ట్రంప్‌కు నోబెల్ వస్తుందా? ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచం
కొన్ని విదేశాలు ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ తనను తాను "ప్రపంచ శాంతి కాముకుడిగా" "యుద్ధాలు ఆపిన వ్యక్తిగా" చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆయన కన్ను అత్యున్నత పురస్కారమైన నోబెల్ శాంతి బహుమతిపై పడింది. ట్రంప్ ఈ బహుమతి రేసులో ఉన్నారా ఆయనకు అవార్డు వస్తుందా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని పెంచుతోంది.
నోబెల్ రేసులో ట్రంప్ పేరు ప్రచారం
కొన్ని విదేశాలు ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆయన హయాంలో జరిగిన ఈ కింది చర్యలను నామినేషన్లకు కారణంగా చెబుతున్నారు:
ఉత్తర కొరియా – దక్షిణ కొరియా మధ్య చర్చలు జరిపించడం... ఇజ్రాయెల్ – అరబ్ దేశాల మధ్య శాంతి ఒప్పందాలు (అబ్రహాం అకార్డ్స్) కుదిర్చడం చేశాడు. అయితే, ఈ ఏడాది ట్రంప్ పేరు నిజంగా నోబెల్ నామినేషన్ల జాబితాలో ఉందా అనే విషయాన్ని మాత్రం ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు.
*నోబెల్ రూల్స్: కఠినమైన రహస్యం
నోబెల్ కమిటీ నిబంధనల ప్రకారం, ఎవరు బహుమతికి నామినేట్ అయ్యారు, ఎవరిని నామినేట్ చేశారు అనే వివరాలను 50 సంవత్సరాలు గడిచిన తర్వాత మాత్రమే అధికారికంగా వెల్లడిస్తారు. ఉదాహరణకు, మనం ఇప్పుడు 2025లో ఉన్నాం కాబట్టి, 1975 నాటి నామినేషన్ల వివరాలే ఈ ఏడాది అధికారికంగా బయటపడతాయి. అందుకే, ట్రంప్ నిజంగా ఈ ఏడాది (2025లో) నామినేట్ అయ్యారా లేదా అనేది 2075లోనే తెలుస్తుంది! ఈ కఠినమైన నియమాల కారణంగా, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాలు, ఊహాగానాలు మాత్రమే.
* ఫలితాలు ఎప్పుడు?
నోబెల్ శాంతి బహుమతి విజేతను అక్టోబర్ 10న ఓస్లోలో ప్రకటించనున్నారు. ట్రంప్‌కు అవార్డు వస్తే అది ఒక సంచలనమే అవుతుంది. అప్పుడు ఆయన నామినేషన్ గురించి ప్రపంచానికి తెలుస్తుంది. ట్రంప్‌కు అవార్డు రాకపోతే ఆయన నిజంగా ఈ ఏడాది రేసులో ఉన్నారో లేదో కూడా ఎవరూ నిర్ధారించలేరు.
రాజకీయాల్లో ఎప్పుడూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉండే ట్రంప్, ఈ బహుమతిని తన రాజకీయ ప్రతిష్టకు ఒక గుర్తుగా మలచుకోవాలని ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే నోబెల్ కమిటీ ప్రపంచంలోనే అత్యంత స్వతంత్ర సంస్థలలో ఒకటి, దానిని ఎవరూ ప్రభావితం చేయలేరు.
ట్రంప్‌కి నోబెల్ వస్తుందా? రాదా? అనే సస్పెన్స్‌కు తెరపడటానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఏదేమైనా ట్రంప్ పేరు ప్రస్తావనలో ఉన్నప్పుడు సంచలనం మాత్రం తప్పదు!