7 మిలియన్ల మంది రోడ్డెక్కారు.. అమెరికాలో అసలేంటి ‘నో కింగ్’ ఉద్యమం.. ఎలా మొదలైంది?

అమెరికా రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా భారీ ప్రజా నిరసనలు చోటుచేసుకున్నాయి.;

Update: 2025-10-19 06:08 GMT

అమెరికా రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా భారీ ప్రజా నిరసనలు చోటుచేసుకున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో పెరుగుతున్న నిరంకుశ ధోరణులు.. వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు వ్యతిరేకంగా “నో కింగ్స్ డే” పేరుతో అమెరికన్ పౌరులు దేశవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చారు.

సమాచారం ప్రకారం.. సుమారు 70 లక్షల మంది అమెరికన్లు దేశంలోని 2,700 ప్రాంతాల్లో ఒకేసారి నిరసనల్లో పాల్గొన్నారు. ఇది అమెరికా చరిత్రలో ఇప్పటివరకు జరిగిన అత్యంత పెద్ద ప్రజా నిరసనగా గుర్తింపు పొందింది. 2017లో జరిగిన ఉమెన్స్ మార్చ్ తర్వాత ఇంత పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం ఇదే మొదటిసారి.

* అసలేంటి 'నో కింగ్స్' ఉద్యమం? ఎలా మొదలైంది?

"నో కింగ్స్" ఉద్యమం అనేది అమెరికా వ్యవస్థాపక సూత్రాలలో ఒకటైన "రాజులు వద్దు" (No Kings) అనే భావన నుండి ఉద్భవించింది. అమెరికాను స్థాపించిన పౌరులు నిరంకుశత్వం, రాజుల పాలనను వ్యతిరేకించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, ఒక రాజులా లేదా నిరంకుశ పాలకుడిలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలకు వ్యతిరేకంగా ఈ నిరసనలు మొదలయ్యాయి. ట్రంప్ పరిపాలన ప్రజాస్వామ్య సంస్థలను, పౌర హక్కులను బలహీనపరుస్తోందని ఆందోళన చెందుతున్న ప్రగతిశీల సంస్థలు, పౌర హక్కుల సంఘాలు ఈ ఉద్యమాన్ని నిర్వహించాయి.

ఎలా మొదలైంది

ఈ నిరసనల సంకీర్ణానికి , ఇన్డివిజిబుల్ వంటి సంస్థలు ప్రధానంగా నాయకత్వం వహించాయి. ఇది ఒకేసారి జరిగిన ఉద్యమం కాదు. దీనికి ముందు కూడా జూన్‌లో ట్రంప్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన సైనిక పరేడ్‌కు వ్యతిరేకంగా భారీ ఎత్తున 'నో కింగ్స్' నిరసనలు జరిగాయి, ఆ రోజు కూడా మిలియన్ల మంది పాల్గొన్నారు. అప్పటి నుండి ఈ ఉద్యమం మరింత బలపడి, ఇప్పుడు చారిత్రక స్థాయికి చేరుకుంది.

ఈ ఉద్యమం వెనుక ఉన్న సందేశం చాలా స్పష్టం.. "అమెరికాకు రాజులు లేరు, రాజరికం వద్దు. అధికారం ప్రజల చేతుల్లోనే ఉండాలి."

* ప్రజాగళం: “నో కింగ్స్ ఇన్ అమెరికా”

వాషింగ్టన్ డీసీలో ట్రంప్ స్వగృహ సమీపంలోనే లక్షలాది మంది జనం గుమిగూడారు. నిరసనకారులు తమ నిరసనను శాంతియుతంగా తెలియజేశారు. వారి ప్రధాన నినాదాలు "నో కింగ్స్ ఇన్ అమెరికా’ "డెమొక్రసీ , నాట్ డిక్టేటర్ షిప్’’ "వి ద పీపుల్ సే నో’ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే ఆవేశం ప్రతి ఒక్కరి ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఈ నిరసనలు పూర్తిగా శాంతియుతంగా సాగడం విశేషం. ఎక్కడా పెద్ద ఎత్తున ఘర్షణలు జరగకపోవడం పట్ల పోలీసు శాఖలు కూడా ప్రజల క్రమశిక్షణ, సమన్వయాన్ని ప్రశంసించాయి.

ఒక నిరసనకారుడి మాటల్లో “ఇది పార్టీ రాజకీయాల గురించి కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని రక్షించే యుద్ధం. అమెరికా ఒక వ్యక్తి సొత్తు కాదు.” రోజు ముగిసే సరికి, దేశమంతా దీపాలతో, ఫోన్ లైట్లతో ప్రకాశించింది. సోషల్ మీడియాలో "America will not go quietly" అనే వాక్యం ట్రెండ్ అవుతూ, ప్రజాస్వామ్య జ్యోతి మళ్లీ వెలుగులోకి వచ్చిందని చాటింది.

రాజకీయ విశ్లేషకుల మాటల్లో, ఈ నిరసన అమెరికా చరిత్రలో ఒక మలుపుతిప్పే ఘట్టంగా నిలవనుంది. “ఇది ఆరంభం మాత్రమే,” అని ఒక నిరసనకారుడు ట్వీట్ చేశారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు అమెరికాను గమనిస్తోంది.. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే సంకల్పం ఎప్పటికీ మసకబారదని ఈ రోజు నిరూపించింది.

Tags:    

Similar News