పౌరుల భద్రతపై మెగా మాక్‌ డ్రిల్‌.. హైదరాబాద్ లో ఆపరేషన్ అభ్యాస్

ఈ మాక్‌ డ్రిల్‌లో మొత్తం 12 సివిల్‌ డిఫెన్స్‌ సర్వీసులు పాల్గొన్నాయి. సాయంత్రం 4 గంటలకు నాలుగు ప్రాంతాల్లో నిర్వహించిన ఎయిర్‌ రైడ్‌ డ్రిల్‌లో భాగంగా నగరంలోని అన్ని కూడళ్లలో రెండు నిమిషాల పాటు సైరన్లు మోగించారు.;

Update: 2025-05-07 09:14 GMT

హైదరాబాద్ నగర వ్యాప్తంగా బుధవారం మే 7న ‘ఆపరేషన్‌ అభ్యాస్‌’ పేరిట డిఫెన్స్‌ మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నారు.. యుద్ధం లాంటి పరిస్థితి వస్తే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా వ్యవహరించాలో అవగాహన కల్పించడం ఈ మాక్‌ డ్రిల్‌ ముఖ్య ఉద్దేశ్యం.

ఈ సందర్భంగా నగరమంతటా సైరన్ల మోత మోగింది. సాయంత్రం 4.15 గంటలకు నగరంలోని నాలుగు కీలక ప్రాంతాలు – సికింద్రాబాద్‌, గోల్కొండ, కంచన్‌బాగ్‌ డీఆర్‌డీవో, మౌలాలి ఎన్‌ఎఫ్‌సీలలో ఏకకాలంలో మాక్‌ డ్రిల్‌ ప్రారంభమైంది. ఈ ప్రాంతాలకు పోలీసులు, ఫైర్‌ సిబ్బంది, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, వైద్య సిబ్బంది, రెవెన్యూ, స్థానిక అధికారులు చేరుకుని సహాయక చర్యలపై విన్యాసాలు చేశారు. అత్యవసర సమయాల్లో సమన్వయం, స్పందన ఎలా ఉండాలో అధికారులు, ప్రజలకు ఈ సందర్భంగా వివరించారు.

ఈ మాక్‌ డ్రిల్‌లో మొత్తం 12 సివిల్‌ డిఫెన్స్‌ సర్వీసులు పాల్గొన్నాయి. సాయంత్రం 4 గంటలకు నాలుగు ప్రాంతాల్లో నిర్వహించిన ఎయిర్‌ రైడ్‌ డ్రిల్‌లో భాగంగా నగరంలోని అన్ని కూడళ్లలో రెండు నిమిషాల పాటు సైరన్లు మోగించారు. సైరన్‌ వినిపించిన వెంటనే బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. అలాగే, ఇళ్ల వద్ద ఉన్నవారు ఎలక్ట్రికల్‌ పరికరాలు, లైట్లు, స్టవ్‌లను ఆపివేయాలని ఆదేశించారు. ఈ సూచనలను పాటిస్తూ ప్రజలు మాక్‌ డ్రిల్‌కు సహకరించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో సంసిద్ధతను పెంపొందించడంలో ఈ ‘ఆపరేషన్‌ అభ్యాస్‌’ దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

డ్రిల్‌లో భాగంగా బ్లాక్‌ ఔట్‌ చర్యలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. యుద్ధ సమయంలో దీపాలన్నింటినీ ఆర్పేయడం, కిటికీలు, తలుపుల నుంచి కాంతి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, వాహనాల హెడ్‌లైట్లను ఆపివేయడం వంటివి వివరించారు. అలాగే, కీలక భవనాలు, చారిత్రక కట్టడాలను శత్రువులు గుర్తించకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియజేశారు. సాయంత్రం 4.30 గంటలకు మరోసారి సైరన్లు మోగడంతో మాక్‌ డ్రిల్‌ ముగియనుంది. ఈ డ్రిల్‌ నిర్వహణకు సహకరించిన నగర ప్రజలకు అధికారులు ధన్యవాదాలు తెలిపారు.

కాగా, దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ మాక్‌ డ్రిల్‌లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాచిగూడ, రాయచూర్‌, ఔరంగాబాద్‌ రైల్వే స్టేషన్లలోనూ బుధవారం ఇలాంటి అభ్యాసాలు నిర్వహించనున్నార.. యుద్ధ సమయంలో రైల్వే సిబ్బంది సన్నద్ధతను పరిశీలించడం ఈ డ్రిల్‌ ముఖ్యోద్దేశ్యం అని అధికారులు పేర్కొన్నారు.

Tags:    

Similar News