దేశ భద్రత కోసం 10 శాటిలైట్లు... ఇస్రో ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఛైర్మన్ వి. నారాయణన్ కీలక వ్యాఖ్యలు చేశారు.;
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాలతో భారత్ రక్షణ దళ వ్యవస్థపై ఆసక్తికర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా పాకిస్థాన్ వందల డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలు భారత్ పైకి ప్రయోగించినా.. ఒక్కటి కూడా పని పూర్తి చేయకుండా చేసిన విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఎన్ని వందల డ్రోన్లు ప్రయోగించినా, ఎన్ని క్షిపణులను వదిలినా భారత్ వాటిని గాల్లోనే నిర్వీర్యం చేస్తుండటంతోనే.. ఇక తమదంతా వృథా శ్రమ, వృథా ప్రయత్నం అని భావించిన పాక్.. ప్రపంచం ముందు భారత్ తో సీజ్ ఫైర్ కోసం ప్రాకులాడిందని అంటున్నారు. ఈ స్థాయిలో భారత గగనతల రక్షణ వ్యవస్థ ఉందనే విషయం ప్రపంచానికి తాజాగా తెలిసింది.
ఈ నేపథ్యంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఛైర్మన్ వి. నారాయణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దేశ భద్రత కోసం 10 శాటిలైట్లు నిరంతరం పనిచేస్తున్నాయని.. ఇలా 24X7 పనిచేసే శాటిలైట్లు ఉండటం వల్ల ప్రజలు ధైర్యంగా ఉండాలని తెలిపారు. దేశంలో భద్రతకు ఈ శాటిలైట్లు వివిధ దశల్లో నింగిలోకి పంపించినట్లు పేర్కొన్నారు.
ఈ విధంగా దేశ ప్రజల భద్రత విషయంలో శాటిలైట్ల పాత్ర అత్యంత కీలకంగా ఉందని, ఉంటుందని వెల్లడించారు! తాజాగా మణిపూర్ లోని ఇంఫాల్ లో జరిగిన సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (సీ.ఏ.యూ) స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ నారాయణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... మణిపూర్ లోని ఇంఫాల్ లో జరిగిన సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (సీ.ఏ.యూ) స్నాతకోత్సవంలో మాట్లాడిన నారయణన్.. భారతదేశంలో 7,000 కి.మీ. సముద్ర తీరం, ఉత్తర భూభాగంలపై నిరంతరం నిఘా ఉంచాలని.. ఉపగ్రహాలు, డ్రోన్ టెక్నాలజీ లేకుండా దేశ భద్రత సాధ్యం కాదని అన్నారు. జాతీయ భద్రత ఇస్రో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.