ఎన్డీఏ సర్కారులో ఏపీకి మరీ ఇంత అన్యాయమా?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తుందా? అంటే ఓ విషయంలో తీరని అన్యాయమే జరుగుతుందని నవ్యాంధ్ర వాసులు వాపోతున్నారు.;
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తుందా? అంటే ఓ విషయంలో తీరని అన్యాయమే జరుగుతుందని నవ్యాంధ్ర వాసులు వాపోతున్నారు. 2014 నుంచి దేశాన్ని పాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ మెట్రో రైలు ప్రాజెక్టుకు నిధుల విడుదల చేయడంలో జాప్యం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం మనగడకు ప్రధాన స్తంభంలా నిలిచిన ఏపీకి ఇప్పటికైనా న్యాయం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. కాగితాలకే పరిమితమైన విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు మోక్షం కల్పించాలని కోరుతున్నారు.
దేశంలో 2014 తర్వాత మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో వేగం పెరిగింది. గతంలో కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన మెట్రో రైలు మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించింది. పట్నా, కొచ్చి, భువనేశ్వర్ వంటి నగరాలకు మెట్రో రావడం దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీలోని విజయవాడ, విశాఖలకు మెట్రో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అయితే పదకొండేళ్లుగా ఈ ప్రాజెక్టులు ప్రతిపాదన దశల్లోనే ఉండిపోవడంపై విచారణ వ్యక్తమవుతోంది. ఈ రెండు నగరాలతోపాటుగా ప్రతిపాదన చేసిన ఇతర నగరాల ప్రాజెక్టులు నిర్మాణాలు పూర్తయ్యే దశకు చేరుకోవడం ఏపీ వాసులను ఆవేదనకు గురిచేస్తోందని చెబుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ నిర్లక్ష్యంతో దక్షిణ భారతదేశంలో మెట్రో రైలు లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచిపోయిందని ఆవేదన చెందుతున్నారు.
దక్షిణ భారత్ లో ఐదు ప్రధాన రాష్ట్రాలు ఉండగా, తెలంగాణకు హైదరాబాద్ మెట్రో, తమిళనాడుకు చెన్నై మెట్రో, కేరళకు కొచ్చి మెట్రో, కర్ణాటకకు బెంగళూరు మెట్రో ఉన్నాయి. కానీ, ఏపీకి ఇంతవరకు మెట్రో లేదు. గత పదేళ్లుగా వెనకబడిన మెట్రో ప్రాజెక్టును ఇప్పటికైనా పట్టాలెక్కించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఏపీలోని వైజాగ్, విజయవాడ కన్నా చిన్న నగరాలైన బిహార్ రాజధాని పట్నా, ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు మెట్రో ఉందని, కానీ, ఏపీలో వయబులిటీ ఉన్న విశాఖ, విజయవాడకు మెట్రో సౌకర్యం లేకపోవడం లోటుగా అభివర్ణిస్తున్నారు. అదేవిధంగా కేరళకు రాజధాని కూడా కాని కొచ్చిలో మెట్రో ఉండటం, ఆ నగరం జనాభా విశాఖ, విజయవాడ కన్నా తక్కువగా ఉండటాన్ని గుర్తు చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ కీలక భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి విజయవాడ, విశాఖ మెట్రోకు నిధులు సాధించేలా అడుగులు వేయాలంటున్నారు. పదేళ్లుగా ఊరిస్తున్న విశాఖ, విజయవాడ మెట్రోపై చంద్రబాబుకు ఆసక్తి ఉన్నా, ప్రాజెక్టుకు కనీసం భూ సేకరణ కూడా చేపట్టకపోవడం నిరాశకు గురిచేస్తోందని అంటున్నారు. కాగితాలపై తప్ప మరెక్కడా కనిపించని మెట్రోకు సీఎం చంద్రబాబే దారులు వేయాలనే డిమాండు వినిపిస్తోంది. ప్రస్తుతం విజయవాడ, విశాఖ నగరాల్లో నగర ప్రయాణం నరకంగా మారుతోంది. గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ లతో ప్రజలు విసిగిపోతున్నారు. రాజధాని అమరావతికి పక్కనే ఉన్న విజయవాడలో రద్దీ రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. దీని నివారణకు మెట్రోయే మార్గమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
2014లోనే ప్రతిపాదించిన మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేసింది. విజయవాడ మెట్రోకు 8 అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపాయి. జర్మనీకి చెందిన బ్యాంకు రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఇక విశాఖ మెట్రో కోసం కొరియన్ బ్యాంకు రుణమిస్తామని చెప్పింది. 2017లో బిడ్డింగ్ దశకు చేరుకున్న విశాఖ మెట్రో ఆ తర్వాత ఒక్క అడుగు ముందుకు పడలేదని అంటున్నారు. గత ప్రభుత్వం వీటిపై ఆసక్తి చూపకపోవడంతో ఎటువంటి కదలికకు నోచుకోలేకపోయింది. ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టుల వేగం పెంచాలని డిమాండ్ వినిపిస్తోంది.