నెతన్యాహుకు షాకిచ్చిన ఇద్దరు మిత్రులు... వాట్ నెక్స్ట్?

హమాస్, హెజ్ బొల్లా, ఇరాన్, సిరియా... ఇలా వరుస యుద్ధాలతో బిజీగా ఉన్న ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు తాజాగా సొంత వారితోనే షాక్ తగిలింది.;

Update: 2025-07-17 20:30 GMT

హమాస్, హెజ్ బొల్లా, ఇరాన్, సిరియా... ఇలా వరుస యుద్ధాలతో బిజీగా ఉన్న ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు తాజాగా సొంత వారితోనే షాక్ తగిలింది. ఇందులో భాగంగా.. సైనిక సేవ నుండి దశాబ్దాలుగా ఉన్న మతపరమైన మినహాయింపును నీరుగార్చే బిల్లుపై రెండవ అల్ట్రా ఆర్థడాక్స్ పార్టీ "షాస్" వైదొలిగింది. దీంతో నెతన్యాహు కు బిగ్ షాక్ తగిలినట్లయ్యింది.

అవును... కొత్త సైనిక నిర్బంధ బిల్లుపై చాలా కాలంగా కొనసాగుతున్న వివాదంలో ఇజ్రాయెల్‌ లోని అల్ట్రా ఆర్థడాక్స్ యూదు పార్టీలలో ఒకటైన షాస్ తన 11 మంది సభ్యులు ప్రభుత్వం నుంచి వైదొలుగుతారని ప్రకటించింది. దీనితో నెతన్యాహు పార్లమెంటులో కేవలం 50 సీట్లు మాత్రమే పరిమితమయ్యారు. ఇది కనీస మెజారిటీ (మ్యాజిక్ ఫిగర్) 61 సీట్ల కంటే తక్కువ కావడం గమనార్హం.

బెంజమెన్ కి అత్యంత సన్నిహిత రాజకీయ మిత్రులుగా భావిస్తున్న రెండు యూదు సనాతన పార్టీలు వారం గ్యాప్ లో వరుసగా షాక్ లు ఇచ్చినట్లయ్యింది. ఇందులో భాగంగా.. ఈ వారం ప్రారంభంలో యూదు పురుషులకు సైనిక సేవ నుండి పూర్తిగా మినహాయింపును తగ్గించడాన్ని నిరసిస్తూ యునైటెడ్ టోరా జుడాయిజం (యూటీజే) పార్టీ కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది.

అయితే.. ఈ మిత్రపార్టీల తాజా నిర్ణయాలు ప్రభుత్వ తక్షణ పతనానికి లేదా ముందస్తు ఎన్నికలకు దారితీయదని తెలుస్తోంది. ఎందుకంటే... తాము ఈ బిల్లు విషయంలో ప్రభుత్వ విధానానికి వ్యతిరేకమే తప్ప... సంకీర్ణంలో తమ భాగస్వామ్యాన్ని పూర్తిగా విరమించుకోవడం లేదని అటు షాస్, ఇటు యూటీజే చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా షాస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా.. సంకీర్ణం నుంచి బయటకు వచ్చినప్పటికీ, ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నం ఇంకా చేయడం లేదని.. సంకీర్ణాన్ని అస్థిరపరచడం తమ లక్ష్యం కాదని పార్టీ ప్రకటన పేర్కొంది. కీలకమైన విషయాలపై తాము ఇప్పటికీ ప్రభుత్వంతో కలిసి ఓటు వేయవచ్చని తెలిపింది.

ఇలా షాస్, యుటీజె మద్దతు కోల్పోవడం వల్ల నెతన్యాహు.. గాజా కాల్పుల విరమణను తిరస్కరించిన సంకీర్ణంలోని తీవ్రవాద జాతీయవాదులపై ఎక్కువగా ఆధారపడవలసి వస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News