మోడీ చెప్పినట్లే లైఫ్ స్టైల్ మార్చేయటం ఈజీనా?

పెట్రోలో.. డీజిల్.. గ్యాస్.. యూరియా ధరలు అమాంతంగా పెరిగినప్పటికి ప్రజలపై భారం పడకూడదన్న ఉద్దేశంతో ధరలు పెంచలేదన్న మోడీ..;

Update: 2026-05-11 05:37 GMT

దేశ ప్రజలకు ఎంతో ఇష్టమైన పనిని చేయొద్దని దేశ ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. కాసిన్ని డబ్బులు చేతిలో ఉంటే.. మొదటి ఆలోచన బంగారం కొనటంపైనే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. పెళ్లిళ్లు మొదలు కొని ప్రత్యేకంగా జరుపుకునే ఫ్యామిలీ ఫంక్షన్ల వరకు అన్నింటిలోనూ బంగారం కొనుగోలు చేయటం కనిపిస్తూ ఉంటుంది. బంగారానికి.. భారతీయులకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి బంగారం కొనుగోలు మీద ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయకపోవటం మంచిదన్న ఆయన.. అందుకు కారణాన్ని చెప్పుకొచ్చారు.

పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం అత్యంత ఖరీదైందిగా మారిందన్న ప్రధాని మోడీ.. విలువైన విదేశీ మారకద్రవ్యం పోతుందన్నారు. అక్కడితో ఆగని ఆయన పెట్రోల్.. డీజిల్ తో పాటు.. విదేశీ ప్రయాణాలు.. దుబారా ఖర్చుల్నిపూర్తిగా తగ్గించుకోవాలన్నారు. పెట్రోల్.. డీజిల్ ను పరిమితంగా వినియోగించాలన్న ఆయన.. అందులో భాగంగా ప్రజలు ప్రజా రవాణాను అధికంగా వాడాలని పిలుపునిచ్చారు. ఈ మాటలన్ని కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో చెప్పారు.

పెట్రోలో.. డీజిల్.. గ్యాస్.. యూరియా ధరలు అమాంతంగా పెరిగినప్పటికి ప్రజలపై భారం పడకూడదన్న ఉద్దేశంతో ధరలు పెంచలేదన్న మోడీ.. ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని చెబుతూ తాజాగా జరుగుతున్న యుద్ధాలను గురించి చెప్పుకొచ్చారు. ఈ యుద్ధాలతో సరఫరా చైన్ దెబ్బతిందని.. సదరు నష్టాల్ని కేంద్రమే భరిస్తోందన్న ఆయన.. వంటనూనెలు.. ఎరువుల మందుల వినియోగాన్ని తగ్గించాలని ప్రజల్ని కోరారు.

మోడీ కోరినట్లుగా బంగారాన్ని ఏడాది పాటు కొనుగోలు చేయకుండా ఉండటం సాధ్యమేనా? అంటే అంత తేలికైన పని కాదని చెప్పాలి. ఎందుకంటే.. భారతీయుల్లో అత్యధికులు బంగారాన్ని కొనుగోలు చేయటానికి చాలా ముందు నుంచే ప్లానింగ్ చేస్తుంటారు. ముఖ్యంగా ఫంక్షన్ల సమయంలో కొనుగోలు చేయాలని భావించే బంగారాన్ని వాయిదా వేయటం అంత తేలికైన విషయం కాదు. బంగరాన్ని భవిష్యత్ పెట్టుబడిగా.. పొదుపుగా.. ఫ్యూచర్ అవసరాలకు సాయం చేసేదిగా భావిస్తారు.

అలాంటప్పుడు బంగారాన్ని కొనటం తగ్గించమన్న ప్రధాని మోడీ మాటలకు ప్రభావం అంతగా ఉండకపోవచ్చనే చెప్పాలి. ఒకవేళ.. ఆయన మాటల్ని ప్రజలు సీరియస్ గా తీసుకోవాలంటే అందుకు బదులుగా ఏదైనా తాయిలాన్ని ప్రకటిస్తే మంచిది. అదెలా అంటే.. ఉదాహరణకు బంగారం మీద ఇప్పుడున్న పన్నులను ఏడాది తర్వాత తగ్గించే విషయంతో పాటు.. బంగారం కొనుగోలుతో వచ్చే ధీమాకు సరిపడా కేంద్ర సర్కారు ప్రజలకు ఇవ్వగలిగితే.. ఆయన మాటల్ని పెద్ద ఎత్తున వినే వీలుంది. అదేం లేకుండా.. బంగారాన్ని కొనొద్దంటే.. కొనకుండా ఉండటం అంత తేలికైన విషయం కాదన్నది మర్చిపోకూడదు.

Tags:    

Similar News