నెల్లూరులో మరో కీలక నేత ఔట్.. ఉచ్చుబిగిస్తున్న ప్రభుత్వం
విచారణలో ఆయన ఇచ్చిన సమాచారంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అక్రమ వసూళ్లు వెలుగుచూశాయని ప్రచారం జరుగుతోంది.;
గత ప్రభుత్వంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని, అందుకు బాధ్యులుగా గుర్తిస్తూ పలువురు వైసీపీ నేతలను అరెస్టు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో ముఖ్య నేతకు ఉచ్చు బిగిస్తోందని ప్రచారం జరుగుతోంది. క్వార్జ్ట్ అక్రమ తవ్వకాలతో వందల కోట్లు పోగేశారని ఆరోపిస్తూ నెల్లూరుకు చెందిన వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజాగా రుస్తుం మైన్స్ తవ్వకాల్లో ఆ జిల్లాకు చెందిన వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఉచ్చు బిగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈకేసులో నెల్లూరు వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా అనిల్ కుమార్ యాదవ్ పైనా చర్యలు తీసుకుంటే నెల్లూరులోని ముఖ్యమైన ఇద్దరు నేతలు ఇరుక్కున్నట్లేనని అంటున్నారు.
సోమవారం హైదరాబాద్ లో వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత నెల్లూరు తరలించారు. విచారణలో ఆయన ఇచ్చిన సమాచారంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అక్రమ వసూళ్లు వెలుగుచూశాయని ప్రచారం జరుగుతోంది. అక్రమ క్వార్ట్జ్ తవ్వకాల్లో సంపాదించిన సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు శ్రీకాంత్ రెడ్డి వెల్లడించినట్లు సమాచారం. మాజీ మంత్రి కాకాణి, అనిల్ కుమార్ యాదవ్ ప్రోద్బలంతో గూడూరు, సైదాపురం, చిల్లకూరు, వెంకటగిరి ప్రాంతాల్లో అనిల్ కుమార్ బ్యాచ్ వేల కోట్ల రూపాయల్లో మామూళ్లు వసూలు చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
టన్ను క్వార్ట్జ్ కి రూ.7 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలిందని చెబుతున్నారు. మైనింగు ద్వారా వసూలు చేసిన డబ్బుతో భారీగా భూములు కొనుగోలు చేశారని, గూడూరు, చెన్నూరు రోడ్డులో వందల ఎకరాల భూమిలో రియల్ వెంచర్ వేశారని పోలీసుల విచారణలో బయటపడిందని అంటున్నారు. అదేవిధంగా నాయుడుపేట హైవే వెంట 50 ఎకరాల్లో మరో వెంచర్ వేశారని, హైదరాబాద్ మణికొండ అల్కాపురి టౌన్ షిప్పులోనూ కొన్ని నిర్మాణాలు చేపట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.