ఆపరేషన్ లంగ్స్...కూటమికి ప్లస్సా మైనస్సా ?
విశాఖ నగరంలో ఇపుడు కూటమి మీద కోపాలు పెరుగుతున్నాయి. పైన రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది.;
విశాఖ నగరంలో ఇపుడు కూటమి మీద కోపాలు పెరుగుతున్నాయి. పైన రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది. సరిగ్గా చూస్తే జీవీఎంసీలోనూ కూటమి అధికారంలో ఉంది. దాంతో ప్రజాగ్రహం కాస్తా రెండిందాలుగా గట్టిగా తగులుతోంది. విశాఖ నగరంలో జీవీఎంసీ తాజాగా ఆపరేషన్ లంగ్స్ పేరుతో ఒక భారీ ప్రొగ్రాం తీసుకుంది. ఫుట్ పాత్ ల వద్ద ఉన్న బడ్డీలు చిన్నపాటి దుకాణాలు దారికి అడ్డంగా దిడ్డంగా ఉన్న షాపులు ఏ అనుమతులూ లేకుండా అనధికారికంగా ఆక్రమించుకున్న చిల్లర మల్లర షాపులు అన్నింటినీ తీసి పక్కన పెడుతోంది. వాటి నుంచి వ్యాపారులను ఖాళీ చేయిస్తోంది. రోజుకు ఒక ప్రాంతంగా ఎంచుకుని జీవీఎంసీ అధికారులు సిబ్బంది మొత్తానికి మొత్తం ఖాళీ చేయించేస్తున్నారు.
పెను గోడుగా చిరు ఘోష :
అయితే ఈ విధంగా బడ్డీలను దుకాణాలను ఉన్నఫళంగా ఖాళీ చేయించడంతో చిరు వ్యాపారులు అంతా ఘోష పెడుతున్నారు అది పెను గోడుగా మారుతోంది. దీంతో వారు కూటమి పార్టీలను నేతలను కూడా విమర్శిస్తున్నారు. తమ పొట్ట కొడతారా అని శాపాలు పెడుతున్నారు. తాము తమ బతుకులు బతుకుతూంటే ఈ విధంగా వచ్చి దుకాణాలను కూల్చేస్తే గుండెలలో గునపాలు దిగితున్నాయని మండిపోతున్నారు.
రంగంలోకి వైసీపీ :
సరిగ్గా ఇదే పాయింట్ తో వైసీపీ రంగంలోకి దిగిపోయింది. చిన్న వ్యాపారుల మీద మీ ప్రతాపమా అని కూటమి నేతల మీద ఫైర్ అవుతోంది. చిరు వ్యాపారులతో కలసి ఆందోళలను చేస్తోంది. జీవీఎంసీ వద్ద ధర్నాలు చేస్తోంది. దాంతో కూటమి మీద ఇతర పార్టీలు కూడా మండుతున్నాయి. మరో వైపు చూస్తే కూటమిలోని పార్టీలు కూడా ఇదేమి తీరు అని అధికారుల వైఖరి మీద కస్సుమంటున్నారు. తమతో మాట మాత్రం చెప్పకుండా ఇలా చేస్తారా జనసేన ఎమ్మెల్యే ఒకరు దీని మీద అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. తాము జనాలకు ఏమి జవాబు చెప్పుకోవాలని ఆయన అధికారులనే ప్రశ్నించారు.
వీధి విక్రయదారుల మేలు కోసమే :
అయితే అటు విపక్షాలు ఇటు కూటమిలోని పక్షాల వ్యతిరేకతతో జీవీఎంసీ అధికారులు ఇరుకున పడుతున్నారు. దాంతో వారు ఇందంతా చిరు వ్యాపారుల మేలు కోసమే అని అంటునారు. పాదచార మార్గాలలతో పాటు ఏకంగా రహదారులు, ముఖ్య కూడళ్లలోని తాత్కాలిక ఆక్రమణలను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఇవన్నీ ప్రజల రక్షణ కోసం , సౌకర్యాలను కల్పించడం కోసం అని చెబుతున్నారు. మరోవైపు ఆపరేషన్ లంగ్స్ ద్వారా ఉపాది కోల్పోయిన వీధి విక్రయదారుల సంక్షేమం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా జీవీఎంసీ చేపడుతోందని అధికారులు అంటున్నారు.అర్హులైన వీధి విక్రయదారులను గుర్తించి వారికి వ్యాపార అవకాశాలు, జీవనోపాధి ప్రయోజనాలు కల్పించే చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
స్థానిక ఎన్నికల వేళ :
అయితే జీవీఎంసీకి కొత్తగా వచ్చిన అధికారులు నగర సుందరీకరణ పేరుతో ఈ కూల్చివేతలు చేపట్టారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నిజానికి వీధి వ్యాపారులకు మేలు చేయాలి అనుకుంటే ముందే వారి కోసం ఏర్పాట్లు చేసి వ్యాపారాలు చేసుకోమని తరలించి ఉండాల్సింది అని అంటున్నారు. అలా కాకుండా పొట్ట కొట్టి వీధిన పడేశారని ఇపుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అంటున్నారని ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికలు మరికొద్ది నెలలలో పెట్టుకుని ఈ విధంగా చేయడం వల్ల కూటమికే ఇబ్బంది అవుతుందని నాయకులు అయితే ఆందోళన చెందుతున్నారు అధికారుల అతి ఉత్సాహమే ఈ విధంగా చేస్తోందని కొందరు అంటే మరి కొందరు మాత్రం కూటమిలో కీలక నేతలు కూడా ఇందులో ఉన్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఆపరేషన్ లంగ్స్ ఇపుడు కూటమికి ప్లస్ అవుతుందా లేక మైనస్ గా మారుతుందా అన్నది అయితే తెలియడం లేదని అంటున్నారు. నగర సుందరీకరణ అన్నది మంచి విషయమే దాని వల్ల కూటమికి పేరు రావచ్చు కానీ వేలల్లో ఉన్న చిరు వ్యాపారులు వారి కుటుంబాల నుంచి విమర్శలు కూడా ఫేస్ చేయాల్సి వస్తోంది అని అంటున్నారు.