మోడీ అర్జునుడు...గురువులకు గౌరవం ఇస్తూనే !

ఉమ్మడి బొంబై రాష్ట్రంలో ఒక సామాన్య కుటుంబంలో ఐదుగురు తోబుట్టువుల మధ్య మూడవ వారిగా జన్మించిన మోడీ ఈ రోజున ప్రపంచ దిగ్గజ నేత అయ్యారు.;

Update: 2025-09-17 08:30 GMT

దేశంలో ఎవరికీ లేని రికార్డుని ప్రధాని నరేంద్ర మోడీ సొంతం చేసుకున్నారు. ఉమ్మడి బొంబై రాష్ట్రంలో ఒక సామాన్య కుటుంబంలో ఐదుగురు తోబుట్టువుల మధ్య మూడవ వారిగా జన్మించిన మోడీ ఈ రోజున ప్రపంచ దిగ్గజ నేత అయ్యారు. ఆయన రాజకీయ జీవితం చూస్తే ముందే అంతా అనుకుని చేసినట్లుగా ఉండదు. కానీ ఎపుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఆయన లక్ష్యాలు మాత్రం కచ్చితంగానే పెట్టుకుంటూ ముందుకు సాగారు. అదే సమయంలో ఆయన తన దారిని రహదారిగా మార్చుకునే ప్రయత్నంలో చాలా కచ్చితంగానే వ్యవహరించారు అని చెబుతారు

ముఖ్యమంత్రి నుంచి ప్రధానిగా :

ఈ దేశంలో ముఖ్యమంత్రులు గా ఉంటూ ప్రధానులు అయిన వారు కొందరు ఉన్నారు. వారు చూస్తే కనుక మొరార్జీ దేశాయ్, వీపీ సింగ్, చరణ్ సింగ్, దేవేగౌడ, పీవీ నరసింహారావు కనిపిస్తారు. అదే వరుసలో నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. అయితే పైన చెప్పిన వారు అంతా స్వల్ప కాలం మాత్రమే ముఖ్యమంత్రులుగా చేశారు. వీరిలో దేవేగౌడ తప్ప మిగిలిన వారు ఎంపీలుగా కేంద్ర మంత్రులుగా జాతీయ రాజకీయాల్లో ఉంటూ ప్రధాని పీఠానికి చేరువ అయ్యారు. కానీ ఏకంగా 13 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా చేస్తూ జాతీయ రాజకీయాలతో ఏ మాత్రం దృష్టి పెట్టకుండా ఒకేసారి వచ్చి నేరుగా ప్రధాని అయిపోవడం మోడీకే చెల్లింది. అలా ఆయనది ఒక పెద్ద రికార్డు. అంతే కాదు ప్రధానిగా ఏకంగా 11 ఏళ్ళ పాటు దేశానికి నిరంతరాయంగా మూడు దఫాలుగా చేస్తూ మరింత కాలం తానే ప్రధాని అని చాటి చెప్పే సత్తా మాత్రం ఒక మోడీకే అని చెప్పాలి.

గురువులకు నమస్కార బాణం :

మోడీ చూపు నిశితంగా ఉంటుంది అందులోనే ఆయన లక్ష్యం కనిపిస్తుంది ఆయన సంకల్పం బహు గట్టిది. దానిని సాధించే క్రమంలో ఆయన మరే వాటిని పట్టించుకోరు అని అంటారు. ఇక గుజరాత్ లో చూస్తే సీనియర్ నేత దిగ్గజ ముఖ్యమంత్రి చిమన్ భాయ్ పటేల్ ని దించి మోడీకి చాన్స్ ఇచ్చినపుడు బీజేపీ పెద్దలు వాజ్ పేయ్ అద్వానీ కొంత ఆలోచించారని అప్పట్లో ప్రచారం సాగింది. చట్ట సభలకు అంతకు ముందు ఎన్నడూ నెగ్గని మంత్రిగా కూడా చేయని మోడీకి ఇంతటి బాధ్యతలు అప్పగిస్తే చేయగలరా అని వారు అనుమానం కొంత వ్యక్తం చేశారని అంటారు. దాంతో చిమన్ భాయ్ పటేల్ ని ఉప ముఖ్యమంత్రిగా చేసి మోడీని సహయంగా ఉంచాలని ఒక ప్రతిపాదన వచ్చిందని చెబుతారు. అయితే మోడీ దానిని తిరస్కరించి తానేంటో నిరూపించుంటాను అని చెప్పి మరీ తన సత్తా చాటారు అన్నది కూడా చెబుతారు. అంతే కాదు తాను ఇంతటి వారు కావడానికి కారణం అయిన ఎల్కే అద్వానీ మోడీకి అన్ని విధాలుగా గురువు. అయితే మోడీకి ఆ గురుభావం ఎపుడూ ఉంది. కానీ అదే సమయంలో అద్వానీ విషయంలో గురు నమస్కారం మాత్రమే చేసి ఊరుకున్నారు. అద్వానీని రాష్ట్రపతిగా చేసి ఉండాల్సిని అని బీజేపీలోనూ బయట అనేక మంది అనుకున్నా మోడీ మాత్రం అలా చేయలేదు అని అంటారు.

ఆమె చెప్పింది నిజమేనా :

మోడీకి ఎవరూ సన్నిహితులు లేరు, ఆయన ఎవరితోనూ క్లోజ్ గా ఉండరని ఆయన మంత్రివర్గంలో పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది నిజమేనా అంటే మోడీ మొత్తం జీవితం చూస్తే అర్ధం అవుతుంది అని అంటారు. ఆయన కర్తవ్యం వైపే చూస్తారు. తాను అనుకున్నది సాధించేందుకే శ్రమ పడతారు. ఈ క్రమంలో ఆయన రాగద్వేషాలను జయించి ముందుకు సాగుతారు అని అంటారు.

అర్జునుడు మాదిరిగా :

భారతంలో అర్జునుడు ఈ సందర్భంగా గుర్తుకు వస్తారు. తనకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను కానీ తన తాత తండ్రులను కానీ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు లెక్క చేయలేదు తాను అనుకున్న మాదిరిగా యుద్ధం చేశాడు. అయిన వారి మీద గురు సమానులు పెద్దల మీదనే బాణాలు వేశారు. అది ధర్మం కోసం దేశం కోసం అన్నది అర్జునుడు ఆలోచన. మోడీ సైతం తాను ఈ జీవితాన్ని దేశానికే అంకితం చేయాలని అనుకున్నారు. ఆ క్రమంలో తనకు అంది వచ్చిన అవకాశాన్ని ఎక్కడా జారవిడుచుకోలేదు

వాటిని గట్టిగానే తనతోనే ఉంచుకుని దేశానికి తాను సేవ చేస్తున్నారు. మోడీ చేయి పట్టుకుని ఆర్ ఎస్ ఎస్ నుంచి బీజేపీ దాకా ఇంకా పదవుల దాకా నడిపించిన ఎందరో గురువులు ఉన్నారు. వారందరికీ ఆయన వందనాలు చెల్లిస్తూనే తన కర్తవ్య దీక్షలో మాత్రం అడుగు వెనక్కి వేయలేదు అని చెబుతారు. ఒక విధంగా ఆయన రాగద్వేషాలకు అతీతంగా నిలిచిన యోగి లాగా కనిపిస్తారు అని దగ్గర నుంచి చూసిన వారు చెప్పే మాట. ఆయన పట్టుదల ముందు అమెరికా అయినా ఓడాల్సిందే ఎవరైనా వీగాల్సిందే అన్నది తాజా పరిణామాలు సైతం అనేకం నిరూపించాయని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంది. దటీజ్ మోడీ అని కూడా చెప్పాల్సిందే.

Tags:    

Similar News