కోహినూర్ వజ్రాన్ని భారత్ కు ఇచ్చేయమని చెబుతానన్న న్యూయార్క్ మేయర్
ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రం యజమానులం మనమేనన్న విషయం తెలిసిందే.;
ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రం యజమానులం మనమేనన్న విషయం తెలిసిందే. అయితే.. దాన్ని బ్రిటిష్ వారు కొల్లగొట్టటం.. ప్రస్తుతం బ్రిటన్ రాజవంశంలో ఉండటం తెలిసిందే. న్యాయమైన కోహినూర్ వజ్రాన్ని.. నెమలి సింహాసనాన్ని భారత్ కు తిరిగి ఇచ్చేయాలని కోరుతూ తరచూ ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు వ్యాఖ్యానిస్తుంటారు. కొంతకాలం ఈ అంశంపై చర్చ జరుగుతుంది. ఈ రెండింటిని భారత్ కు బ్రిటన్ తిరిగి ఇచ్చేస్తే బాగుంటుందన్న మాట భారతీయులందరి ఆశ. అయితే.. అదేమంత సులువైన విషయం కాదు. అయితే.. కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తిరిగి ఇచ్చేయాలన్న విషయాన్ని తనకు అవకాశం లభిస్తే బ్రిటన్ రాజు చార్లెస్ 3ను కోరతానని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
భారత్ కు చెందిన 108 క్యారెట్ల విలువైన కోహినూర్ వజ్రాన్ని 1849లో మహారాజ్ దులీప్ సింగ.. విక్టోరియా మహారాణికి ఇచ్చేయటం తెలిసిందే. అప్పటి నుంచి ఆ వజ్రం వారి అధీనంలోనే ఉంది. రాణి తాను ధరించే కిరీటంలో అమర్చుకొని ధరిస్తారు. దానిని తిరిగి తీసుకోవాలని భారత ప్రభుత్వం దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు జరిగాయి. అప్పటివరకు అవేమీ ముందుకు వెళ్లలేదు.
బ్రిటన్ రాజు చార్లెస్ 3, రాణి కెమిల్లాలు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం వారు న్యూయార్క్ లోని 9/11 స్మారక చిహ్నాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముందు న్యూయార్క్ మేయర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కోహినూర్ వజ్రం గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా చెప్పాల్సిన అంశం ఏమంటే.. న్యూయార్క్ మేయర్ భారత మూలాలున్న వ్యక్తి అన్న సంగతి తెలిసిందే.
కోహినూర్ వజ్రం గురించి మాట్లాడుతూ.. ‘‘ఒక ప్రోగ్రాంలో కాకుండా.. రాజు చార్లెస్ 3తో విడిగా మాట్లాడే అవకాశం వస్తే.. కోహినూర్ ను భారత్ కు తిరిగి ఇచ్చేయాలని కోరతాను’’ అని పేర్కొన్నారు. అయితే.. వీరి మధ్య జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగిందా? లేదా? అన్నది మాత్రం బయటకు రాలేదు. ఇదిలా ఉండగా న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యలపై స్పందించేందుకు బకింగ్ హామ్ ప్యాలెస్ నిరాకరించింది. ఏమైనా న్యూయార్క్ మేయర్ పుణ్యమా అని మరోసారి కోహినూర్ వజ్రం వ్యవహారం తెర మీదకు వచ్చింది. మరి.. దీనిపై భారత ప్రభుత్వం ఏ విధంగా రియాక్టు అవుతుందో చూడాలి.