చంద్రబాబు హిందీ ప్రసంగం... ప్రధాని మోదీ ట్వీట్ వైరల్
ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య స్నేహ బంధం రోజురోజుకు బలపడుతోంది.;
ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య స్నేహ బంధం రోజురోజుకు బలపడుతోంది. గురువారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ కర్నూలు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు హిందీ ప్రసంగం పట్ల ముగ్ధుడయ్యారు. జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూ ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ సభను ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభలో మాట్లాడిన చంద్రబాబు కొద్దిసేపు హిందీలో ప్రసంగించి ప్రధాని మోదీని ఆకట్టుకున్నారు.
సహజంగా తెలుగు లేదా ఇంగ్లీషులో మాట్లాడే సీఎం చంద్రబాబు బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు జరుగుతున్న మేలును వివరిస్తూ వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో బిహార్ లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని, ప్రధాని మోదీ జైత్రయాత్ర కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ఈ వీడియోను ఢిల్లీ వెళ్లిన వెంటనే ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. సీఎం చంద్రబాబు హిందీలో బాగా మాట్లాడారంటూ ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.
అంతేకాకుండా ఈ ప్రసంగం ద్వారా చంద్రబాబు బిహార్ లో ఎన్డీయే కార్యకర్తల హృదయాలను గెలుచుకున్నారని, ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పట్ల తన ప్రగాఢ నిబద్ధత ప్రదర్శించారని కొనియాడారు. ఇక కర్నూలు సభలో సీఎం చంద్రబాబు తొలిసారిగా హిందీలో మాట్లాడారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొనసాగడానికి ఏపీలో టీడీపీ ఎంపీల బలంతోపాటు బిహారులోని నితీశ్ కుమార్ పార్టీకి చెందిన జేడీయూ ఎంపీల బలమే ఆధారం.
గత ఎన్నికల్లో బీజేపీకి 240 స్థానాలు రాగా, సొంతంగా అధికారం చేపట్టానికి 32 సీట్ల దూరంలో నిలిచిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో మిత్రపక్షాల మద్దతుతో అధికారం కైవసం చేసుకున్న బీజేపీ ప్రధానంగా టీడీపీ, జేడీయూ ఎంపీల బలంపైనే ఆధారపడిందని విశ్లేషకులు చెబుతున్నారు. కీలకమైన స్థానంలో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించకపోవడం, పైగా కేంద్రం సహకారం తనకే కావాలన్నట్లు నడుచుకోవడంతో చంద్రబాబుపై ప్రధాని మోదీ దృక్కోణం మారిందని అంటున్నారు.
అందుకే చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా, ఏది కావాలని అడుగుతున్నా ప్రధాని మోదీ ఓకే చేస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు కుమారుడు రాష్ట్ర మంత్రి లోకేశ్ ను సైతం ప్రధాని ప్రోత్సహిస్తున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీని మరింత ఆకర్షించేలా బిహార్ లో ఎన్డీయే మరోమారు విజయం సాధిస్తుందని చంద్రబాబు మాట్లాడారని అంటున్నారు. జాతీయస్థాయిలో చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ వల్ల బిహార్ ఎన్నికల్లో ఆయన మాటలు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని, అందుకే ప్రధాని మోదీ ప్రత్యేకంగా చంద్రబాబు మాట్లాడిన మాటల వీడియోను షేర్ చేశారని అంటున్నారు.