మోడీ రిటైర్ కారు...నాలుగోసారీ రెడీ !
మోడీ గద్దె దిగాలీ అంటే బీజేపీలోనే ముసలం పుట్టాలి. అంటే అక్కడే తిరుగుబాటు రావాలి. కానీ అది జరుగుతుందా అంటే అసంభవం అనే చెప్పాలని అంటున్నారు.;
నరేంద్ర మోడీ. ఈ దేశాన్ని గత పదకొండేళ్లుగా నిరాటంకంగా పాలిస్తున్న నాయకుడు. పదేళ్ళకు పైబడి ఈ దేశాన్ని పాలించిన వారిలో మొదటి ఇద్దరూ పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ అయితే మూడవ వారు కచ్చితంగా నరేంద్ర మోడీయే. ఈ దేశాన్ని వారిద్దరి తరువాత అత్యధిక కాలం పాలించిన క్రెడిట్ మోడీదే.
ఇక ఈ మూడవ టెర్మ్ ఆయన పూర్తి చేసుకుంటే వారి పక్కకు వచ్చేస్తారు. అటల్ బిహారీ వాజ్ పేయి వంటి నాయకుడు సాధించలేనిది లాల్ కృష్ణ అద్వానీ ప్రధానిగా కూడా కాలేనిది నరేంద్ర మోడీ ఈ విధంగా సాధించారు. 2013 దాకా జాతీయ రాజకీయ తెర మీద మోడీ లేరు. కానీ ఆయన వచ్చాక పోటీకి మరెవరూ మిగలలేదు.
మరి అంతటి రాజకీయ చాణక్యుడు, రాజనీతి కోవిదుడు అయిన నరేంద్ర మోడీ అలా ఊరకే రిటైర్ అయిపోతారు అని ఎవరైనా అనుకుంటే అది పప్పులోనే కాదు తప్పులోనూ కాలేసినట్లే. మోడీ అక్కడ ఉన్నది అన్నది గుర్తు పెట్టుకోవాల్సిందే ఎవరైనా అని అంటున్నారు.
నిజానికి మోడీ ప్రధానిగా ఉండడం ఎటూ ఆయన ప్రత్యర్ధులకు ఇండియా కూటమి భాగస్వాములకు ఇష్టం ఉండదు. ఇది సహజమైనది. కానీ ఎన్డీయే మిత్రులలో కొన్ని పార్టీలకు కూడా మోడీ రిటైర్ అయిపోవాలనే ఉందా అంటే ఉందీ అని అంటారు. కారణం మోడీ లాంటి నేతతో వారికి బయటకు చెప్పుకున్నంత ఈజీ ట్రావెలింగ్ అయితే కాదు అన్నది తెలిసే అంటున్నారు.
అయితే ఇలా వీళ్ళెవరికీ ఇష్టం లేదని మోడీ అర్ధాంతరంగా దిగిపోవాలా అంటే అబ్బే అది అసలు కుదిరే వ్యవహారమే కాదు అని అంటున్నారు. ఎందుకంటే మోడీ గత ఏడాది జూన్ 9న మూడోసారి ప్రధాని అయ్యారు. ఇంకా ఏడాది కూడా కాలేదు. పోనీ సెప్టెంబర్ కి అవుతుంది అనుకున్నా నిండా నాలుగేళ్ళ పదవిని ఉంచుకుని ఆయన ఎందుకు దిగిపోతారు అని అంటున్నారు.
మోడీ గద్దె దిగాలీ అంటే బీజేపీలోనే ముసలం పుట్టాలి. అంటే అక్కడే తిరుగుబాటు రావాలి. కానీ అది జరుగుతుందా అంటే అసంభవం అనే చెప్పాలని అంటున్నారు. పోనీ బీజేపీని రెండుగా చీల్చే పరిస్థితి ఉందా అంటే అది అసాధ్యం అని కూడా అంటున్నారు. మరి అలా కాకపోతే మోడీ ఎలా గద్దె దిగుతారు అంటే అసలు ఆయన దిగే సమస్యే లేదు అని అంటున్నారు.
ఇలా మోడీ ఇప్పటికిపుడు దిగిపోవాలని బలంగా కోరుకునే ప్రత్యర్థి పార్టీలలో మహారాష్ట్రకు చెందిన ఉద్ధవ్ థాక్రే శివసేన కూడా ఉంది. ఆ పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ ఇపుడు మోడీ గద్దె దిగడం గురించి ప్రస్తావిస్తున్నారు. అలా దిగిపోవడానికి ఆయనకు 75 ఏళ్లు నిండితే చాలు అని అందరికీ తెలిసిన ఒక బహిరంగ రహస్యం చెబుతున్నారు. కానీ అలా మోడీ దిగిపోయే చాన్స్ ఉందా అంటే నూటికి వేయి శాతం లేనే లేదు అని అంటున్నారు.
ఇంతకీ ఆయన చెబుతున్నది బీజేపీలో ఒక రూల్ ఉందని దాని ప్రకారమే మోడీ గద్దె దిగుతారని. ఒకసారి ఆ రూల్ చూసుకుంటే కనుక 75 ఏళ్ళు నిండిన వారు పదవి నుంచి దిగిపోవాల్సిందే అని. ఆ రూల్ బీజేపీలో ఉంది కానీ అది అందరికీ రూల్ కాదు. పైగా దానిని అమలు చేయమని అడిగే వారు ఎవరు ఉంటారు అక్కడ అన్నది మరో ప్రశ్న.
మోడీని మించిన శక్తివంతమైన నాయకులు ఉంటే అపుడు రూల్ బుక్ తీయవచ్చు. కానీ మోడీతో అల్లుకున్న బీజేపీలో ఆయన్ని కాదని ఏ రూల్ అయినా అమలు చేయగలరా అన్నదే కదా పాయింట్. ఇక చూస్తే కనుక ఈ రూల్ అన్నది ఒక సాధారణ నిబంధన గానే చూస్తున్నారు. అది మోడీ లాంటి శక్తివంతులకు అసలు వర్తించదు అని అంటున్నారు.
మోడీ 2022లో తాను మూడోసారి ప్రధాని అవాలని కోరుకున్నారు. అలా అయ్యారు. ఇక మోడీ హెల్త్ విషయం చూస్తే ఆయనతో పాతికేళ్ళ కుర్రాళ్ళు కూడా పోటీ పడలేరు. అంత పర్ఫెక్ట్ ఫిట్ నెస్ తో ఆయన ఉంటారు. మోడీకి ప్రజాకర్షణ లేదా అంటే కొండంత ఉంది. ఆయన ఇమేజ్ అంతర్జాతీయంగా నానాటికీ పెరుగుతూ పోతోంది.
ఇన్ని రకాలైన అనుకూలతలు ఉన్న మోడీ నాలుగోసారి కూడా ప్రధానిగా రెడీ అన్న సీన్ ఉంటే పాపం ప్రత్యర్థి పార్టీలు మోడీ దిగిపోతారు అని స్వయంతృప్తి ప్రకటనలు చేసుకుంటూ అందులోనే ఆనందం వెతుక్కుంటున్నాయా అంటే అదే అక్షరాలా నిజం అని అంటున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఎవరైనా ప్రధాని కావాలని అనుకున్నా ఆ సీటు ఇప్పట్లో అయితే ఖాళీ అయ్యేది లేదు. మోడీ తానుగా పదవీ విరమణ చేసిన తరువాతనే ఆశావహులు రేసులోకి రావాల్సిందే తప్ప ఇప్పటికైతే కలలుగానే వాటిని చూడాలని అంటున్నారు.
మోడీ అంతటి మేరు పర్వతాన్ని మధ్యలో దించేసి తాము ప్రధాని అవాలనుకోడం ఎంతటి అసాధ్యమో ఆ ఆశావహులకు కూడా బహుశా తెలుసు. అందుకే మోడీ ఇప్పట్లో రిటైర్ కారు. ఆ మాటకు వస్తే ఎపుడు రిటైర్ అవుతారూ అంటే అది ఆయన చేతుల్లోనే ఉంది తప్ప ఎవరి వల్ల కాదని తేలుతున్న సత్యం. సో మోడీ 2029లో కూడా ప్రధానిగా ప్రమాణం చేసే ముహూర్తం కోసం అంతా వేచి చూడదమే ఉత్తమమేమో.