పేదరికమే అతిపెద్ద శత్రువా..? ఎన్‌సీఆర్‌బీ నివేదిక ఏం చెప్తోంది..?
భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో నెం.1 స్థానంలో ఉంది.;
భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో నెం.1 స్థానంలో ఉంది. చైనాను ఏనాడో దాటేసింది. ఇంత జనాభా ఉన్న దేశంలో పేదరికం ఉండడం సాధారణమే. అయితే 2023కు సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) ఒక నివేదిక రూపొందించింది. ఆ సంవత్సరంలో 1,71,418 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో 66.2 శాతం (1,13,416) అల్పాదాయ వర్గాల వారు. ఇందులో 28.3 శాతం (48,432) మంది ఏడాదికి లక్ష నుంచి రూ. 5 లక్షల్లోపు ఆదాయం ఉన్నవారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, నిరుద్యోగం వంటి అంశాలు ప్రధాన కారణంగా నిలిచాయి. 10,786 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధిక ఘటనలు నమోదయ్యాయని నివేదిక సూచిస్తుంది.
ఆందోళన కలిగిస్తున్న వివరాలు..
రోడ్డు ప్రమాదాల విషయంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 2023లో 4,64,029 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇందులో 1,73,826 మంది మరణించారు. అత్యధిక మరణాలు ద్విచక్ర వాహనాల్లో, ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య చోటు చేసుకున్నాయి. పాదచారులు, సవారీదారులు అత్యధిక ప్రమాదాలకు గురవుతున్నారు.
చిన్నారులపై నేరాలు 2023లో 9.2 శాతం పెరిగి, 1,77,335 కేసులు నమోదు అయ్యాయి. కిడ్నాప్‌లు, లైంగిక దాడులు, అపహరణలు సాధారణమయ్యాయి. 1,16,000 కిడ్నాపింగ్ కేసుల్లో 18,000 మంది ఇష్టంగా వెళ్లిపోయినవి. ఇక మహిళలపై దాడులు 4,48,211 నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధికంగా చోటు చేసుకున్నాయి.
సీనియర్ సిటిజన్లు, జువైనల్స్‌పై నేరాలు, రైలు ప్రమాదాలు వంటి ఇతర ఘటనలు కూడా పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. 2023లో రైలు ప్రమాదాల్లో 21,803 మంది మరణించారు. ప్రమాదాల కారణంగా 56 శాతం డ్రైవర్ల తప్పిదాలు, 43 శాతం యాంత్రిక లోపాలు గుర్తించబడ్డాయి.
పేద దేశాలకు హెచ్చిరిక..
ఈ నివేదిక ఒక స్పష్టమైన హెచ్చరిక. పేదరికం కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు.. అది మన సమాజంలో మానసిక ఒత్తిడి, హింస, రోడ్డు ప్రమాదాలు, నేరాలకు కారణంగా నిలుస్తుంది. పేదరిక నిర్మూలన, ఆర్థిక సహాయం, యువతకు ఉద్యోగావకాశాలు, చిన్నారుల రక్షణ లాంటివి ప్రభుత్వాల ముందున్న ప్రధాన కార్యాచరణ.
స్పష్టమైన సందేశం
2023 నంబర్లలోని భయంకర నిజాలు మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి.. పేదరికాన్ని శత్రువుగా మాత్రమే కాకుండా, సమగ్ర సమస్యగా పరిష్కరించకపోతే, జీవితం నరకంగా మారుతుంది. సమాజం, ప్రభుత్వాలు, నేర నివారణ సంస్థలు కలిసి చర్యలు తీసుకోవాలి.