గవర్నర్ గా యనమల లేదా వర్ల ?
ఈ మేరకు ఎన్డీయే వర్గాలు కూడా సుముఖంగా ఉన్నాయని అంటున్నారు. దాంతో ఏపీ నుంచి టీడీపీ తరఫున మరో సీనియర్ కి రాజ్ భవన్ కి వెళ్ళే చాన్సెస్ అధికం అయ్యాయని అంటున్నారు.
ఎన్డీయే పన్నెండేళ్ళ పాలన పూర్తి చేసుకుంది. అందులో నరేంద్ర మోడీ ఈ దేశానికే అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో మిత్రులు అంతా ప్రధాని నరేంద్ర మోడీని కొనియాడారు. ఇక ఎన్ డీయే సమావేశంలో టీడీపీకి ఎంతో ప్రాముఖ్యత లభించింది. చంద్రబాబు అయితే నరేంద్ర మోడీని అభినందించే తీర్మానాన్ని ప్రవేశపెట్టే గౌరవాన్ని అందుకున్నారు. ఎన్డీయేలో సీనియర్ భాగస్వామిగా బీజేపీ తరువాత రెండవ అతి పెద్ద పార్టీగా ఉన్న టీడీపీకి నాయకత్వం వహిస్తున్న బాబుకు బీజేపీ కూడా అదే స్థాయిలో మర్యాద మన్నన అందిస్తోంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెబుతున్నారు.
కేంద్ర మంత్రి వర్గంపైన :
ఇక మరో మూడేళ్ళలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి నుండే తగిన వ్యూహాలను రూపొందించుకోవాలని ఈ సమావేశంలో ఎన్డీయే మిత్రులు అంతా నిర్ణయించారు. అంతే కాదు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ లేదా పునర్ వ్యవస్థీకరణ నేపధ్యంలో ఎన్నికల కేబినెట్ నే ఏర్పాటు చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. ఇక మిత్రుల ఆశలు ఆకాక్షలు అన్నీ కూడా ఎన్డీయే పెద్దలు తెలుకుని అందుకు అనుగుణంగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు రూపకల్పన చేస్తున్నారు అని అంటున్నారు.
టీడీపీకి మరింతగా :
ఇక కష్ట కాలంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి బాసటగా టీడీపీ నిలిచింది. ఏపీ నుంచి 16 మంది ఎంపీలు టీడీపీకి ఉన్నారు వారంతా ఎన్డీయేకు మద్దతు ఇవ్వడం వల్లనే ఈ రోజున మోడీ మూడోసారి ప్రధాని అయ్యారు. అంతే కాదు సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా ఉన్న రికార్డుని సొంతం చేసుకున్నారు. దాంతో ఆ కృతజ్ఞత అయితే టీడీపీ మీద ఎన్డీయే పెద్దలకు ఉందని అంటున్నారు. దాంతో కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో మరో బెర్త్ టీడీపీకి అదనంగా ఇస్తారని ప్రచారం అయితే హస్తిన రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. మరో వైపు చూస్తే కనుక గవర్నర్ వంటి పదవులలో కూడా టీడీపీకి ప్రయారిటీ ఇస్తారని అంటున్నారు.
ఎవరికి గవర్నర్ గిరీ :
ఈ మేరకు ఎన్డీయే వర్గాలు కూడా సుముఖంగా ఉన్నాయని అంటున్నారు. దాంతో ఏపీ నుంచి టీడీపీ తరఫున మరో సీనియర్ కి రాజ్ భవన్ కి వెళ్ళే చాన్సెస్ అధికం అయ్యాయని అంటున్నారు. ఇప్పటికే సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా నియమితులు అయ్యారు. దాంతో మరో సీనియర్ ని కూడా ఈసారి గవర్నర్ గా పంపించాలని టీడీపీ చూస్తోంది. ఆ చాన్స్ ఎవరికి దక్కనుంది అంటే ఏపీ నుంచి ఇద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరూ మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు. అలాగే పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి సేవలు అందిస్తూ ఎటువంటి అధికార పదవినీ పొందని నేతగా ఉన్న వర్ల రామయ్య.
రాజ్యసభ సీటు ఆశించి :
ఇక ఈ ఇద్దరు నేతలూ రాజ్యసభ సీటుని ఆశించి భంగపడ్డారు. దాంతో వారిలో ఒకరికి గవర్నర్ పదవిని ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం చూస్తోంది అని అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువగా అవకాశం అని చూస్తే కనుక వర్ల రామయ్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. దాంతో ఆయనకు చాన్స్ ఇస్తారని అంటున్నారు. రాజ్యసభ సీట్లలో బీసీలకు న్యాయం చేసినందువల్ల ఎస్సీ వర్గానికి సముచితమైన గౌరవం దక్కాలీ అంటే వర్ల రామయ్యకు గవర్నర్ పదవి ఇవ్వాల్సిందే అని అంటున్నారు. టీడీపీ ఆ విధంగా సామాజిక సమతూకం పాటించినట్లు అవుతుందని అంటున్నారు. మరో వైపు రాజ్యాంగ నిపుణుడు సీనియర్ మోస్ట్ లీడర్ అయిన యనమలకు కూడా గవర్నర్ పోస్టు అవకాశం దక్కుతుందని వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు మరో టెర్మ్ లో సర్దుబాటు చేస్తారు అని వినవస్తోంది. ఏది ఏమైనా ఏపీకి మరో గవర్నర్ పదవి ఖాయమైంది. అది ఈ ఇద్దరిలో ఒకరికి దక్కడం మాత్రం తధ్యమని అంటున్నారు. చూడాలి మరి ఎవరు రాజ్ భవన్ లోకి ప్రవేశిస్తారో.