చాలా మంది భ‌య‌ప‌డి నాపై సినిమా తీయ‌లేదు: ISRO నారాయ‌ణ‌న్

24 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత నంబి నారాయణన్ 2018లో వివాదాస్పద గూఢచర్యం కేసులో తనకు ప్ర‌మేయం లేద‌ని నిరూపించ‌గలిగారు.

Update: 2023-08-26 02:30 GMT

ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌' చిత్రం 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచినందుకు నంబి నారాయ‌ణ‌న్ సంతోషం వ్యక్తం చేశారు. 11 మంది సభ్యుల జ్యూరీకి నేతృత్వం వహించిన నిర్మాత కేతన్ మెహతా 2021 జాతీయ అవార్డులను ప్రకటించ‌గా.. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందించిన సినిమాని ఉత్త‌మ చిత్రంగా జూరీ ప్ర‌క‌టించింది. ఈ విజ‌యంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను అని నారాయణన్ మీడియాతో అన్నారు. జాతీయ గుర్తింపుతో ఈ చిత్రానికి ఇప్పుడు మరింత ప్రచారం లభిస్తుందని, ఎక్కువ మంది దీనిని చూస్తారని శాస్త్రవేత్త నారాయ‌ణ‌న్ అన్నారు.

24 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత నంబి నారాయణన్ 2018లో వివాదాస్పద గూఢచర్యం కేసులో తనకు ప్ర‌మేయం లేద‌ని నిరూపించ‌గలిగారు. 1994లో మీడియా హెడ్ లైన్స్ లో నిలిచిన ఈ గూఢచర్యం కేసులో ఇద్దరు శాస్త్రవేత్తలు ..ఇద్దరు మాల్దీవుల మహిళలు సహా మరో నలుగురు క‌లిసి భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి సంబంధించిన కొన్ని రహస్య పత్రాలను విదేశాలకు బదిలీ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

నారాయణన్‌పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని సీబీఐ తేల్చడానికి ముందు దాదాపు రెండు నెలల జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఈ కేసును మొదట రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేసి, ఆ తర్వాత కేంద్ర ఏజెన్సీకి అప్పగించారు. వారు పోలీసుల‌ ఆరోపణలను తప్పుగా గుర్తించారు.

''కోర్టులో గెలిచిన తరువాత నేను నా కథను యువతరానికి చెప్పాలనుకున్నాను. నేను సినీ పరిశ్రమలోని చాలా మంది స్నేహితులను సంప్రదించాను. కానీ ఈ సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. వారు లాభదాయకంగా ఉండకపోవచ్చని భావించారు. కేసుపై స్టే విధించవచ్చు లేదా కోర్టు విచారణలు ఉండవచ్చ‌నే సందిగ్ధ‌త‌లతో వారు భయపడి ఉండవచ్చు'' అని నారాయణన్ అన్నారు. ఆ తర్వాత నటుడు ఆర్ మాధవన్ ముందుకు వచ్చి దానిపై సినిమా తీశారని చెప్పారు.

మాధ‌వ‌న్ తన అన్ని కమిట్‌మెంట్‌ల నుండి బయటకు రావడానికి సుమారు ఒక సంవత్సరం పట్టింది. మేము సినిమా గురించి చర్చించడానికి ఒక సంవత్సరం గడిపాము అని నారాయణన్ తెలిపారు. ప్ర‌తిష్ఠాత్మ‌క జాతీయ అవార్డును మాధ‌వ‌న్ తన తల్లిదండ్రులు స‌హా నారాయణన్‌కు అంకితమిచ్చారు.

Tags:    

Similar News