మోడీ ఎదుట.. కశ్మీర్ సీఎంది మళ్లీ పాత పాట

తాజా సభలో ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఒకవైపు రాజకీయంగా ముఖ్యమైన డిమాండ్‌ను గుర్తుచేస్తూ, మరోవైపు వ్యంగ్యానికి కూడా ఆస్కారం కలిగించాయి.;

Update: 2025-06-06 11:05 GMT
మోడీ ఎదుట.. కశ్మీర్ సీఎంది మళ్లీ పాత పాట

ప్రధాని నరేంద్ర మోదీ సభలో కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. చినాబ్ వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ఎదురుగానే ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ తనకు "ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది?" అంటూ వ్యంగ్య ధోరణిలో ప్రశ్నించారు.

- 2014లో సీఎం.. ఇప్పుడు డిమోషన్!

ఈ సందర్భంగా ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, "2014లో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాను. కానీ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతానికి సీఎంగా కొనసాగుతున్నాను. అంటే అప్పటితో పోలిస్తే ఇది ఒక రకమైన డిమోషనే. అయితే, అప్పట్లో రైల్వేశాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమోట్ అయ్యారు. త్వరలో నేను కూడా ప్రమోట్ అవుతానని ఆశిస్తున్నాను. దీన్ని సరిదిద్దేందుకు ఎక్కువ సమయం పట్టదని నేను అనుకుంటున్నాను" అని ప్రధాని మోదీ ఎదుటే వ్యాఖ్యానించారు.

-రాష్ట్ర హోదాపై ఎప్పటికీ అంచనా వేయలేం

జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో ఒమర్ అబ్దుల్లా గతంలో అనేకసార్లు కేంద్రాన్ని ప్రశ్నించారు. అయితే గతంలో జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోవడంతో, తన డిమాండ్‌కు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్టు ప్రకటించారు. "ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి అని అడగడం సిగ్గుచేటు. మా రాజకీయాలు చౌకబారు కావు. తగిన సమయానికే డిమాండ్ చేస్తాం" అని అప్పట్లో వెల్లడించారు.

-నేషనల్ కాన్ఫరెన్స్ విజయంతో తిరిగి బాధ్యతలు

2024లో జరిగిన స్థానిక ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్–కాంగ్రెస్ కూటమి విజయంతో ఒమర్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.

- మరోసారి కేంద్రాన్ని అడుగుతున్నా..

తాజా సభలో ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఒకవైపు రాజకీయంగా ముఖ్యమైన డిమాండ్‌ను గుర్తుచేస్తూ, మరోవైపు వ్యంగ్యానికి కూడా ఆస్కారం కలిగించాయి. తన పదవిని "డిమోషన్"గా అభివర్ణించడం ద్వారా ఒమర్ అబ్దుల్లా ప్రజల భావోద్వేగాలను ప్రస్తావించడమే కాకుండా, కేంద్రాన్ని తనదైన శైలిలో మరొకసారి చురక అంటించినట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా ఎప్పుడు పునరుద్ధరించబడుతుంది? ఒమర్ అబ్దుల్లాకు "ప్రమోషన్" ఎప్పుడు వస్తుంది? అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సిన సమయం ఇంకా దూరంగానే కనిపిస్తోంది.

Tags:    

Similar News