కొండా సురేఖకు బిగ్ షాక్.. అరెస్టు వారెంట్ జారీ? ఇప్పుడెలా?

ఫోన్ ట్యాపింగ్ తోపాటు సున్నితమైన అంశాల్లో కేటీఆర్ లక్ష్యంగా మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారం రేపాయి.;

Update: 2025-12-11 13:50 GMT

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ అయింది. కొండా సురేఖపై కేటీఆర్ పెట్టిన కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విచారిస్తోంది. విచారణకు సురేఖ గైర్హాజరుపై కోర్టుకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్బీడబ్ల్యూ జారీ చేశారు. అనంతరం తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేశారు.

మంత్రి సురేఖకు ఎన్బీడబ్ల్యూ జారీ చేయడం సంచలనంగా మారింది. రాష్ట్రంలో రాజకీయ వర్గాలలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా సురేఖ తీరు వివాదాలకు తావిస్తోంది. ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ ఆమె పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ప్రతిపక్షం కూడా మంత్రి సురేఖను టార్గెట్ చేస్తోంది. గతంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై మంత్రి సురేఖ సంచలన ఆరోపణలు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ తోపాటు సున్నితమైన అంశాల్లో కేటీఆర్ లక్ష్యంగా మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారం రేపాయి. ఒకవైపు సినీ నటుడు నాగార్జున, మరోవైపు కేటీఆర్ సురేఖ ఆరోపణలపై పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఇటీవల నాగార్జునకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పడంతో ఆయన కేసు ఉపసంహరించుకున్నారు. అయితే కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను మాత్రం మంత్రి సురేఖ వెనక్కి తీసుకునేది లేదని గతంలోనే ప్రకటించారు. కేటీఆర్ తో న్యాయపోరాటం చేస్తానని అప్పట్లోనే స్పష్టం చేశారు.

ఇక కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా ఆగస్టులోనే నాంపల్లి కోర్టు పోలీసులను సూచించింది. సురేఖకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. మంత్రి సురేఖ తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తన పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని కేటీఆర్ వాదిస్తున్నారు. తాజాగా ఈ కేసులోనే మంత్రిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడు మంత్రి సురేఖ ఏం చేయనున్నారు? ఆమె తరఫు న్యాయవాదులు పరిస్థితిని ఇంతవరకు ఎందుకు రానిచ్చారు? అన్న అంశాలపై విస్తృత చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News