నేతాజీ మిస్సింగ్ ఎపిసోడ్ ఇప్పుడెందుకు వచ్చింది!

ఆయన మిస్సింగ్ మీదా.. దశాబ్దాలుగా భారత ప్రభుత్వం ఆయన ఉదంతంలో వ్యవహరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పు పడుతూ ఘాటు విమర్శలు చేశారు

Update: 2024-01-24 06:00 GMT

సుదీర్ఘకాలం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ.. సుదీర్ఘకాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న మమతా బెనర్జీ అలియాస్ దీదీకి హటాత్తుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గుర్తుకు వచ్చారు. ఆయన మిస్సింగ్ మీదా.. దశాబ్దాలుగా భారత ప్రభుత్వం ఆయన ఉదంతంలో వ్యవహరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పు పడుతూ ఘాటు విమర్శలు చేశారు. యావత్ దేశం రామజన్మభూమిలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిపిన ఎపిసోడ్ లో తీవ్రమైన భావోద్వేగంతో ఉండిపోయిన వేళ.. మమతా బెనర్జీ నోట మాత్రం సుభాష్ చంద్రబోస్ వ్యవహారాన్ని ప్రస్తావించటం గమనార్హం.

సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ కావటం కానీ.. ఆయన మరణించిన తేదీకి సంబంధించిన మిస్టరీ దశాబ్దాల తరబడి తేలకపోవటాన్ని ఆమె తాజాగా ప్రశ్నించారు. ఆయన మరణించిన తేదీ ఇప్పటికీ తెలియకపోవటం అవమానకరమన్న ఆమె.. నేతాజీ మిస్సింగ్ పై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం.. ఇప్పటివరకు ఆ హామీని నిలబెట్టుకోకపోవటాన్ని ప్రస్తావించారు.

ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. నేతాజీ మిస్సింగ్ పైనా వివరాలు తెలీకపోవటం దురద్రష్టకరం. ఆయనకు ఏమైందో మనకు తెలీదన్న ఆమె.. ''ఇది నిజంగా దేశానికి సిగ్గుచేటు'' అని ఘాటుగా వ్యాఖ్యానించారు. నేతాజీ 127వ జయంతి సందర్భంగా కోల్ కతాలోని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించిన ఆమె.. బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇరవై ఏళ్లుగా నేతాజీ జన్మదినోత్సవాన్ని జాతీయ సెలవుగా ప్రకటించాలని ప్రయత్నాలు చేస్తున్నా.. తాము ఫెయిల్ అయ్యామన్న ఆమె.. తనను క్షమించాలన్నారు.

Read more!

అయోధ్యలోని రామమందిరంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్రం ప్రభుత్వ కార్యాలయాలకు ఒకపూట సెలవు ప్రకటించిన వైనాన్ని ప్రస్తావించిన దీదీ.. ఈ రోజుల్లో రాజకీయ ప్రచారానికీ సెలవులు ఇస్తున్నారన్నారు. అదే సమయంలో దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాల్ని త్యాగం చేసిన వారిని మాత్రం ఏమీ చేయటం లేదంటూ తప్పు పట్టారు. నేతాజా మిస్సింగ్ జరిగి ఏడు దశాబ్దాలైందని.. నేటికీ అది మిస్టరీగానే మిగిలిపోయిందన్నారు. 1945 ఆగస్టు 18న తైపిలోని విమాన ప్రమాదంలో బోస్ మరణించారన్న వాదన తెలిసిందే.

ఆయనదిగా చెప్పే చితాభస్మం టోక్యోలని రెంకోజి ఆలయంలో భద్రపర్చారు. నేతాజీ మరణంపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు మూడు కమిటీలు వేయగా.. అందులో రెండు కాంగ్రెస్ ప్రభుత్వంలోనివి కాగా.. ఒకటి బీజేపీ హయాంలో వేసినవి. అయితే.. ఈ మూడు కమిటీ నివేదికలు భిన్నంగా ఉండటం తెలిసిందే. ఇలాంటివేళ.. ఆయన ఆస్తికల్ని దేశానికి తీసుకొచ్చి.. బోస్ కుటుంబ సభ్యులతో డీఎన్ఏ పరీక్షలు జరపాలని డిమాండ్ చేస్తున్నా.. ఇప్పటివరకు అవేమీ కార్యరూపం దాల్చలేదు. అందరి మాదిరే బోస్ ను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే నేతల్లో భాగంగా బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ కూడా ఒకరన్న విమర్శ వినిపిస్తోంది.

Tags:    

Similar News