకు దెబ్బ కొట్టిన ఉగ్రమూకను నిర్మూలించే క్రమంలోనే పాక్ సరిహద్దుల వెంబడి ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను ఆపరేషన్ సిందూర్ తో నేలమట్టం చేసింది. దీనిలో యుద్ధ కాంక్ష కానీ.. పాక్‌పై పైచేయి సాధించాలన్న వ్యూహాత్మక విధానం కానీలేవు.
కానీ, ఉగ్రవాదులకు ఆద్యంతం అండగా ఉంటూ.. వారితోనే జీవనం.. అంటూ ఉరకలెత్తిన పాకిస్థాన్.. ఉగ్రస్థావరాలపై దాడిని కూడా.. తమపై జరిగిన యుద్ధంగా ప్రచారం చేసింది. ప్రపంచ దేశాలు నవ్విపోయినా.. పాక్ తన పంథాను వదిలి పెట్టకుండా ఉగ్రవాదుల శవాలకు నివాళులు అర్పించి.. ప్రార్థనలు చేసి.. లాంఛనాలతో వారి అంత్యక్రియలు నిర్వహించింది. అంతేకాదు.. భారత జనావాసాలపై దాడులు చేసింది.. క్షిపణులు మోహరించింది. డ్రోన్లు ఎక్కు పెట్టింది. అయితే.. పాక్ పన్నాగాన్ని ముందుగానే లెక్కలేసుకున్న భారత్ అన్నింటినీ నేలమట్టం చేసి.. పాక్‌కు తగిన బుద్ధి చెప్పింది.
అయితే.. ఇది ప్రపంచ సమస్యగా మారుతున్నదన్న చర్చ తెరమీదికివచ్చింది. ఈ క్రమంలో ముందుగా తాము జోక్యం చేసుకోమని చెప్పిన అమెరికా అనూహ్యంగా రంగంలోకి దిగింది. ఇరు దేశాలు తమకు కావాల్సినవేనని ప్రకటించిన అగ్రరాజ్యం తక్షణ కాల్పుల విరమణకు ఒప్పించినట్టు పేర్కొంది. అయితే.. క్షణాల్లో అయితే.. ఇది జరిగిందని భావించలేదు. ట్రంప్ చెప్పినట్టు రాత్రి రాత్రి కొన్ని గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భారత్ కోరుకున్నది ఏంటి? అనేది ఆసక్తికర ప్రశ్న. ఆపరేషన్ సిందూర్ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఉగ్రవాదులను అప్పగించాలన్న ప్రధాన షరతుకు పాక్‌ను ఒప్పించి ఉండాలి.
లేదా.. ఉగ్రవాద స్థావరాలను తక్షణమే పాక్ నుంచి తీసేయాలన్న షరతుకు దాయాది దేశం లోబడి ఉండాలి. ఈ రెండు ఖచ్చితం గా జరిగి ఉంటాయని భావిస్తున్నారు. ఎందుకంటే .. ఇంత చేసి.. భారత్ ఉగ్రవాద స్థావరాల విషయంలో రాజీ పడుతుందన్న చర్చకు అవకాశం లేనేలేదు. ఇక, పాక్ పరిస్థితి చూస్తే.. అత్యంత ఘోరంగా తయారైంది. ఇంటా బయటా కూడా.. కలిసివచ్చే వారు లేరు. చైనా సహా మిత్రులు మౌనంగా ఉన్నారు. అంతర్గత రాజకీయం దుమారం రేపుతోంది. కానీ, భారత్ లో పార్టీలు.. ప్రజలు కూడా అంతా ఏకతాటిపైకి వచ్చారు. ఇది భారత్‌కు, మోడీకి మరింత బలం చేకూర్చింది. ఈ పరిణామాలు పాక్‌ను సహజంగానే వణికించాయి. దీంతో భారత్ డిమాండ్లకు పాక్ అంగీకరించి ఉంటుందన్న చర్చ అయితే తెరమీదికి వస్తోంది. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది.