జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ రిగ్గింగ్ చేసిందా..?

అవును.. జూబ్లీహిల్స్ లో జరిగిన ఉప ఎన్నికలో ఓటమి పాలైన బీఆరెస్స్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-11-14 10:35 GMT

జూబ్లీహిల్స్ లో జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు ఈ రోజు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మొదటి రౌండ్ నుంచీ ఆధిక్యం ప్రదర్శిస్తూ ఘన విజయం సాధించారు. ఇందులో భాగంగా... 25వేలకు పైగా మెజార్టీ సాధించారు! ఈ సందర్భంగా... విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆరెస్స్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన ఆరోపణలు చేశారు.

అవును.. జూబ్లీహిల్స్ లో జరిగిన ఉప ఎన్నికలో ఓటమి పాలైన బీఆరెస్స్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ కి పాల్పడిందని అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె... గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఉప ఎన్నిక జరిగిందని.. నాలుగు నెలలుగా జూబ్లీహిల్స్ లో రౌడీయిజాన్ని అంతా చూశారని అన్నారు. ఒక మహిళ పట్ల ఇలా వ్యవహరించడం ఫస్ట్ టైం అని అన్నారు.

నాలుగైదు పార్టీలు నిలబడితేనే తన భర్తకు 16వేలకు పైగా మెజారిటీ వచ్చిందని.. ఈసారి ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ కి వచ్చిన మెజారిటీ రౌడీయిజంతో వచ్చిందని.. స్వతహాగా తెచ్చుకున్నది కాదని సునీత ఆరోపించారు. ఈ ఎన్నికల్లో రౌడీయిజం గెలిచిందనేదానికి తనకు సంబంధం లేదని.. అది గెలుపే కాదని.. కానీ, నైతికంగా మాత్రం తానే గెలిచానని ఆమె అన్నారు.

అధికారంలో ఉన్న పార్టీ బయట రిగ్గింగ్ చేసిందని, లోపల ర్యాగింగ్ చేసిందని సునీత ఆరోపించారు. ఇది గొప్ప గెలుపు కాదని.. రౌడీయిజంతో వచ్చిన గెలుపని సునీత ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎంతో అప్రజాస్వామికంగా ఈ ఎన్నిక జరిగిందని చెప్పుకొచ్చారు.

మరోవైపు... ప్రతి సర్వే బీఆరెస్స్ గెలుస్తుంది అని చెప్పిందని.. కానీ చివరి మూడు రోజులు ఏమి జరిగిందో అందరికీ తెలుసని.. కాంగ్రెస్‌ కు ప్రత్యామ్నాయం బీఆరెస్స్ మాత్రమే అని అర్థం అయిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 7 ఉప ఎన్నికలు జరిగితే మేము ఐదు చోట్ల గెలిచామని.. కాంగ్రెస్ ఒకటి కూడా గెలవలేదని.. జీ.హెచ్‌.ఎం.సీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు సీట్లు మాత్రమే గెలిచిందని.. అయినా 2023లో అధికారం లోకి వచ్చింది.. ఇది కామన్ అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News